11 Accused Arrested in Visakha Minor Gang Rape Case: విశాఖలో (Visakha) బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేయగా.. ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వీరంతా ఫోటోగ్రాఫర్లేనని తెలుస్తోంది. కీలక నిందితుడిగా ఉన్న యువతి ప్రియుడు ఇమ్రాన్, అతని స్నేహితుడు షోయబ్ పరారీలో ఉండగా, పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వీరి కోసం గాలింపు చేపట్టినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. తొలుత ప్రియుడు, అతని స్నేహుతుడు దారుణానికి ఒడిగట్టగా, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు బీచ్ వద్దకు వెళ్లిన బాలికను ఓ ఫోటోగ్రాఫర్ నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఫోటోగ్రాఫర్ స్నేహితులు సైతం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఇదీ జరిగింది
ఒడిశాలోని (Odisha) కలహండి జిల్లా పనిముండ్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం కుటుంబంతో సహా విశాఖ వచ్చాడు. నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో వాచ్మెన్ గా పని చేస్తూ కంచరపాలెంలో (Kancharapalem) నివసిస్తున్నాడు. అతని కుమార్తె రైల్వే న్యూ కాలనీలోని ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. డిసెంబర్ 17న ఇంటి నుంచి పనికి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం ఆమె స్వగ్రామంలో ఉన్నట్లు గుర్తించి డిసెంబర్ 22న విశాఖకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రేమ పేరుతో మోసం
భువనేశ్వర్ కు చెందిన ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలో 18న నగరంలోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం అతని స్నేహితుడిని కూడా అత్యాచారానికి ప్రోత్సహించాడు. బాలికను బెదిరించి ప్రియుడి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు వెళ్లింది. అక్కడ రోధిస్తుండగా.. పర్యాటకుల ఫోటోలు తీసే వ్యక్తి ఆమెను పరిచయం చేసుకున్నాడు. బాధిత బాలికను ఓదారుస్తున్నట్లు నమ్మించి పశువులా ప్రవర్తించాడు. జగదాంబ జంక్షన్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి.. అక్కడ గదిలో ఉంచాడు. అతడితో సహా స్నేహితులు 8 మంది రెండు రోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన బాలిక వారి నుంచి తప్పించుకుంది. భయంతో స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదైంది. దీంతో ఫోర్త్ టౌన్ పోలీసులు విచారించి, సీసీ ఫుటేజీల ఆధారంగా బాలికను గుర్తించి 22న తల్లిదండ్రులకు అప్పగించగా జరిగిన విషయాన్ని ఆమె వారితో చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రియుడు, అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.
మహిళా కమిషన్ సీరియస్
మరోవైపు, ఈ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమోటోగా స్వీకరించి, సమగ్ర విచారణ చేపట్టాలని.. పూర్తి వివరాలు అందజేయాలని విశాఖ సీపీకి కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని చెప్పారు.