సినిమా రివ్యూ : హలో మీరా
రేటింగ్ : 2.75/5
నటీనటులు : గార్గేయి
మాటలు : హిరణ్మయి కళ్యాణ్!
పాటలు : శ్రీ సాయి కిరణ్!
ఛాయాగ్రహణం : ప్రశాంత్ కొప్పినీడి
సంగీతం : ఎస్. చిన్నా
నిర్మాతలు : డా: లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల
కథ, కథనం, దర్శకత్వం : శ్రీనివాసు కాకర్ల
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022
తెలుగులో ఇటీవల ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. కొత్త కథ, కథనాలతో దర్శకులు సినిమాలు తీస్తున్నారు. ఆ కోవలోకి వచ్చే చిత్రమే... 'ఎవ్వరికీ చెప్పొద్దు' ఫేమ్ గార్గేయి ఎల్లాప్రగడ (Gargeyi Yellapragada) ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'హలో మీరా' (Hello Meera Movie). దీనికి శ్రీనివాసు కాకర్ల దర్శకత్వం వహించారు. నేడు థియేటర్లలో విడుదలైంది. సినిమా స్పెషాలిటీ ఏంటంటే... స్క్రీన్ మీద సింగిల్ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. మరి, ఈ ప్రయోగం ఎలా ఉంది (Hello Meera Review)?
కథ (Hello Meera Sstory) : రెండు రోజుల్లో మీరా (గార్గేయి). అందుకని, రెండు రోజుల ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిందామె. తెల్లారితే పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. సంగీత్ కోసమని స్నేహితులు హోటల్ చేరుకుంటున్నారు. పెళ్లి బ్లౌజులు తీసుకుని ఇంటికి బయలు దేరింది మీరా. పెళ్లి హడావిడిలో ఉన్న ఆమెకు ఒక షాక్ తగులుతుంది. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. మీరా మాజీ బాయ్ ఫ్రెండ్ సూసైడ్ అట్టెంప్ట్ చేస్తాడు. దానికి ముందు సోషల్ మీడియాలో మీరా, తాను కలిసినట్టు... తమ నాలుగో ప్రేమ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఫోటో పోస్ట్ చేస్తాడు.
మాజీ ప్రియుడిని మీరా మోసం చేసిందని పోలీసులు అనుమానిస్తారు. అతడిది ఆత్మహత్యా? లేదంటే మీరా హత్య చేసిందా? అని ఒకానొక సమయంలో సందేహం కూడా వ్యక్తం చేస్తారు. అర్జెంటుగా రాయదుర్గం పోలీస్ స్టేషనుకు రమ్మని ఆర్డర్ వేస్తారు. ఒకవైపు పెళ్లి పనులు, వచ్చే అతిథులు ఫోన్ కాల్స్... మరోవైపు కాబోయే భర్తకు, వాళ్ళింట్లో వాళ్ళకు పెళ్ళికి ముందు అమ్మాయికి ఎఫైర్ ఉందని తెలిస్తే ఏమనుకుంటారోననే భయం... వీటన్నిటి మధ్య ఈ సమస్య నుంచి మీరా ఎలా బయట పడింది? ఎన్ని బాధలు పడింది? చివరకి, ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Virupaksha Review Telugu) : 'మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన' అని తెలుగులో ఓ సామెత ఉంది. 'too many cooks spoil the broth' అని ఓ ఇంగ్లీష్ సేయింగ్ కూడా ఉంది. సినిమాలకు వస్తే... నటీనటులు ఎక్కువ అయ్యే కొలదీ సన్నివేశాలు పెరిగిపోయి అసలు కథను సాగదీసి సాగదీసి పలుచన చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఓ సన్నివేశంలో నటీనటులు ఎక్కువై, వారిలో కొందరు సరిగా చేయక సన్నివేశంలో గాఢతను చెడగొట్టిన సినిమాలూ ఉన్నాయి. 'హలో మీరా'కు ఆ రెండు సమస్యలు లేవు.
'హలో మీరా'లో కనిపించేది ఒక్కరే! దాంతో సాగదీసిన సన్నివేశాలు లేవు. నిడివి తక్కువే. కేవలం గంటన్నరలో ముగిసింది. సినిమాలో ప్లస్ పాయింట్ అదొక్కటే కాదు... గార్గేయి నటన, ప్రశాంత్ కొప్పినీడి ఛాయాగ్రహణం, దర్శకుడు శ్రీనివాసు కాకర్ల ఎంపిక చేసుకున్న కథాంశం, కథను నడిపిన తీరు!
ఇప్పుడు ప్రేమలు, బ్రేకప్పులు చాలా కామన్! ప్రేమలో మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు. అలాగే, అబ్బాయిలూ ఉన్నారు. ఒకవేళ అమ్మాయి మీద అనుమానం వస్తే సమాజం ఎలా చూస్తుంది? అనేది చెప్పడానికి గార్గేయితో ఎస్సై మాట్లాడే తీరు ఓ ఉదాహరణ. అబ్బాయి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే... అమ్మాయిపై సమాజం చాలా త్వరగా ఓ అభిప్రాయానికి వస్తుందని కథలో అంతర్లీనంగా ఓ సందేశం ఇచ్చారు దర్శకుడు శ్రీనివాసు కాకర్ల. అమ్మాయిలు ధైర్యంగానూ ఉండాలని సన్నివేశాల ద్వారా చూపించారు. కుమార్తెపై తండ్రి ప్రేమను, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కూడా బాగా ఎలివేట్ చేశారు. డబ్బు కోసమే అమ్మాయిలు ప్రేమించడం లేదని ఓ మాటలో కన్వే చేశారు.
సినిమాలో సింగిల్ క్యారెక్టర్ ఉండటం ఎంత ప్లస్ అయ్యిందో... ఒక్కోసారి మైనస్ కూడా అయ్యింది. ప్రతిదీ ఫోన్ సంభాషణ కావడంతో కొన్నిసార్లు మొనాటనీ వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని సంభాషణలు అంతగా ఆకట్టుకోవు. స్టార్టింగులో కాబోయే దంపతుల మధ్య సంభాషణలు, అత్తగారి ఫోన్ కాల్స్, అత్తా కోడళ్ల గొడవ రొటీన్ అనిపిస్తుంది. అయితే... ప్రశాంత్ సినిమాటోగ్రఫీ చాలా వరకు స్క్రీన్ మీద ఉన్నది సింగిల్ క్యారెక్టర్ అనేది తెలియకుండా చేసింది. హైవే మీద డ్రోన్ షాట్స్, లాంగ్ షాట్స్, ఇంకా చాలా సన్నివేశాల్లో విజువల్స్ బావున్నాయి. లైటింగ్ సినిమా థీమ్ కు తగ్గట్టు ఉంది. చిన్నా నేపథ్య సంగీతం కూడా బావుంది. సాంగ్స్ సోసోగా ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : 'ఎవ్వరికీ చెప్పొద్దు'లో గార్గేయి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో ఆమెకు ప్రశంసలు కూడా వస్తాయి. స్టార్టింగ్ టు ఎండింగ్ మీరా పాత్రను, సినిమాను తన భుజాలపై మోశారు. సన్నివేశానికి తగ్గట్టు కళ్ళతో నటించారు. అలాగే, వాయిస్ మాడ్యులేషన్ చేంజ్ చేసినందుకు అప్రిషియేట్ చేయాలి. గోపరాజు రమణ తెరపై కనిపించలేదు. కానీ, తండ్రి పాత్రలో ఆయన వాయిస్ వినబడుతూ ఉంటుంది.
Also Read : 'విరూపాక్ష' రివ్యూ : సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'హలో మీరా' ఓ మంచి ప్రయత్నం. సినిమాగా చూస్తే డీసెంట్ రోడ్ థ్రిల్లర్. న్యూ జానర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు మిస్ కావద్దు. సగటు ప్రేక్షకులను కూడా మెప్పించే అంశాలు సినిమాలో ఉన్నాయి. యాక్టింగ్, కెమెరా వర్క్, నేపథ్య సంగీతం కథకు పర్ఫెక్ట్ గా కుదిరాయి.
Also Read : 'రుద్రుడు' రివ్యూ : రాఘవా లారెన్స్ 'ఊర మాస్' సినిమా చేస్తే?