Hit 3 Review - 'హిట్ 3' రివ్యూ: క్యాప్చర్... టార్చర్... కిల్... నాని ఊచకోత హిట్టేనా? స్టైలిష్ విధ్వంసం ఎలా ఉందంటే?
Hit 3 Movie Review in Telugu: నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 3' థియేటర్లలో విడుదలైంది. ప్రచార చిత్రాల్లో రక్తపాతం కనిపించింది. మరి తెర మీద? ఈ సినిమా ఎలా ఉంది?
శైలేష్ కొలను
నాని, శ్రీనిధి శెట్టి, సముద్రఖని, సూర్య శ్రీనివాస్, కోమలీ ప్రసాద్ సహా అతిథి పాత్రల్లో అడివి శేష్, కార్తీ
Nani's Hit 3 Movie Review In Telugu: 'మా అబ్బాయికి టీజర్, ట్రైలర్ చూపించలేదు. సినిమా కూడా చూపించను' అని 'హిట్ 3' విడుదలకు ముందు నాని స్పష్టంగా చెప్పారు. పద్దెనిమిదేళ్లు దాటిన ప్రేక్షకుల కోసం తీసిన సినిమా అని వివరించారు. ప్రచార చిత్రాల్లో బ్లడ్ బాత్, హింస కనిపించాయి. మరి సినిమాలో? శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.
కథ (Hit 3 Movie Story): అర్జున్ సర్కార్ (నాని) ఏసీపీ. 'హిట్'లో ఆఫీసర్. జమ్మూ కశ్మీర్‌లో డ్యూటీ చేస్తున్నప్పుడు మర్డర్ జరుగుతుంది. అది చేసిన హంతకుడిని పట్టుకుంటారు. అయితే, ఆ తర్వాత సేమ్ ప్యాట్రన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో మర్డర్స్ జరిగాయని తెలుస్తుంది. అన్నిటి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? అని అర్జున్ సర్కార్ అనుమానిస్తాడు. అప్పుడు డార్క్ వెబ్ గురించి తెలుసుకుంటాడు.
ఒక్క మర్డర్ ఇన్వెస్టిగేషన్ నుంచి భారీ రాకెట్ బయట పడుతుంది. అర్జున్ సర్కార్ అరుణాచల్ ప్రదేశ్ వెళతాడు. అక్కడ గ్యాంగ్ ఉంటుంది. వాళ్లు ఎవరు? మృదుల (శ్రీనిధి శెట్టి)తో అర్జున్ సర్కార్ ప్రేమ కథ ఏమిటి? ఆవిడ కూడా అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు వెళ్ళింది? వర్ష (కోమలీ ప్రసాద్), అర్జున్ తండ్రి (సముద్రఖని) ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Hit 3 Review Telugu): ప్రతి మనిషిలో కొంత జంతు ప్రవృత్తి ఉంటుంది - 'జగడం'లో దర్శకుడు చెప్పే మాట. మరీ అంత నాటుగా కాకుండా కాస్త క్లాసీగా చెప్పాలంటే... ఒక్కోసారి తెరపై క్రూరత్వాన్ని ఎంజాయ్ చేస్తారు. అందువల్ల కొత్త జానర్ తెరపైకి వచ్చింది. మితిమీరిన హింస, రక్తపాతం న్యూ ఏజ్ సినిమాగా మారింది. ఉదాహరణకు... మలయాళ సినిమా 'మార్కో'. ఆ తరహా చిత్రమే 'హిట్ 3'.
'హిట్ 3' (Hit 3 Review) టీజర్, ట్రైలర్ చూస్తే... మూవీ ఎలా ఉంటుందో ఐడియా వస్తుంది. అందుకు తగ్గట్టుగా సినిమా ఉంది. సినిమాలో మెయిన్ హైలైట్ అంటే... నాని పెర్ఫార్మన్స్, రియల్ సతీష్ యాక్షన్ కొరియోగ్రఫీ. దర్శకుడు శైలేష్ కొలను హీరో క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. అయితే... గీతకు అటు వైపు ఉన్న కల్ట్ గ్యాంగ్ చేసే పనులకు, గీతకు ఇటు వైపు ఖాకి డ్రస్‌లో ఉన్న నానికి డిఫరెన్స్ ఏమీ కనపడదు. అసలు అతను ఎందుకు అలా రియాక్ట్ అవుతాడు? ప్రవర్తిస్తాడు? అనేది అర్థం కాదు. దర్శకుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అటువంటి ఆలోచనలు వస్తే ఆ పాత్రకు కనెక్ట్ కావడం చాలా కష్టం. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే హత్యలు, ఆ యాక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ / సున్నిత మనస్కులకు నచ్చే అవకాశాలు తక్కువ. ఆ స్థాయిలో తెరపై రక్తం ఏరులై పారింది. ఆ హింసను ఎంజాయ్ చేయగలిగితే తప్ప థియేటర్లకు వెళ్లకండి.
ఇటువంటి కథ, సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు. ఒన్లీ తెరపై మేజిక్ మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే? కథ పరంగా చూస్తే... 'హిట్ 3'లో కొన్ని లాజిక్స్‌కు అన్సర్స్ కనపడవు. ఇంటెన్స్ యాక్షన్ మధ్యలో ప్రేమ కథ కాస్త అడ్డు తగులుతుంది. ఆ లవ్ స్టోరీ అవసరం ఉందా? అంటే... చిన్న ట్విస్ట్ కోసం వాడారు. నాని మీద దర్శకుడికి ఎక్కువ ప్రేమ కలగడంతో మిగతా క్యారెక్టర్స్ మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. మృదుల పాత్రను తొలుత ప్రేమికురాలిగా చూపించిన శైలేష్ కొలను... తర్వాత ఆమె ఐడెంటిటీ రివీల్ చేశాక అంత పవర్ ఫుల్ సీన్స్ రాయలేదు. ఆమెను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ చేసేశారు. తన పాత్రకు తగ్గట్టు ఆవిడ ఆలోచించినట్టు చూపించలేదు. అసలు విలన్ గ్యాంగ్ పర్పస్ ఏమిటనేది అర్థం కాదు. ఎందుకు హత్యలు చేస్తున్నారు? వాళ్ల గోల్ ఏమిటి? అనేది సరిగా చూపించలేదు. దాంతో కథ అసంపూర్తిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్టాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ క్యూరియాసిటీ కలిగించింది. సెకండాఫ్ అసలు విలన్ ఎవరో రివీల్ చేశాక ఎండింగ్ ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ, అక్కడి వరకు జర్నీ కాస్త సాగింది. మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి ఎగ్జైట్‌మెంట్ కలిగించింది. కథలో లోపాలను ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, టెక్నికల్ టీమ్ అవుట్ పుట్ కవర్ చేశాయి. మిక్కీ జే మేయర్ నుంచి ఇటువంటి ఆర్ఆర్ అసలు ఊహించలేదు. కొత్తగా ఉంది. ఆయన 'ది బెస్ట్' ఇచ్చారు. సన్నివేశాల్లో మూడ్ స్క్రీన్ మీద ఎలివేట్ కావడంలో సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ వందకు రెండొందల శాతం హెల్ప్ అయ్యాయి. సినిమాకు కొత్త కలర్ తీసుకు రావడంలో వాళ్లిద్దరి కృషి చాలా ఉంది. హాలీవుడ్ స్టైల్ ఫాలో అయినప్పటికీ... డిఫరెంట్ ఫీల్ తెచ్చారు. నిర్మాణంలో ప్రశాంతి తిపిర్నేని రాజీ పడలేదని సినిమా అంతటా తెలుస్తుంది.
Also Read: ప్రవస్తి ఆరాధ్య ఏమిట్లు? కాంట్రవర్సీలోనూ కులం గోల... గూగుల్ చేస్తున్న నెటిజన్లు
సినిమాలో ఒక డైలాగ్ ఉంది. నానిని చూసి ప్రతీక్ బబ్బర్ 'క్లాస్' అంటారు. అప్పుడు 'వాళ్ళూ అదే అనుకుని మోసపోయారు. ఒరిజినల్ (మాస్) చూపిస్తా' అని నాని అంటారు. నాని క్లాస్ హీరో అనేవాళ్లందరికీ తనలో మాస్ చూపించాలని 'హిట్ 3' చేసినట్టు ఉన్నారు. కత్తి పట్టుకుని ఆయన చేసే ఫైట్ క్లాసీగా ఉంది. కానీ, బాడీ మీద ఆ బ్లడ్ చూస్తే మాసీగా ఉంది. మాస్ క్యారెక్టర్ కోసం తన కంఫర్ట్ జోన్ నుంచి నాని బయటకు వచ్చారు. 'దసరా'లో క్యారెక్టర్ పరంగా లుంగీలో కనిపించారు. అది కామన్. కానీ, స్టైలిష్ డ్రస్ వేసుకుని 'హిట్ 3'లో కొన్ని కస్ వర్డ్స్ చెప్పారు. ఆయన నుంచి ఊహించని పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ, ఆ మాటలు వాడాల్సిన అవసరం ఉందా? అంటే లేదు అని చెప్పాలి.
మృదుల పాత్రలో శ్రీనిధి శెట్టి అందంగా నటించారు. ప్రేయసిగా కనిపించే సీన్స్ మాత్రమే కాదు... ఫైట్స్ కూడా చేశారు. కోమలీ ప్రసాద్ మంచి స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ చేశారు. సముద్రఖని, రావు రమేష్ తదితర సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. సినిమా చివరకు వచ్చేసరికి రెండు గెస్ట్ రోల్స్ ఉన్నాయి. ఆ రెండూ హైలైట్ అయ్యాయి.
మనలో జంతు ప్రవృత్తిని శాటిస్‌ఫై చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. వెండితెర మీద విపరీతమైన హింస అనండి లేదంటే స్టైలిష్ యాక్షన్ విధ్వంసం అనండి... ఆ జానర్ (మార్కో టైపు) ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మ్యాడ్ మ్యాక్స్ అడ్రినల్ రష్ ఇస్తుంది. మిగతావాళ్లు దూరంగా ఉండండి. నాని చెప్పినట్టు పిల్లలను తీసుకు వెళ్ళకండి. సున్నిత మనస్కులు మరింత దూరంగా ఉండండి. వాళ్లకు ఆ కిల్లింగ్స్ చూడటం టార్చర్ కింద ఉంటుంది.