ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా. గత నాలుగేళ్లలో ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. అయితే, దాని ఆనవాళ్లు.. అది చేసిన నష్టాన్ని పూర్తిగా మర్చిపోకముందే మరో ప్యాండమిక్ రానుందట. ఆర్కిటిక్ ఐస్‌క్యాప్స్‌లో ఉన్న జాంబీ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రపంచం మరో ప్యాండమిక్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వైరస్? ఇప్పుడు ఎందుకు వ్యాప్తి చెందుతోంది? సైంటిస్టులు ఏం చెప్తున్నారు?
మంచు కరిగితే.. ముప్పే
ఆర్కిటిక్‌లోని ఐస్‌క్యాప్స్‌లో జీవిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు బయటపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు. ఈ డేంజరస్ వైరస్ దాదాపు 48,500 నాటి నుంచి ఆర్కిటిక్‌లోని ఐస్ కింద జీవిస్తోందని చెప్పారు. ఇక ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ కరిగిపోతోందని, దాని కారణంగా ఈ వైరస్ బయటకి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు సైంటిస్టులు. ఈ వైరస్‌లకు సంబంధించి ప్రమాదాలు, వాటి వల్ల కలిగే నష్టాలను అంచనా వేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు గతేడాది పరిశోధనలు జరిపారు. సైబీరియన్ ఏరియాలోని మంచు కప్పుల్లో ఉన్న నమూనాలను పరిశీలించిన సైంటిస్టులకు ఈ వైరస్ దాదాపు కొన్ని వేల ఏళ్ల నుంచి భూమిలో ఉండిపోయినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు మంచు కరిగి అవి బయటికి వస్తే.. భారీ ప్రమాదమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దక్షిణాది నుంచే మొదలు?
మార్సిల్లీ యూనివర్సిటీకి చెందిన జీన్ మైఖెల్ క్లావరీ అనే జన్యుశాస్త్రవేత్త దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. ఆయన పరిశోధనలో భాగంగా.. ముందుగా ఈ వైరస్ వ్యాప్తి సథరన్ రీజన్‌లో మొదలై, నార్త్‌కి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో నార్ల్ రీజన్‌లో బయటపడి, ఆ తర్వాత సదరన్ రీజన్‌కి వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉందన్నారు. అలాంటి వైరస్‌లు మనిషిపై దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయని, దానివల్ల ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. దీనిపై మరో సైంటిస్ట్ మారియన్ కూప్మాన్స్ స్పందించారు. గతంలో వచ్చినటువంటి పోలియో లాంటి వ్యాధులు ఈ వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
48,500 నాటి వైరస్..
ఈ వైరస్‌లు దాదాపు 48,500 ఏళ్ల నుంచి మంచు కింద బతుకుతున్నాయని చెప్తున్నారు సైంటిస్టులు. అయితే, భూ వాతావరణం వేడెక్కటం వల్ల పెర్మాఫ్రాస్ట్ కరిగి.. అప్పటివరకూ వేల ఏళ్లుగా వాటిలో బందీలుగా ఉన్న మీథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతాయని, అది వాతావరణ మార్పును మరింత తీవ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే.. తాము అధ్యయనం చేసిన ప్రాచీన వైరస్‌లు బయటికి రావడం వల్ల పెద్దగా ప్రమాదం లేదని.. అవి అమీబా సూక్ష్మజీవులకు సోకే రకాలని.. వీటిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల బృందం మరోటి గతంలో చెప్పింది. అయితే, ఇదే విధంగా గ్లోబల్‌వార్మింగ్ పెరిగి, ఐస్ కరిగిపోతే మాత్రం కచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.
Also Read: రక్త మోడుతున్న ఎర్ర సముద్రం.. వరల్డ్ హాట్ టాపిక్ ఎందుకైంది?
సైబిరియా ప్రాంతంలో ట్రాఫిక్ పెరగడం, ఆయిల్ వెలికితీయడం, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ లాంటి వాటివల్ల ఆర్కిటిక్ మహాసముద్రంలో భారీగా ఐస్ కరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు. దీనివల్ల భారీ ప్రమాదం పొంచిఉందని హెచ్చరిస్తున్నారు. మినరల్స్, ఆయిల్ కోసం చేస్తున్న పెద్ద పెద్ద రంధ్రాల వల్ల పెను ముప్పు పొంచిఉందని, వాటికోసం లోపలికి వెళ్లే వాళ్లకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. అలా ఐస్ కింద దాగిఉన్న వైరస్ భూమి మీదకి వచ్చి అల్లకల్లోలం సృష్టించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.