Retro Review - 'రెట్రో' రివ్యూ: 'కంగువా' ఫ్లాప్ నుంచి బయట పడ్డారా? సూర్య సినిమా హిట్టా? ఫట్టా?
Retro Movie Review in Telugu: సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రెట్రో'. 'బుజ్జమ్మా' (తమిళంలో 'కణిమా') సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. మరి సినిమా? దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎలా తీశారు?
కార్తీక్ సుబ్బరాజ్
సూర్య, పూజా హెగ్డే, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, జయరామ్, నాజర్, విధు ప్రతాప్ తదితరులు
Suriya and Pooja Hegde's Retro movie review in Telugu: భారీ అంచనాల మధ్య విడుదలైన 'కంగువా' ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా తర్వాత 'రెట్రో'తో హీరో సూర్య శివకుమార్ థియేటర్లలోకి వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఆవిడ డీ గ్లామర్ లుక్‌లో నటించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? 'బుజ్జమ్మా' సాంగ్ హిట్ అయినంతగా సినిమా హిట్ అవుతుందా? లేదా?
కథ (Retro Movie Story): పారి అలియాస్ పారివేల్ కణ్ణన్ (సూర్య) అనాథ. తిలక్ (జోజు జార్జ్) దగ్గర అతని తండ్రి పని చేసేవాడు. అయితే... మాఫియా - గ్యాంగ్‌స్టర్ వ్యవహారాలు చేసే తిలక్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు పారి తండ్రి మరణిస్తాడు. అప్పట్నుంచి పారిని కన్నకొడుకుగా తిలక్ భార్య పెంచుతుంది. తొలుత పారిని కొడుకుగా యాక్సెప్ట్ చేయని తిలక్... తర్వాత తన మాఫియా వ్యాపారానికి అండగా ఉంటాడని కొడుకు అనడం మొదలు పెడతాడు.
రుక్మిణి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడిన పారి... ఆమెతో పెళ్లి తర్వాత మాఫియా - గ్యాంగ్‌స్టర్ పనులకు ముగింపు పలికి, వాటికి దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటాడు. అయితే... పెళ్లికి ముందు చేసిన ఒక 'గోల్డెన్ ఫిష్' డీల్ వల్ల తిలక్ - పారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. పెళ్లిలో గొడవ జరుగుతుంది. పారికి కన్మణి దూరంగా వెళుతుంది.
కన్మణి ఎక్కడికి వెళ్లింది? మళ్లీ పారి చెంతకు చేరిందా? లేదా? పారి ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ్నుంచి అండమాన్ వెళ్లడానికి కారణం ఏమిటి? ఆ దీవుల్లో ఏం జరిగింది? జడామణి ఎవరు? చివరకు ఈ కథ ఏ తీరానికి వెళ్లింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Retro Review Telugu): సూర్యకు తెలుగు, తమిళ భాషల్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉన్నారు. ఆయన్ను పక్కన పెడితే... జయాపజయాలకు అతీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ఆయన ఫ్లాప్ సినిమాల్లోనూ ప్రేక్షకులు మెచ్చిన క్యారెక్టర్లు - సన్నివేశాలు ఉన్నాయి. సో, సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ అనేసరికి గత ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాపై అంచనాలు పెరిగాయి.
ప్రేక్షకులలో అంచనాలకు తగ్గట్టు 'రెట్రో' ప్రారంభమైంది. 'హీరో అసలు నవ్వడు. అతని ముఖ్యంలో నవ్వు రాదు' - ఈ కాన్సెప్ట్ ఎగ్జైట్ చేస్తుంది. హీరోయిన్‌తో ప్రేమ కథ మొదలైన తీరు, పెళ్లి నేపథ్యంలో బుజ్జమ్మా పాట, ఆ పాట మధ్యలో తండ్రి కొడుకుల మధ్య గొడవ, ఆ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. కార్తీక్ సుబ్బరాజ్ ఏదో మేజిక్ చేస్తారని అనిపిస్తుంది. అయితే, ఆ ఆశ ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టదు. ఇంప్రెసివ్ స్టార్ట్ తర్వాత నెమ్మదిగా బోరింగ్ మూమెంట్ మొదలు అవుతుంది. కాసేపటికి కార్తీక్ సుబ్బరాజ్ తీసిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' ఛాయలు కనిపిస్తాయి.
హీరో ఎందుకు నవ్వడు అనే పాయింట్ దగ్గర మొదలైన కథ... అక్కడ్నుంచి ప్రేమ, బానిస బతుకులు, ఆ తర్వాత గాడ్ అండ్ మదర్ సెంటిమెంట్ మీదుగా ప్రయాణం చేసి చివరకు మళ్లీ పెళ్లి దగ్గర ఆగుతుంది. ఒక దశ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాలో చెప్పాలని అనుకున్నారో అర్థం కాదు. దీవిలో ప్రజలకు, హీరోకు మధ్య రిలేషన్ ఉందనే పాయింట్ దగ్గర సినిమా పూర్తిగా కొలాప్స్ అయ్యింది. సినిమాలో చాలా పాయింట్స్ చెప్పాలని ట్రై చేయడంతో ఏదీ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒక్క ఎమోషన్ కూడా పూర్తిగా రిలేట్ అయ్యేలా తీయలేదు.
కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు టెక్నికల్‌గా ఉన్నత స్థాయిలో ఉంటాయి. 'రెట్రో'లో సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం బావుంది. అయితే, 'బుజ్జమ్మా' పాట తప్ప మరొకటి బాలేదు. శ్రియ చేసిన స్పెషల్ సాంగ్ ట్యూన్ అసలు బాలేదు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బావుంది. ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ పడిన కష్టం స్క్రీన్ మీద కనిపించింది. ముగ్గురూ కలిసి వింటేజ్ లుక్ తీసుకొచ్చారు. యాక్షన్ కొరియోగ్రఫీ సహజంగా ఉంది. ఫైట్స్ అన్నీ రియలిస్టిక్‌గా తీశారు.
Also Read: 'హిట్ 3' రివ్యూ: క్యాప్చర్... టార్చర్... కిల్... నాని ఊచకోత హిట్టేనా? స్టైలిష్ విధ్వంసం ఎలా ఉందంటే?
సూర్య రెట్రో లుక్ బావుంది. ఆయన స్టైలిష్‌గా కనిపించారు. నటనలో ఇంటెన్స్ చూపించారు. ఫైట్స్ గానీ, ఎమోషన్స్ గానీ సహజంగా అనిపించాయంటే కారణం ఆయనే. డీ గ్లామరస్ పాత్రలో పూజా హెగ్డే లుక్, నటన కూడా అంతే సహజంగా ఉన్నాయి. ప్రేక్షకులకు కొత్త పూజా హెగ్డే కనిపిస్తారు. జోజు జార్జ్ విలనీ షేడ్స్ చూపిస్తూ కామెడీ చేశారు. జయరామ్ కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. నాజర్, ప్రకాష్ రాజ్ తదితరులను సరిగా వాడుకోలేదు. కింగ్ మైఖేల్ రోల్ చేసిన విధు ప్రతాప్ మంచి నటన కనబరిచారు. కానీ, అతని క్యారెక్టర్ సరిగా రాయలేదు.
నటుడిగా సూర్య శివకుమార్ తన టాలెంట్ ఎప్పుడో చూపించారు. తనను తాను నిరూపించుకున్నారు. 'రెట్రో'లో నటుడిగా మరోసారి వేరియేషన్ చూపించారు. ఆయన లుక్స్, నటనకు తోడు మంచి స్టోరీ కాన్సెప్ట్ కూడా యాడ్ అయ్యింది. కానీ, ఆ కథను కార్తీక్ సుబ్బరాజ్ అంతే ఎఫెక్టివ్‌గా స్క్రీన్ మీద తీసుకు రావడంలో ఫెయిల్ అయ్యారు. సూర్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తప్ప సినిమాను ఎంజాయ్ చేయలేరు.
Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు