సినిమా రివ్యూ : కళ్యాణం కమనీయం 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దేవి ప్రసాద్, పవిత్రా లోకేష్, కేదార్ శంకర్, 'సత్యం' రాజేష్, సప్తగిరి తదితరులు
ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని 
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ 
నిర్మాణం : యువి కాన్సెప్ట్స్ 
రచన, దర్శకత్వం : అనిల్ కుమార్ ఆళ్ళ 
విడుదల తేదీ: జనవరి 13, 2022


యువ హీరోల్లో సంతోష్ శోభన్ (Santosh Shoban)ది భిన్నమైన శైలి. అతను ఎంపిక చేసుకునే కథాంశాలు సింపుల్‌గా, అదే సమయంలో అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటాయి. 'పేపర్ బాయ్', 'ఏక్ మినీ కథ', 'మంచి రోజులు వచ్చాయి' సినిమాలతో ఓ పేరు తెచ్చుకున్నారు. అయితే... 'లైక్ షేర్ సబ్‌స్కైబ్‌' విజయం అందుకోలేదు. మరి, 'కళ్యాణం కమనీయం'తో విజయం అందుకుంటారా? ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటి యువి క్రియేషన్స్ అనుబంధ సంస్థ యువి కాన్సెప్ట్స్ ఎటువంటి కథతో సినిమా నిర్మించింది? సినిమా ఎలా ఉంది? (Kalyanam Kamaneeyam Review)


కథ (Kalyanam Kamaneeyam Story) :  శివ (సంతోష్ శోభన్)కు ఉద్యోగం లేదు. ఆ విషయం తెలిసీ శ్రుతి (ప్రియా భవానీ శంకర్) ప్రేమిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్ళి చేసుకుంటుంది. ఆ తర్వాత ఎవరినీ డబ్బులు అడగొద్దని, ఎవరి దగ్గరా చేయి చాచవద్దని శివతో చెబుతుంది. ఉద్యోగం వచ్చే వరకు భర్త బాధ్యత తనదేనంటూ అతని అవసరాలకు డబ్బులు ఇస్తుంది. అంతా హ్యాపీగా ఉందనుకున్న శివకు షాక్ తగులుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడా శ్రుతి కొప్పడుతుంది. భర్తకు ఉద్యోగం ఉండాలని నొక్కి మరీ చెబుతుంది. శ్రుతి కోపానికి కారణం ఏమిటి? శివకు టాలెంట్ ఉన్నా, ఇంటర్వ్యూలలో బాగా సమాధానాలు చెప్పినా...  ఎందుకు ఉద్యోగం రాలేదు? నెల నెలా ఈఎంఐ కట్టేలా లోన్ తీసుకుని మరీ శివకు శ్రుతి 10 లక్షలు ఎందుకు ఇచ్చింది? ఆ డబ్బు ఏమైంది? శ్రుతికి ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి మరీ శివ ఎందుకు క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తాడు? అసలు... శివ, శ్రుతి మధ్య గొడవలకు మూల కారణం ఎవరు? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ : పెళ్ళి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే పెళ్ళి, భార్యా భర్తల అనుబంధం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. 'కళ్యాణం కమనీయం'లో కొత్తగా ఏం చెప్పారు? కథాంశం ఏమిటి? అంటే... అన్నిటి కంటే ముఖ్యంగా భార్యా భర్తల మధ్య నమ్మకం ఉండాలని చెప్పారు.


'కళ్యాణం కమనీయం'లో ఇచ్చిన సందేశం కొత్తది కాకపోవచ్చు. కానీ, కామన్ మ్యాన్ & యూత్ రిలేట్ అయ్యేలా ఉంది. సింపుల్ కథ, కథనం, సన్నివేశాలతో సినిమా తీశారు. ఈ తరం యువత తమను తాము చూసుకునేలా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ తెరకెక్కించారు. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ ఎంపికతో ఆయన మీద చాలా వరకు భారం తగ్గింది. ఆ జోడీ సింపుల్ సీన్‌ను కూడా చక్కగా, చూడబుల్‌గా మార్చేసింది. పెయిర్ ఫ్రెష్‌గా ఉండటంతో ఫీలింగ్ బావుంది. అయితే... భర్తకు ఉద్యోగం లేకపోవడం, భార్య జాబ్ చేస్తూ అతనికి డబ్బులు ఇవ్వడం, ఆ ఎపిసోడ్ 'జెర్సీ'లో ఎపిసోడ్‌కు కొంత దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.


కథలో ట్విస్టులు లేవు. ఉన్న చిన్న చిన్నవి కూడా ఊహించేలా ఉంటాయి. ఏదో ఒక సమయంలో ఆ ట్విస్ట్ ఎలా రివీల్ అవుతుందనేది ప్రేక్షకులకు అర్థమవుతుంది. కామెడీ మీద మరింత కాన్సంట్రేట్ చేసి ఉంటే బాగుండేది. హీరో & ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్స్ రొటీన్ చేశారు. అక్కడ కామెడీ డోస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బావుండేది. వివాహ బంధంలో ఇంకా డెప్త్‌కు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ... దర్శకుడు ఆ వైపు దృష్టి పెట్టలేదు. 


పాటలు బావున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం వినసొంపుగా ఉంది. నేపథ్య సంగీతం కథతో పాటు ప్రయాణించింది. కార్తీక్ ఘట్టమనేని  సినిమాటోగ్రఫీ కూడా బావుంది. యువి క్రియేషన్స్ సినిమాల్లో కలర్‌ఫుల్‌ విజువల్స్ ఉంటాయి. ప్రొడక్షన్ డిజైన్ కొత్తగా ఉంటుంది. యువి కాన్సెప్ట్స్ సినిమాలో కూడా కంటిన్యూ చేశారు. 


నటీనటులు ఎలా చేశారంటే? : సంతోష్ శోభన్ మరోసారి పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో చక్కగా నటించారు. క్యారెక్టర్‌లో ఎమోషన్స్ బాగా చూపించారు. పెళ్ళి,  ఉద్యోగం ప్రయత్నాల్లో ఉన్న యువత చాలా మంది శివ పాత్రతో రిలేట్ అవుతారు. శృతి పాత్రలో ప్రియా భవానీ శంకర్ కళ్ళతో నటించారు. ఆమె డ్రసింగ్ హుందాగా ఉంది. నవ్వు, కళ్ళు అందంగా ఉన్నాయి. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జోడీ బావుంది. స్క్రీన్ మీద ఎక్కువ సేపు ఇద్దరూ కనపడతారు. దేవి ప్రసాద్, పవిత్రా లోకేష్, కేదార్ శంకర్ పాత్రల నిడివి తక్కువే. తమ పరిధిలో అందరూ బాగా చేశారు. దేవి ప్రసాద్, ప్రియా భవానీ శంకర్ మధ్య పతాక సన్నివేశాలకు ముందు వచ్చే సీన్ యువతకు సందేశం ఇస్తుంది. 'సత్యం' రాజేష్ మూడు నాలుగు సన్నివేశాల్లో కనిపించారు. ఒకవేళ ఆయన కాకుండా మరొకరు అయితే కథ కన్విన్సింగ్‌గా అనిపించేది కాదేమో! కామెడీ రియాలిటీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న సద్దాం... హీరో స్నేహితుడిగా కనిపించారు.  


Also Read : వారసుడు రివ్యూ: దిల్ రాజు ‘వారసుడు’ ఎలా ఉంది? విజయ్‌కి హిట్టు లభించిందా?


చివరగా చెప్పేది ఏంటంటే? : ఎటువంటి అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా తీసిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా 'కళ్యాణం కమనీయం'. ఫ్యామిలీతో చూడదగిన సినిమా. దంపతుల మధ్య నమ్మకం ఉండాలని సందేశం ఇచ్చిన సినిమా. చాలా సింపుల్ స్టోరీ ఇది. యూత్ రిలేట్ అయ్యేలా సినిమా తీశారు. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జోడీ తమ నటనతో ఆకట్టుకుంటారు. లవర్స్‌, న్యూలీ మ్యారీడ్‌ కపుల్స్‌కు టైమ్‌పాస్‌ సినిమా.   


Also Read : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే?