Extra Ordinary Man Review
సినిమా రివ్యూ: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్!
రేటింగ్: 2.5/5
నటీనటులు: నితిన్, శ్రీ లీల, రాజశేఖర్, రావు రమేష్, రోహిణి, సుదేవ్ నాయర్, బ్రహ్మజీ, 'హైపర్' ఆది, సోనియా సింగ్, రవి వర్మ తదితరులు
ఛాయాగ్రహణం: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్
సంగీతం: హ్యారీస్ జయరాజ్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ
విడుదల తేదీ: డిసెంబర్ 8, 2023
Extra Ordinary Man movie review In Telugu: 'కిక్', 'ఊసరవెల్లి', 'ఎవడు', 'రేసు గుర్రం', 'టెంపర్' వంటి హిట్ సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించారు. 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా మారారు. అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ, అల్లు అర్జున్ పాత్రకు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత కొంత విరామం తీసుకుని 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చేశారు. నితిన్, శ్రీ లీల జంటగా నటించిన చిత్రమిది. ఇందులో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Extra Ordinary Man Story): అభి (నితిన్) జూనియర్ ఆర్టిస్ట్. తండ్రితో పాటు ఎవరేం తిట్టినా, హేళన చేసినా సరే పట్టించుకోడు. ఎప్పటికైనా బ్యాగ్రౌండ్ నుంచి కెమెరా ముందుకు రావాలనేది జీవిత లక్ష్యం. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ జరుగుతున్న సమయంలో పెద్ద కంపెనీకి ఓనరైన లిఖిత (శ్రీ లీల) పరిచయమవుతుంది. ఆమెకు సమస్యలను పరిష్కరించడంతో ప్రేమలో పడుతుంది. కంపెనీకి అభిని సీఈవో చేస్తుంది. ఆ సమయంలో తండ్రి సోమశేఖర్ (రావు రమేష్)కి కాలు విరగడంతో యాక్టర్ కావాలనే ఆశ పక్కన పెట్టి ఉద్యోగం చేయడం మొదలు పెడతాడు. అంతా హ్యాపీగా జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేసేటప్పుడు పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్ ఒకడు వస్తాడు.
ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన వాస్తవ ఘటనలు ఆధారం చేసుకుని తాను ఒక కథ రాశానని, అందులో హీరోగా నటించమని అభి దగ్గరకు వస్తాడు. ఫ్యామిలీ, లవర్, జాబ్ వదిలేసి వచ్చేస్తాడు. కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు. కట్ చేస్తే... అభిని పక్కన పెట్టి మరో హీరోతో సినిమా చేయడానికి ఆ దర్శకుడు రెడీ అవుతాడు. ఏం చేయాలో తెలియక మందు కొడుతున్న హీరోకి రియల్ విలన్ నీరో (సుదేవ్ నాయర్) తమ్ముడితో గొడవ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఊరికి ఎస్సై సాయినాథ్ (నితిన్)గా వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) ఏం చేశారు? సాయినాథ్ అలియాస్ అభి ఫ్యామిలీకి, ప్రియురాలికి అతడు షూటింగ్ చేయడం లేదని ఎస్సైగా యాక్టింగ్ చేస్తున్నాడని తెలిసిందా? నీరో, విజయ్ చక్రవర్తి, ఆ ఏరియా మనుషులకూ జూనియర్ ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Extra Ordinary Man Telugu Movie Review): వక్కంతం వంశీ కథల్లో హీరో క్యారెక్టరైజేషన్ సంథింగ్ స్పెషల్ అన్నట్లు డిజైన్ చేస్తారు. కథ రెగ్యులగ్‌గా అయినా, హీరో క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ వల్ల సన్నివేశాలు కొత్తగా కనపడతాయి. కిక్, టెంపర్ క్లిక్ అయ్యాయంటే కారణం ఆ క్యారెక్టరైజేషన్లే! 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'కు వస్తే... సిట్యువేషన్ ఏదైనా సూపర్బ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం హీరో అలవాటు. ఆర్డినరీ సీన్‌లో ఎక్స్‌ట్రా చేస్తాడు. అటువంటి జూనియర్ ఆర్టిస్ట్ ఎస్సైగా వెళితే ఏం చేశాడు? అనేది ఇంట్రెస్టింగ్ & క్యూరియాసిటీ క్రియేట్ చేసే అంశమే.
ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్... 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' స్టార్ట్ టు ఎండ్ వక్కంతం వంశీ కామెడీ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేశారు. ఆ క్రమంలో కథను పక్కన పెట్టేశారు. అసలు, సినిమా ప్రారంభించిన టోన్, ఎండ్ చేసిన టోన్ మధ్య సంబంధం లేదు. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్లు మాస్ జనాలను ఎంటర్టైన్ చేస్తాయి. నితిన్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోతో అడపాదడపా కాస్త డబుల్ మీనింగ్ ఫన్ వర్కవుట్ చేయడం ఆశ్చర్యమే. కథతో సంబంధం లేకుండా ఫస్టాఫ్ చెప్పుకోదగ్గ ఎంటర్టైన్మెంట్ అందించిన వక్కంతం వంశీ... ఇంటర్వెల్ తర్వాత మరీ రొటీన్ ఫార్మటులో వెళ్ళడంతో ఫన్ మధ్య బోరింగ్ మూమెంట్స్ వచ్చాయి. అక్కడ క్యారెక్టరైజేషన్ క్లిక్ కాలేదు.
హ్యారిస్ జయరాజ్ పాటల్లో 'డేంజర్ పిల్లా' బావుంది. 'ఓలే ఓలే పాపాయి' మాస్ బీట్ బి, సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్ సినిమాకు పని చేశారు. కెమెరా వర్క్ ఓకే. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. ఓ అరగంట కట్ చేస్తే కమర్షియల్ ఫార్మటులో సినిమా కాస్త పరుగు తీసేది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. నితిన్ తండ్రి, అక్క నిర్మాతలు కావడంతో ఖర్చుకు రాజీ పడలేదు.
నటీనటులు ఎలా చేశారంటే: నితిన్ తప్ప మరొకరు ఆ జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేయలేరేమో!? నటుడిగా ఆయన సవాల్ విసిరే సీన్లు లేవు. తానొక హీరో అనేది పక్కన పెట్టేసి మరీ కొన్ని సీన్లు చేశారు. రాజశేఖర్ ముందు ఆయన మేనరిజం ఇమిటేట్ చేశారు. 'నా పెట్టే తాళం' వంటి పాటకు డ్యాన్స్ చేశారు. క్యారెక్టర్ & డైరెక్టర్ ఏది డిమాండ్ చేస్తే అది చేశారు. ఇంటర్వెల్ ముందు ఒకలా, తర్వాత మరోలా... రెండు షేడ్స్ చూపించారు.
రాజశేఖర్ స్పెషల్ అప్పియరెన్స్ బావుంది. ఆయన పాత్రకు పవర్ ఫుల్ అన్నట్టు పరిచయం చేశారు. కానీ, ఆ తర్వాత ఆ స్థాయిలో లేదు. స్క్రీన్ మీద రాజశేఖర్ కనిపించిన ప్రతిసారీ ఫన్ వర్కవుట్ అయ్యింది. ఒకవేళ సీక్వెల్ తీస్తే గనుక ఆయన రోల్ హైలైట్ అవుతుంది.
అతిథికి ఎక్కువ... హీరోయిన్ పాత్రకు తక్కువ అన్నట్లుంది శ్రీ లీల క్యారెక్టర్! జస్ట్ రెండు మూడు సీన్లు, పాటలకు మాత్రమే పరిమితం అయ్యారు. నితిన్, రావు రమేష్ మధ్య సీన్లు నవ్విస్తాయి. రావు రమేష్ సైతం టిపికల్ మేనరిజంతో ఆకట్టుకుంటారు. కొడుకుపై ప్రేమ చూపించే రెగ్యులర్ తల్లిగా రోహిణి కనిపించారు. సుదేవ్ నాయర్ (Sudev Nair)ది టిపికల్ విలన్ రోల్. ఆయన యాక్టింగ్ అంతగా సెట్ కాలేదు. ఓవర్ చేశారు. ఇక... బ్రహ్మజీ, 'హైపర్' ఆది, శివన్నారాయణ, శ్రీకాంత్ అయ్యంగార్, రవి వర్మ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
Also Read: ఫ్లాప్స్ ఎఫెక్ట్ లేదుగా... నితిన్ సినిమాకు 'ఎక్స్ట్రాడినరీ' బిజినెస్ - లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ ఎలా జరిగిందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే: లాజిక్స్, మేజిక్స్, కథ పక్కన పెట్టేసి... సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. కేవలం కామెడీ కోసం చూస్తే... పార్టులు పార్టులుగా నవ్విస్తుంది. అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు. కేవలం మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ తీసిన కామెడీ చిత్రమిది. జస్ట్ ఫర్ ఎక్స్‌ట్రా ఫన్!