1993 Train Blasts Case: 1993 నాటి బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాని (Abdul Karim Tunda Acquitted) రాజస్థాన్‌లోని స్పెషల్ కోర్టు విడుదల చేసింది. సరైనా సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించింది. 1992 లో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. అది జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా 1993లో లష్కరే తోయిబా భారత్‌లో పలు రైళ్లలో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడింది. ఈ బాంబులను అబ్దుల్ కరీమ్ తయారు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్‌కి జీవిత ఖైదు విధించింది. 1996 నాటి బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తతుం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు కరీమ్. దీంతో పాటు మరి కొన్ని బాంబు పేలుళ్ల కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతా అతడిని Dr Bomb గా పిలుస్తారు. 1993లో కోటా, కాన్‌పూర్, సికింద్రాబాద్, సూరత్‌ మీదుగా వెళ్తున్న రైళ్లలో బాంబు పేలుళ్లు జరగడం సంచలనం సృష్టించింది. అప్పటికే బాంబే బాంబు పేలుళ్లతో ఉలిక్కి పడిన ప్రజలకి ఇది మరింత షాక్‌నిచ్చింది. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన కోర్టు...సరైన సాక్ష్యాధారాలు లేవని కరీమ్‌ని విడుదల చేసింది. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగింది. కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.