Attack on Sadhus in Bengal: 


బెంగాల్‌లో ఘటన..


గంగాసాగర్ మేళాకి వెళ్తున్న సాధువులపై బెంగాల్‌లో దాడి జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. వాళ్లు కిడ్నాపర్‌లుగా అనుమానించిన స్థానికులు ఒక్కసారిగా మీద పడిపోయి దాడి చేశారు. బెంగాల్‌లోని పురులియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. రాజకీయంగానూ ఈ ఘటన కలకలం రేపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య వాగ్వాదానికి దారి తీసింది. గంగాసాగర్ మేళాకి వెళ్లే సమయంలో దారి తెలియక ఓ చోట ఆగిపోయారు సాధువులు. అటుగా వెళ్తున్న మహిళలను దారి అడిగారు. ఆ సాధువులను చూసి ఒక్కసారిగా హడలిపోయారు ఆ మహిళలు. ఆ సాధువులు మహిళల్ని వేధిస్తున్నట్టుగా అనుమానించిన స్థానికులు ఒక్కసారిగా వాళ్లపై దాడి చేశారు. అయితే...కొంత మంది ముస్లింలు కావాలనే దాడి చేశారన్న కొందరు వాదించారు.  పోలీసులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ సాధువులను రక్షించారు. వాళ్లు గంగాసాగర్‌కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిపై ఇప్పటికే బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శిస్తోంది. కొంత మంది బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా బెంగాల్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


"ఇది దారుణమైన ఘటన. గంగాసాగర్ మేళాకి వెళ్తున్న సాధువులపై ఇంత ఘోరంగా దాడి చేస్తారా..? తృణమూల్‌ పానలలో శాంతిభద్రతలు ఇలా ఉన్నాయి. ఇలాంటి ఉగ్రవాదుల్ని మమతా సర్కార్‌ కావాలనే కాపాడుతోంది. బెంగాల్‌లో హిందువులకు రక్షణే లేదు"


- లాకెట్‌ ఛటర్జీ, బీజేపీ ఎంపీ






అయితే...దాడి చేసిన వాళ్లపై కేసు పెట్టేందుకు ఆ సాధువులు ఒప్పుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని తెలిపారు. అటు తృణమూల్‌ నేతలూ స్పందించారు. కొంత మంది కావాలనే సాధువులపై దాడి చేసినట్టు కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని ఇందులో నిజం లేదని తేల్చి చెప్పారు. నిజమేంటో పోలీసులే చెబుతారని అన్నారు.