వెబ్ సిరీస్ రివ్యూ : అర్థమైందా అరుణ్ కుమార్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : హర్షిత్ రెడ్డి, '30 వెడ్స్ 21' అనన్య, తేజస్వి మాదివాడ, వాసు ఇంటూరి, జై ప్రవీణ్ తదితరులుస్క్రీన్ రైటర్ : కిట్టూ విస్సాప్రగడ
ఛాయాగ్రహణం : అమర్ దీప్!
సంగీతం : అజయ్ అరసాడ 
నిర్మాణ సంస్థలు : అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్!
దర్శకత్వం : జోనాథన్ ఎడ్వర్డ్స్! 
విడుదల తేదీ: జూన్ 30, 2023
ఓటీటీ వేదిక : ఆహా
ఎపిసోడ్స్ : 5


కార్పొరేట్ ప్రపంచం ఎలా ఉంది? అందులో పరిస్థితులు వ్యక్తులపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? అనే కథాంశంతో రూపొందిన వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్' (Ardhamainda Arun Kumar Web Series). హిందీ వెబ్ సిరీస్ 'అఫిషియల్ చౌక్యాగిరి' స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించారు. ఈ సిరీస్ ఎలా ఉంది?  


కథ (Ardhamainda Arun Kumar Web Series Story) : అరుణ్ కుమార్ ముందా (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోటి ఆశలతో హైదరాబాద్ వస్తాడు. ఓ ఆఫీసులో ఇంటర్న్ కింద జాయిన్ అవుతాడు. ఎవరైనా పని ఇస్తారని ఆశిస్తే... బాస్ కాఫీలు పెట్టమని చెబుతాడు. ఓ సీనియర్ ఏమో కుక్కను తిప్పమని చెబుతాడు. అటువంటి ఆఫీసులో పల్లవి (30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య) అతడితో నవ్వుతూ మాట్లాడుతుంది. వాళ్ళ మధ్యలో షాలిని (తేజస్వి) రాకతో ఏం జరిగింది? అరుణ్ కుమార్ కష్టాలను షాలిని ఎలా దూరం చేసింది? కొత్త కష్టాల్లోకి ఎలా నెట్టింది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Ardhamainda Arun Kumar Web Series Review) : మహిళా సాధికారికత గురించి సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. Women Empowerment మీద ఓ యాడ్ చేయాల్సి వస్తే... ఉద్యోగులు ఐడియాలు ఇస్తారు. అవన్నీ చూసిన అరుణ్ కుమార్, మహిళా సాధికారతను వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదని చెబుతాడు. ఈ సిరీస్ చూశాక... కార్పొరేట్ ప్రపంచాన్ని దర్శక, రచయితలు సరిగ్గా అర్థం చేసుకోలేదా? లేదంటే కార్పొరేట్ ప్రపంచాన్ని పూర్తిస్థాయిలో చూపించాలని అనుకోలేదా? అని సందేహం కలిగింది. కార్పొరేట్ వరల్డ్ అంటే అందంగా కనిపించే ఆఫీసు, హిందీ & ఇంగ్లీష్ మాట్లాడే జనాలు, పార్టీలే కాదు. పని ఒత్తిళ్ళు ఉంటాయ్. ప్రేక్షకుడి కంటికి కనిపించని అంశాలు ఉంటాయి. అవేవీ 'అర్థమైందా అరుణ్ కుమార్'లో లేవు.  


'అఫీషియల్ చౌక్యాగిరి'లో ఏముంది? అనేది పక్కన పెడితే... ఈ కథను కార్పొరేట్ నేపథ్యంలో తెరకెక్కించారంతే! కార్పొరేట్ కాకుండా వేరొక నేపథ్యంలో తీసినా సరే ఫీల్ ఏమీ మారదు. చాకిరీ చేయించుకునే ఉన్నత అధికారులు కొందరు అయితే, కాన్సెప్ట్స్ దొబ్బేసి బాస్‌లు కొందరు! మన శ్రమ, కృషికి తగిన ఫలితం దక్కకపోతే ఎవరిలో అయినా సరే బాధ ఉంటుంది. ఆ బాధను ఆవిష్కరించడంలో సిరీస్ రూపకర్తలు విఫలయత్నం చేశారు. తల్లికి హార్ట్ ఎటాక్ వచ్చిన సన్నివేశంతో హీరో బాధ ఫీలయ్యేలా లేదు. కామెడీ సీన్స్ పరంగా సక్సెస్ అయ్యారు. కొన్ని సీన్స్ నవ్విస్తాయి. అయితే... ముందాను ముండా అని పిలవడం లేకి కామెడీగా ఉంది. పబ్జీకి అకింతమైన అమ్మాయి తరహా పాత్రలు చాలా సినిమాల్లో చూశాం.   


'అర్థమైందా అరుణ్ కుమార్'లో ప్రశంసించదగ్గ అంశం ఏమిటంటే... అసభ్యతకు తావు లేకుండా తీశారు. కార్పొరేట్ వరల్డ్ పేరుతో అందాల ప్రదర్శన చూపలేదు. కుటుంబంతో చూసేలా తీశారు. సగటు మధ్య తరగతి యువకులు తమను తాము చూసుకునేలా హీరో పాత్రను తీర్చిదిద్దారు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథను చక్కగా చూపించారు. రియాలిటీకి దగ్గరగా ఉంది. డైలాగులు బాగున్నాయి. వాసు ఇంటూరి పాత్రతో ఫిలాసఫీ చెప్పించారు. ఆయన పాత్ర పలికే సంభాషణలు పైకి సాధారణంగా ఉన్నా... లోతైన భావాలు ఉన్నాయి. కెమెరా వర్క్ ఓకే. టైటిల్ సాంగ్ బావుంది.


నటీనటులు ఎలా చేశారు? : హర్షిత్ రెడ్డి నటన సహజంగా ఉంది. ప్రతి రోజూ మెట్రో ట్రైన్, బస్, ఆటోల్లో కనిపించే కుర్రాళ్లకు ప్రతినిధిలా ఉన్నాడు. '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య నటనతో ఆకట్టుకున్నారు.ఎమోషన్స్ బాగా చూపించారు. ఈ సిరీస్ మొత్తం మీద స్టార్ ఎవరు? అంటే... తేజస్వి. బాస్ లేడీగా మెప్పించారు. ఎక్కడా ఓవర్ ద బోర్డు వెళ్ళలేదు. వాసు ఇంటూరి, జై ప్రవీణ్ సెటిల్డ్ గా చేశారు. మిగతా ఆర్టిస్టుల్లో గుర్తుంచుకునేలా ఎవరూ చేయలేదు.


Also Read : 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?


చివరగా చెప్పేది ఏంటంటే? : ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా తీసిన సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్'. సింపుల్ & స్ట్రయిట్ గా కథ చెప్పడం ప్లస్ పాయింట్. నిడివి కూడా తక్కువే. అయితే... మంచి ఫీల్ ఇవ్వడంలో సిరీస్ ఫెయిలైంది. కానీ, నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.  


Also Read : 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial