Investment in Housing Properties By Super Rich Indians: సంపన్నులు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడుతున్నారు, సంపద ఎలా పెంచుకుంటున్నారు.. చాలా ఎక్కువ మందిలో ఉన్న ప్రశ్నలు ఇవి. ఇటీవల జరిపిన ఒక సర్వేలో దీనికి సమాధానాలు దొరికాయి.
రియల్ ఎస్టేట్ మీద ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదార్లందరికీ ఆసక్తి ఉంది. భారతదేశంలోనూ, స్థిరాస్తులను కొని, పక్కనబెట్టుకునే సంప్రదాయం ఉంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం ఎంత ఆకర్షణీయంగా మారింది అంటే.. భారత్‌లోని అత్యంత ధనవంతులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని ఈ రంగంలోకి మళ్లిస్తున్నారట. తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌లో ధనవంతుల పెట్టుబడి
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, బుధవారం, వెల్త్ రిపోర్ట్ 2024 విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, భారతదేశంలోని అత్యంత సంపన్నులు (అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ - UHNIs) తమ సంపదలో 32 శాతాన్ని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో (లగ్జరీ ఇళ్లు) పెట్టుబడిగా పెడుతున్నారు. సాధారణంగా, మన దేశ సంపన్నులు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ వందల కోట్ల విలువైన నివాస ఆస్తులను కొంటున్నారు.
సూపర్ రిచ్ అంటే ఎవరు?
30 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నికర సంపద కలిగిన భారతదేశ సంపన్నులను తన నివేదిక రూపకల్పన కోసం నైట్ ఫ్రాంక్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. 30 మిలియన్ డాలర్లను ప్రస్తుత విలువ ప్రకారం భారత కరెన్సీలోకి మారిస్తే, ఆ మొత్తం దాదాపు రూ. 250 కోట్లు అవుతుంది. 30 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తులను అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (UHNIs) లేదా సూపర్ రిచ్ అని పిలుస్తారు.
దాదాపు రూ. 250 కోట్ల దగ్గర సంపద ఉన్న వ్యక్తులను మధ్య తరగతి ధనవంతులుగా కూడా పిలవొచ్చు. వీళ్లు, విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, సూపర్ రిచ్ ఇండియన్స్‌కు ఉన్న నివాస ఆస్తుల్లో 14 శాతం ఆస్తులు దేశం వెలుపల ఉన్నాయి. సగటున, ఈ ధనికుల్లో ఒక్కొక్కరికి 2.57 ఇళ్లు ఉన్నాయి. గత సంవత్సరం, 28 శాతం మంది సూపర్ రిచ్ వ్యక్తులు తమ రెండో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గత సంవత్సరం, దాదాపు 12 శాతం మంది భారతీయ సూపర్ రిచ్‌లు, కొత్త హౌసింగ్ ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి డబ్బు కుమ్మరించారు. ఈ రంగంలో భవిష్యత్ దృక్పథం కూడా బాగానే ఉంది. 12 శాతం మంది భారతీయ సంపన్నులు 2024లో కూడా కొత్త హౌసింగ్ ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది.
ముంబైలో లగ్జరీ ఇళ్లకు పెరిగిన డిమాండ్
హౌసింగ్ ప్రాపర్టీపై సంపన్నులకు పెరిగిన ఆసక్తి వల్ల, దేశంలోని లగ్జరీ హౌసింగ్ విభాగంలో కొత్త బూమ్ కనిపిస్తోంది. భారతదేశంలోని పెద్ద నగరాల్లో, ముఖ్యంగా ముంబైలో, గత కొన్ని సంవత్సరాలుగా లగ్జరీ హౌసింగ్ ఆస్తులకు డిమాండ్ పెరిగింది.
'ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ 2023'లో ముంబై నగరం 8వ స్థానంలో ఉంది, ఏడాది క్రితం 37వ స్థానంలో ఉంది. ఈ సూచీలో నంబర్-1 మనీలా కాగా, దుబాయ్ రెండో స్థానంలో, బహమాస్ మూడో స్థానంలో ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి