Jammu Kashmir News: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అక్‌నూర్‌లో బస్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్ము నుంచి శివ్‌కోరికి వెళ్తుండగా మార్గ మధ్యలో కాళీ ధర్ మందిర్ వద్ద ప్రమాదం జరిగింది. గాయపడ్డ వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూపీలోని హత్రాస్ నుంచి వస్తున్న బస్సు తండా ప్రాంతం వద్ద ప్రమాదానికి గురైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఆ తరవాత అధికారులకు సమాచారం అందించారు. ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అవసరమైన వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నాయి.
ఈ ఘటనపై జమ్ము జిల్లా మెజిస్ట్రేట్ స్పందించారు. అందరికీ సరైన విధంగా చికిత్స అందేలా చూస్తున్నామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు బాధితుల పరిస్థితులను పరిశీలిస్తున్నామని వివరించారు.
"ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లకి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. పరిస్థితిని సమీక్షించేందుకు హాస్పిటల్‌కి వచ్చాను. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎంత మంది చనిపోయారో ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చేలా లేదు"
- జమ్ము జిల్లా మెజిస్ట్రేట్