20 years after saving girl from tsunami IAS officer officiates her wedding in Tamil Nadu: తమిళనాడులోని నాగపట్నంలో ఐఏఎస్ ఆఫీసర్ రాధాకృష్ణన్ దంపతులు తమ చేతులుగా మీదుగా ఓ పెళ్లి చేశారు. మీనా అనే యువతిని ఓ బ్యాంక్ ఆఫీసర్ కు ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశారు. ఆ మీనా ఐఏఎస్ రాధాకృష్ణన్ దంపతుల కుమార్తె కాదు. కానీ వారు కుమార్తెలాగే భావించి సంరక్షించారు. ఇప్పుడు పెళ్లి కూడా తమ చేతుల మీదుగానే చేశారు.ఇంతకీ ఈ మీనా ఎవరు ?
అది 2004వ సంవత్సరం.. ముఫ్పై ఏళ్లు దాటిన వారికి 2004 అంటే గుర్తుకు వచ్చేది సునామీనే. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉన్న వారికి ఆ ఏడాది ఓ గండం. సునామీ వచ్చిన సమయంలో మత్య్సకారుల కుటుంబాలు కకావికలం అయిపోయాయి. ఆ సమయంలో నాగపట్నం జిల్లా కలెక్టర్ గా రాధాకృష్ణన్ పని చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఓ మత్య్సకార గ్రామంలో చిన్న పిల్ల ఏడుపు శిథిలాల కింద వినిపించింది. అతి కష్టం మీద బాలికను వెలికి తీశారు. అప్పుడు ఆ బాలిక వయసు మూడేళ్లు. ఆ బాలిక తప్ప కుటుంబం అంతా సముద్రానికి బలయ్యారని తెలుసుకున్న రాధాకృష్ణన్ దంపతులు.. ఆ బాలిక బాగోగుల్ని స్వయంగా చూసుకోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వ బాలికల గృహంలో ఆమెను సంరక్షించడం ప్రారంభించారు. సునామీ వల్ల అనాథలైన అనేక మంది పిల్లలు అక్కడ ఉండేవారు. చాలా మందిని ఇతరులకు దత్తత ఇచ్చారు కానీ..మీనా అని పేరు పెట్టి ఆ బాలిక సంక్షేమం, చదువులు అన్నీ తామే చూసుకుంటామని రాధాకృష్ణన్ దంపతులు చెప్పడంతో ఆమెను అక్కడే ఉంచి చదివించారు. రాధాకృష్ణన్ దంపతులు అప్పుడప్పుడు వచ్చి మీనాతో గడిపి వెళ్లేవారు. సెలవుల్లో తమ ఇంటికి తీసుకెళ్లేవారు.
ఆమెకు ఇప్పుడు పెళ్లి చేశారు. నాగపట్నంలోనే పని చేసే ఓ బ్యాంక్ ఆఫీసర్ తో సంబంధం కుదుర్చి పెళ్లి చేశారు. నాగపట్నం నుంచి ట్రాన్సఫర్ అయి వెళ్లిపోయినా సరే మీనా గురించి మర్చిపోకుండా..ఆమె చదువులతో పాటు జీవితంలో స్థిరపడేలా చేయడంతో అందరూ ఐఏఎస్ రాధాకృష్ణన్ దంపతుల్ని అభినందిస్తున్నారు.