Rains In AP And Telangana: వర్షాకాలం వచ్చి నెల దాటినా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు లేవు. పైగా ఉక్కపోత కొనసాగుతోంది. అడపాదడపా వర్షాలు పడుతున్నా... భూగర్భజలాలు కూడా పైకి రాలేదు. దీంతో... ఇంకా  వేసవికాలం కొనసాగుతూనే ఉందా..? అని అనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఇంకా వాటర్‌ ట్యాంకర్లు తిరుగుతూనే ఉన్నాయి. సరైన వర్షాలు పడి ఉంటే... ఇప్పటికే భూగర్భజలాలు మెండుగా ఉండేవి. కానీ... ఈఏడు ఆ పరిస్థితిలేదు. దీంతో... వర్షాల  కోసం ఎదురుచూస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఈ సమయంలో చల్లటి వాన కబురు చెప్తోంది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొడతాయని అంచనా వేస్తోంది. అంతేకాదు... తెలంగాణలో అన్ని  జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఈ వర్షాలతో అయినా ఉక్కపోత పోయి... వర్షాకాలం వచ్చిందే ఫీలింగ్‌ వస్తుందేమో చూడాలి.


ఏపీలో 3రోజుల పాటు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే  మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ (Andrapradesh)లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే...  రాయలసీమతోపాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపారు. విశాఖ, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కరవొచ్చని  అంచనా వేస్తున్నారు. వర్షం పడే సమయంలో... గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణ, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల,  శ్రీసత్యసాయి, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ.


తెలంగాణకు ఎల్లో అలర్ట్‌
తెలంగాణకు ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్టు ప్రకటించింది ఐఎండీ (IMD). హైదరాబాద్‌లో కూడ కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది. ఇవాళ మాత్రమే కాదు... ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని... వాతావరణ శాఖ  అధికారులు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలోకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక.. సాయంత్రం 4గంటల తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. వర్షం కురిసే సమయంలో గాలుల వేగం పెరగే  అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే... నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మెదక్‌, సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో కూడా వర్షాలు కురుస్తాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే... పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం ప్రభావంతో... మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు  కొనసాగనున్నాయి. మరోవైపు.. కేరళ నుంచి గుజరాత్‌ తీరం వెంబడి ద్రోణి వస్తరించి ఉంది. దీని కారణంగా... అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో... దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడతాయని అంచనా  వేస్తున్నారు. 


దేశవ్యాప్తంగా వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... 11 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదలతో... ఉత్తరాఖండ్‌ జలవిలయంగా మారింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది  నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగి పడి... రహదారులు మూతపడ్డాయి. వర్షాల కారణంగా ఇప్పటికే చార్‌ధామ్‌ యాత్ర కూడా ఆపేశారు. ఉత్తరాఖండ్‌తోపాటు... యూపీ, బిహార్‌, అసోంలో కూడా వర్షాలు పడుతున్నాయి. వీటితోపాటు...  ఇవాళ ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.