Kingdom Of The Planet Of The Apes Telugu Review: ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్... ఈ ఫ్రాంచైజీకి తెలుగులో అభిమానులు ఉన్నారు. ఒరిజినల్ సిరీస్ తర్వాత 'రీబూట్ సిరీస్'లో తొలి సినిమా 'రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' 2011లో వస్తే... మూడేళ్ల తర్వాత 'డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' (2014)లో విడుదలైంది. ఆ తర్వాత 'వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' (2017) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు 'కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' అంటూ నాలుగో సినిమా తీసుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ: సీజర్ మరణించిన కొన్నేళ్ల (కొన్ని తరాల) తర్వాత ప్లానెట్ మీద మానవజాతి సంఖ్య క్రమంగా తగ్గింది. ప్లానెట్ అంతా కోతులే. కొండల్లో ఓ వానర సమూహం స్వేచ్ఛగా జీవిస్తుంటుంది. తమతో పాటు గరుడ పక్షులు పెంచుకోవడం వాళ్లకు అలవాటు. ఒక రోజు ఆ వానర సమూహంపై ప్రోక్సిమస్ సీజర్ (ఏప్) తన సైన్యంతో దాడి చేస్తాడు. బందీలుగా చేసుకుని వెళతాడు. అయితే, దాడిలో తప్పించుకున్న నోవా (ఏప్) తన జాతిని కాపాడుకోవడానికి బయలు దేరుతుంది. ఆ ప్రయాణంలో రాకా (ఏప్) పరిచయం అవుతాడు. తమను ఓ మనిషి మే (Freya Allan) అనుసరిస్తుందని వాళ్లిద్దరూ తెలుసుకుంటారు.
మే ఎవరు? నోవా తన జాతిని కాపాడుకున్నాడా? లేదా? మానవులు నిర్మించిన బంకర్ డోర్ ఓపెన్ చేయాలని ప్రోక్సిమస్ సీజర్ ఎందుకు ప్రయత్నించాడు? నోవా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సూర్య గరుడ చేసిన సాయం ఏమిటి? మే తన లక్ష్యాన్ని చేరుకుందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Kingdom Of The Planet Of The Apes Review Telugu): విజువల్స్... ప్రతి ఫ్రేములో గ్రాండ్ విజువల్స్... 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఫ్రాంచైజీ విజయాల్లో ప్రధాన భూమిక పోషించాయి. ఈ సిరీస్ విజయానికి ఆ విజువల్స్ & గ్రాండియర్ ఒక్కటే కారణం కాదు... వానర సమూహానికి, మనుషులకు మధ్య జరిగే సన్నివేశాలు (ఏప్ వర్సెస్ హ్యూమన్ సీన్స్), ఆ భావోద్వేగాలు ప్రేక్షకులను ఉద్వేగానికి, ఉత్కంఠకు గురి చేశాయి. సినిమాలో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తితో పాటు ఆ తెరపై జరుగుతున్న దృశ్యాలను కళ్లప్పగించి చూసేలా చేశాయి. 'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్'కి వచ్చే సరికి ఆ ఏప్ వర్సెస్ హ్యూమన్ కన్‌ఫ్రన్‌టేషన్ మిస్ అయ్యింది. మనుషులకు, వానరులకు మధ్య సరైన ఘర్షణ అనేది లేదు.
'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఫ్రాంచైజీలో సీజర్ పాత్రతో సహా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఫిల్మ్ మేకర్స్ సృష్టించారు. సీజర్ పాత్రను, ఆ ప్రపంచాన్ని 'కింగ్‌డమ్'లో సరైన రీతిలో వాడుకోవడంలో విఫలమయ్యారు. వానర సమూహం మీద మరొక సమూహం దాడి చేసి బానిసలుగా చేసుకుని తమ ప్రాంతానికి తీసుకెళ్లి... వాళ్లతో తమకు కావాల్సిన పనులు చేయించుకోవడం కొత్త ఏమీ కాదు. మనుషుల్లో ఒక తెగ మరొక తెగపై దాడి చేయడం, బానిసలు చేసుకుని పనులు చేయించుకోవడం చూశాంగా!
'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' మొదలైన గంట వరకు అధికార దాహం, దర్పం మాత్రమే కనిపించాయి. దాంతో ఇదొక సాధారణ కథగా మారింది. మే పాత్ర వచ్చిన తర్వాత కథలో ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తిని సన్నివేశాల్లో చూపించడంలో దర్శక రచయితలు ఫెయిల్ అయ్యారు. ఒక వైపు విజువల్స్, ఆ గ్రాండియర్ మెస్మరైజ్ చేస్తుంటే... మరొకవైపు సన్నివేశాల్లో ఎమోషనల్ డెప్త్ మిస్ కావడంతో తెరపై ఏప్ / హ్యూమన్ క్యారెక్టర్లతో కనెక్ట్ కావడం మిస్ అవుతూ ఉంటుంది. మనుషులకు మాట పడిపోవడానికి కారణం ఏమిటి? సీజర్ మాటల్ని, చరిత్రను ప్రోక్సిమస్ ఎలా వక్రీకరించి మిగతా వానరుల్ని తనవైపు తిప్పుకున్నది? చూపించలేదు. సమాధానం లేని ఇటువంటి ప్రశ్నలు 'కింగ్‌డమ్'లో ఉన్నాయ్.
Also Read: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
'కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఏప్స్'లో ఒక్క తరానికి చెందిన కథ చెప్పలేదు. వానర జాతిలో తర్వాత తరాల్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రతి జీవి యొక్క పరిణామ క్రమాన్ని, వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తోందనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే... సినిమాలో కేవలం అధికారం కోసం చరిత్రను ఒక ఏప్ ఎలా మార్చింది? మరొక ఏప్, ఓ మనిషి తన జాతిని కాపాడుకోవడం కోసం ఎలా పోరాడింది? అనేది మాత్రమే చూపించారు. ప్రేక్షకులు ఆయా పాత్రలతో ప్రయాణించేలా ఆ క్యారెక్టర్లను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. పతాక సన్నివేశాల్లో మే (మనిషి), నోవా (ఏప్) ఆకాశంలో నక్షత్రాల వైపు భవిష్యత్ కోసం ఆశగా ఎదురు చూస్తుంటే... సీక్వెల్ కోసం మనమూ ఆశగా చూడటం తప్ప 'కింగ్‌డమ్'తో పూర్తిగా సంతృప్తి చెందలేం. థియేటర్లలో ఈ సినిమా ఎందుకు చూడాలి? అంటే... జస్ట్ ఫర్ విజువల్ గ్రాండియర్ & యాక్షన్ సీక్వెన్సులు, అంతే!
Also Read: 'మిషన్ ఇంపాజిబుల్ 7' రివ్యూ : టామ్ క్రూజ్ లేటెస్ట్ సినిమా ఎలా ఉందంటే?