Hrithik Roshan Diet: బాలీవుడ్‌లోని చాలామంది హీరోలు తమ ఫిజిక్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా సిక్స్ ప్యాక్‌తో బాడీ రావడానికి చాలా కష్టపడతారు. కొన్నిరోజుల పాటు ఏమీ తినకుండా ఉండడానికి కూడా సిద్ధమవుతారు కూడా. అలా ప్రతీ సినిమాలో తన ఫిజిక్‌లో ఇంప్రూవ్ చేసుకోవడానికి కష్టపడే హీరోల్లో హృతిక్ రోషన్ కూడా ఒకరు. ఇక తన అప్‌కమింగ్ మూవీ ‘ఫైటర్‌’లో హృతిక్ రోషన్ లుక్, ఫిజిక్.. ఆడియన్స్‌కు చెమటలు పట్టిస్తోంది. దీంతో అసలు ఆ ఫిజిక్ ఎలా వచ్చిందో, హృతిక్ దానికోసం ఎంత కష్టపడ్డాడో తన ట్రైనర్ క్రిస్ గెథిన్ రివీల్ చేశారు. క్రిస్ గెథిన్.. గత పదేళ్లుగా హృతిక్ రోషన్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు.


ఉదయం 5 గంటల నుండే..
‘‘నేను కేవలం మంచిగా ఉంటూ నమ్మదగినవారితో మాత్రమే పనిచేయడానికి ఇష్టపడతాను. హృతిక్ రోషన్ అలాంటి వారిలో ఒకడని కచ్చితంగా చెప్తాను. తను చాలా నేచురల్‌గా ఉంటాడు, తనకు చాలా తెలివి ఉంది. తనకు ఏది వర్కవుట్ అవుతుంది, ఏది అవ్వదు అని స్పష్టంగా తెలుసు. ‘ఫైటర్’ కోసం ఉదయం 5, 6కు లేచేవాడు. 6 గంటల వరకు తన టిఫిన్‌ను పూర్తిచేసుకునేవాడు. తిన్న 45 నిమిషాల తర్వాత జిమ్‌కు వెళ్లేవాళ్లం’’ అని హృతిక్‌పై ప్రశంసలు కురిపించాడు సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెథిన్. హృతిక్ కనీసం గంట కూడా వర్కవుట్స్ చేసేవాడు కాదని.. కానీ ఆ గంటలో చేసే వర్కవుట్స్ చాలా ఇంటెన్స్‌గా, చాలా చాలా కష్టంగా ఉంటాయని బయటపెట్టాడు క్రిస్.


సరైన నిద్ర ఉండాలి..
‘‘గంటకంటే ఎక్కువగా ట్రైన్ అయితే మీరు సరిగ్గా వర్కవుట్ చేయడం లేదని అర్థం. మామూలుగా వారంలో అయిదు రోజులు మాత్రమే బరువు ఎత్తే వర్కవుట్స్ ఉండాలి. అవి కూడా నిద్రపోయే సమయంపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ సరిగా నిద్రపోతే అయిదు రోజులు వర్కవుట్ చేయాలి. సరిగా నిద్రపోకపోతే నాలుగు రోజులు వర్కవుట్ చేయాలి. ఎందుకంటే నిద్రపైనే పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. హృతిక్ రోషన్ రోజుకు ఒకసారి కార్డియో చేస్తాడు. ఒక్కొక్కసారి రోజుకు రెండుసార్లు కూడా చేస్తాడు. మేము అనుకున్న టార్గెట్‌కు ఎంత దూరంలో ఉన్నాం అనేదానిపై అది ఆధారపడి ఉంటుంది. పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, ఎలిప్టికల్, స్విమ్మింగ్.. ఎలా ఏదైనా కార్డియో కేటగిరికే చెందుతుంది. ఇక కచ్చితంగా 9 వరకు నిద్రపోవాలి. దానికంటే అస్సలు లేట్ చేయకూడదు’’ అంటూ హృతిక్ తీసుకున్న ట్రైనింగ్ గురించి చెప్పుకొచ్చాడు క్రిస్. 


క్రెడిట్ అంతా చెఫ్‌కే..
‘‘హృతిక్ రోజుకు ఆరు నుండి ఏడుసార్లు తినేవాడు. ఒకవేళ తినలేకపోతే వాటిని షేక్స్ రూపంలో తాగేవాడు. కానీ ఎక్కువశాతం అది తినే రూపంలోనే ఉండేది. అది పూర్తిగా ఒక బాడీ బిల్డింగ్ డైట్. కొంచెం బోరింగ్‌గా, చప్పగా ఉండేది. కానీ అదృష్టం కొద్దీ తన చెఫ్ శుభం అన్నీ బాగా అరేంజ్ చేసేవాడు. ఎగ్ వైట్‌తో బర్గర్ చేసేవాడు. బర్గర్‌ను చికెన్ బ్రెస్ట్‌తో చేసేవాడు. అందులో బన్ ఎగ్ వైట్స్‌తో చేసేవాడు. అసలు తను అలా ఎలా చేసేవాడో నాకు అస్సలు ఐడియా లేదు. వాటన్నింటికి ఒక ఇండియన్ టేస్ట్ ఇచ్చేవాడు. హృతిక్‌తో ఎవరు పోల్చుకున్నా కష్టమే. తన బాడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తనకు మంచి జీన్స్ ఉన్నాయి. తనలాగా షేప్ అందరికీ రాలేదు. మనం మనలాగానే బెటర్ వర్షన్ అవ్వడానికి ప్రయత్నించాలి. అందరికీ ఒకే విధమైన క్యారెక్టర్ ఎలా అయితే ఉండదో.. అందరికీ ఒకే విధమైన ఫిజిక్ కూడా ఉండదు’’ అంటూ హృతిక్ రోషన్ చెఫ్‌కు ప్రత్యేకమైన క్రెడిట్‌ను ఇచ్చాడు క్రిస్ గెథిన్.


Also Read: జీ స్టూడియోస్‌ను బ్యాన్ చేయండి, అతడిని అరెస్ట్ చేయండి - నయనతార ‘అన్నపూర్ణి‘పై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు