Will AB Venkateswara Rao get the posting : ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది.
ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఆదేశం
ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
వైసీపీ హయాంలో ఐదేళ్లూ పోస్టింగ్ లేక సస్పెన్షన్ లో ఉన్న ఏబీవీ
టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వరరావుకు వైసీపీ హయాంలో పోస్టింగ్ దక్కలేదు. మొదట ఆరు నెలలు ఆయన ఖాళీగా ఉన్నారు. తర్వాత ఆయనపై రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటు వేశారు. హైకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది.
ఒక్కరోజు అయినా పోస్టింగ్ దక్కుతుందా ?
సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంటే గత ఐదేళ్ల కాలంలో ఆయన పధ్నాలుగు రోజులు మాత్రం పోస్టింగ్‌లో ఉన్నారు సస్పెన్షన్ లో ఉన్న కాలంలో జీత భత్యాలు కూడా దక్కలేదు. అయితే క్యాట్ ఆదేశించినా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. అధికారికంగా ఆయన ఈ నెల 31వ తేదీన రిటైర్ అవుతున్నారు. అంటే.. రిటైర్మెంట్ కు ఒక్క రోజు మాత్రమే ఉంది. సస్పెన్షన్ లో ఉండగానే రిటైరవుతారా.. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం.. పోస్టింగ్ లభిస్తుందా అన్నది అధికారవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
ఏబీవీ వెెెంకటేశ్వరరావు టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడని వైసీపీ వర్గాలు అనుమానిస్తూంటాయి. ఈ కోణంలో ఆరోపణలు కూడా చేస్తూంటారు. అందుకే ఆయనకు ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి.