‘Bhole Baba’ Reacts To Hathras ‘satsang’ Stampede: ఉత్తరప్రదేశ్(UP) హథ్రాస్(Hathras) జిల్లాలో సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బోలే బాబా(Bhole Baba).. ఈ దుర్ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనుకు కేంద్ర బిందువుగా ఉన్నా నారాయణ్ సాకార్ హరి అలియాస్ బోలే బాబా... ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించారు.
121 మంది మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న బోలేబాబా... ఈ బాధను భరించే శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడని అన్నారు. ప్రభుత్వంపై, పరిపాలనపై నమ్మకం ఉంచాలని తన భక్తులకు, ప్రజలకు బోలే బాబా హితబోధ చేశారు. ఈ తొక్కిసలాట వెనక ఉన్నవారిని ఎవరినీ విడిచి పెట్టవద్దని... వారందరికీ శిక్ష పడుతుందన్న నమ్మకం తనకుందని బోలే బాబా.. ఓ వీడియోను విడుదల చేశారు.
మరణించిన వారి కుటుంబాలకు.. క్షతగాత్ర కుటుంబాలకు అండగా ఉంటానని... వారికి జీవితాంతం సాయం చేస్తూనే ఉంటానని భోలే బాబా ఆ వీడియో ప్రకటనలో తెలిపారు. " జూలై 2న జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ ఘటనతో నేను చాలా బాధపడ్డాను. దేవుడు మాకు ఈ బాధను భరించే శక్తిని ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, పాలనపై విశ్వాసం ఉంచండి" అని ఆ వీడియోలో బోలే బాబా తెలిపారు.
బోలేబాబా నిర్వహించిన సత్సంగం కార్యక్రమంలో 2.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. భోలే బాబా పాద ధూళిని సేకరించేందుకు భక్తులు ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరిగింది. ప్రజలు ఒకరిపై ఒకరు పడడంతో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 80,000 మందికే అనుమతి ఇచ్చిన అంతకుమించి ప్రజలు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అయితే నిర్వహకుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణమని విచారణలో అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.
విచారణకు సహకరిస్తాం
భోలే బాబా తొక్కిసలాట జరిగినప్పటి నుంచి అదృశ్యమయ్యారు. అయితే బోలేబాబా విచారణకు పూర్తిగా సహకరిస్తారని ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. తమ వద్ద బాధితుల జాబితా ఉందని... తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, వివాహ ఖర్చులను.. బోలే బాబాను చూసుకుంటారని... నారాయణ్ సకర్ హరి ట్రస్ట్ ఆ బాధ్యతలు తీసుకుంటుందని ఏపీ సింగ్ వెల్లడించారు.
ఈ సత్సంగ్ కార్యక్రమంలో ప్రధాన నిందితుడు, ప్రధాన సేవదారు దేవప్రకాష్ మధుకర్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హత్రాస్ పోలీసులు తెలిపారు. మధుకర్ అరెస్ట్‌తో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే మధుకర్‌కు పోలీసులు అరెస్ట్ చేయలేదని... ఆయనే లొంగిపోయారని... బోలే బాబా తరపు లాయర్ తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని... కాబట్టి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోమని ఏపీ సింగ్ వెల్లడించారు.
తొక్కిసలాటకు సంబంధించి మధుకర్‌పై హత్రాస్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతని సమాచారం ఇచ్చినవారికి లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మధుకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్గనైజింగ్ కమిటీలో భాగమైన ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా మరో ఆరుగురిని కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. తొక్కిసలాటపై సిట్ నివేదిక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చేరింది. భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ ఇప్పటివరకు 90 మంది వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది .