Israeli Hostages Released: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19 ఆదివారం అమల్లోకి వచ్చింది. మొదటి దశలో భాగంగా నేడు హమాస్ (Hamas) 90మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ తెలిపింది. అంతకు ముందే, కాల్పుల విరమణ ప్రారంభం కాగానే హమాస్ 15 నెలల పాటు బందీగా ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను గాజా నగరంలో రెడ్ క్రాస్‌ సంస్థకు అప్పగించింది. తర్వాత వారిని ఇజ్రాయెల్ మిలిటరీ ఏరియాకు తరలించారు. ఇజ్రాయెల్‌కు బందీలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించామని, వారు ఆరోగ్యంగా ఉన్నారని రెడ్ క్రాస్ తెలిపింది.

బందీల విడుదలతో సంబరాలు

టెల్ అవీవ్‌లో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు వార్తలు రావడంతో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారంతా ఒకరినొకరు కౌగిలించుకుని, టెలివిజన్ స్క్రీన్‌పై అల్ జజీరా వార్తలను వింటూ ఆనందించారు. "చాలా నొప్పి, విధ్వంసం, ప్రాణనష్టం తర్వాత, నేడు, గాజాలో తుపాకులు శబ్దం ఆగిపోయింది" అని జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా తన చివరి రోజు అన్నారు. "మిడిల్ ఈస్ట్ కోసం గత మేలో నేను మొదట ముందుకు తెచ్చిన ఒప్పందం చివరకు ఫలించింది. గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈరోజు బందీలను విడుదల చేయడాన్ని మనం చూస్తున్నాం. ముగ్గురు ఇజ్రాయెల్ మహిళలు దాదాపు 470 రోజుల పాటు చీకటి సొరంగాల్లో బందీగా ఉన్నారు” అని చెప్పారు. ఇకపోతే ఇజ్రాయెల్ ఆదివారం 90 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్టు పాలస్తీనా ఖైదీల సంఘం జాబితా విడుదల చేసింది. ఈ 90 మందిలో 60 మంది మహిళలు, తొమ్మిది మంది మైనర్లు కూడా ఉన్నారు.

విడుదలైన ముగ్గురు మహిళలు ఎవరంటే..

హమాస్ విడుదల చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు 31 ఏళ్ల డొరిన్ స్టీన్‌బ్రెచర్, 28 ఏళ్ల బ్రిటిష్- ఇజ్రాయెలీ మహిళ ఎమిలీ డమారీ, మూడో వ్యక్తి 24 ఏళ్ల రోమీ గోనెన్. అక్టోబర్ 7,2023న డొరిన్ స్టీన్‌బ్రెచర్ కిబ్బుట్జ్ క్ఫార్ అజాలోని తన అపార్ట్‌మెంట్ నుంచి అపహరణకు గురయ్యారు. అదే సమయంలో ఎంిలీ డమారీ హమాస్‌కు బందీగా దొరికారు. అదే రోజు నోవా ఫెస్టివల్‌‌పై దాడి సమయంలో, అక్కడ్నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ రోమీ హమాస్‌కు బందీగా చిక్కారు. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, మొదటి దశలో భాగంగా వీరిని విడుదల చేశారు. ఒక ఇజ్రాయెల్ బందీని హమాస్ విడుదల చేస్తే, 30 మంది పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ విడుదల చేసేందుకు ఒప్పందం కుదరగా.., ముందుగా ముగ్గురు మహిళా బందీలను విడుదల చేయడంతో 90 మంది పాలస్తీనీయన్ ఖైదీలు విడుదలయ్యారు. తాము 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసినట్లు ఇజ్రాయెల్ తాజాగా తెలిపింది.

పలు నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో దాదాపు 10వేల మంది పాలస్తీనియన్లు ఉన్నారు. కాల్పుల విరమణ అమలులో ఉండటంతో, యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గజన్లు స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారు. సహాయక ట్రక్కులు కూడా ఇప్పటికే ఎన్‌క్లేవ్‌లోకి ప్రవేశించాయి.

Also Read : APPSC: రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలు, ఎంపిక ఇలా