Disputes in Yanamala Ramakrishnudu Constituency: టీడీపీలో ట్రబుల్‌ షూటర్‌, చాణక్యునిగా ముద్ర ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాఖాలో వివాదాలు నివురుగప్పిన నిప్పులా మారాయని తేలిపోయింది. తుని నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతలు రామకృష్ణుడు కుమార్తె దివ్యకు అప్పగించింది పార్టీ అధిష్టానం. ఇదిలా ఉంటే నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణుడు, దివ్య వేదికపైనే ఉండగానే అక్కడకు విచ్చేసిన రామకృష్ణుడు చిన్నాన్న కుమారుడు యనమల కృష్ణుడు, రామకృష్ణుడు అన్న యనమల నాగేశ్వరరావు కుమారుడ రాజేష్‌ వర్గీయులు బాహాబాహీలకు దిగడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతవరకు యనమల కుటుంబంలో ఉన్న విభేధాలు నివురుగప్పిన నిప్పులా ఉండగా ఇప్పుడు ఒకే వేదిక వద్ద వాగ్వాదాలకు దారి తీయడంతో ఒక్కసారిగా బట్టబయలయ్యాయి.


ఇదీ జరిగింది


నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసే పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం వేదికను కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు గెడ్లవీడులో ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె దివ్య(నియోజకవర్గ ఇంచార్జ్‌) వేదికపై ఉండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వరుస క్రమంలో వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొంత సమయానికి దివ్య వేదిక నుంచి దిగి వెళ్లిపోయారు. అయితే అక్కడకు తొండంగి మండలం నుంచి తన అనుచరులతో కలిసి యనమల రాజేష్‌ వచ్చి క్యూలైన్‌ నుంచి కాకుండా నేరుగా వేదికపైనున్న రామకృష్ణుడ్ని కలిసేందుకు వెళ్తుండగా కృష్ణుడు వర్గీయులు అడ్డుకుని వరుసగా రావాలని సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్‌ వర్గీయులు ముందుకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రాజేష్‌ వర్గీయులు, కృష్ణుడు వర్గీయులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇది కాస్త ముదిరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకునే వరకూ వెళ్లింది. పరిస్థితిని గమనించిన రామకృష్ణుడు, యనమల కృష్ణుడు ఇరు వర్గాల వారిని మందలించి అక్కడి నుంచి పంపిచేశారు.  


దివ్య రాకతో మారిన సీన్‌..


తుని నియోజకవర్గం అనగానే టీడీపీలో యనమల కుటుంబం పాత్రే కీలకంగా కనిపిస్తుంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు పోటీ చేయడం మానేశాక ఆయన తండ్రి సోదరుని కుమారుడు అయిన యనమల కృష్ణుడుని రంగంలోకి దింపారు. 2014లో యనమల కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అయితే తుని నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా యనమల రామకృష్ణుడు తిరుగులేని నేతగా వ్యవహరించగా ఆయన స్థానంలో కృష్ణుడు నియోజకవర్గ ఇంఛార్జీగా బాద్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన స్థానంలో దివ్యను ఇంఛార్జీగా నియమించడంతో కృష్ణుడు వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కొంత కాలం క్రితం ఓ ఆడియో కూడా వైరల్‌ అయ్యింది. 40 ఏళ్ల పాటు రామకృష్ణుడి విజయం కోసం పాటుపడితే ఇప్పుడు కుమార్తెను దింపి తనకు అన్యాయం చేస్తారా..? దీనిపై ప్రశ్నించాలన్నది సారాంశం.. అయితే చంద్రబాబు సోదరులిద్దరినీ పిలిపించి పరిస్థితి చక్కదిద్దారు. దివ్య గెలుపు కోసం కృషి చేస్తామని కృష్ణుడు మీడియా వేదికగా తెలిపారు.