Viral News in Telugu: పీతలు పట్టుకునేందుకు వెళ్లి ఐదుగురు చిన్నారులు అడవిలో తప్పిపోయారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన వెలుగు చూసింది. పీతల కోసం హిల్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడ చాలా సేపు తిరిగారు. ఆ తరవాత దారి మరిచిపోయారు. బయటకు ఎలా రావాలో అర్థం కాక భయపడిపోయారు. అందరి వయసూ 12 ఏళ్లలోపే. ఏం చేయాలో అర్థం కాక సాయం కోసం గట్టిగా కేకలు పెట్టారు. చాలా సేపటి తరవాత స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాదాపు 7 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ (NDRF) సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాత్రి ఈ ఆపరేషన్ మొదలు పెట్టగా 7 గంటల తరవాత ఆ చిన్నారులను గుర్తించారు. 


"ఆజాద్‌నగర్‌కి చెందిన ఐదుగురు బాలలు సాయంత్రం 5 గంటల సమయంలో ఖాదీ మెషీన్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పీతలు దొరుకుతాయని ఎవరో చెప్పారు. వాటిని పట్టుకోడానికి అందరూ కలిసి వెళ్లారు. కానీ వాళ్లు దారి తప్పిపోయారు. బయటకు వచ్చే మార్గం తెలియక గట్టిగా కేకలు వేశారు. స్థానికులు గుర్తించి మాకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది"


- అధికారులు


అయితే..ఈ రెస్క్యూ ఆపరేషన్‌కి చాలా సవాళ్లు ఎదురయ్యాయని అధికారులు వెల్లడించారు. హిల్‌ స్టేషన్‌ కావడం, వర్షం పడడంతో పాటు చీకటి అవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకు ఆ ఐదుగురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.