Tasty Cheese Roll : బ్రెడ్ చీజ్ రోల్ గురించి ఎక్కువగా వినే ఉంటారు కానీ వాటిని ఇంట్లో ఎక్కువగా తయారు చేసుకోరు. ఎందుకంటే వాటిని తయారు చేయడం కష్టమేమో అనే అపోహలో ఉంటారు. మీకు తెలుసా బ్రెడ్ చీజ్ రోల్ తయారు చేయడం చాలా అంటే చాలా తేలిక అని. ఆడుతూ పాడుతూ మీరు ఈ టేస్టీ చీజ్ రోల్స్ తయారు చేసేయొచ్చు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్స్‌గా కూడా మీరు వీటిని తీసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడే ఈ బ్రెడ్ చీజ్ రోల్స్‌ని ఏవిధంగా తయారు చేయాలో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బ్రెడ్ - 1 ప్యాకెట్
చీజ్ - 4 స్లైస్
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు
నూనె - ఫ్రై చేయడానికి సరిపడినంత
మయోనైస్ - 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా కొన్ని బ్రెడ్స్‌ను తీసుకుని ముక్కలుగా చేసి మిక్సీలో వేయండి. అవి పొడిగా అయిన తర్వాత వాటిని ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇవే బ్రెడ్ క్రంబ్స్. ఇవి అవసరమా? అనుకుంటున్నారేమో.. వీటిని ఉపయోగించే చేసే ఏ డిష్ రుచినైనా ఇవి పెంచుతాయి. టేస్ట్‌తో పాటు క్రంచీనెస్ ఇవ్వడంలో ఇవి సహాయం చేస్తాయి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో కార్న్ ఫ్లోర్ వేయండి. దానిలో కాస్త నీరు పోసి.. ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి.
ఓ నాలుగు బ్రెడ్ స్లైస్‌లు తీసుకుని.. వాటి అంచులను కట్ చేయండి. బ్రెడ్ రోల్ చేసే సయమంలో అంచులు ఉంటే కాస్త టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. అలా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్‌లను ఒక్కొక్కటిగా తీసుకుని.. చపాతీ కర్రతో చపాతీల మాదిరిగా రోల్ చేస్తూ వత్తాలి. ఇలా నాలుగు బ్రెడ్ స్లైస్‌లను వత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న బ్రెడ్ స్లైస్ తీసుకుని దానిపై చీజ్ పెట్టాలి. వాటిని రోల్స్ మాదిరిగా రోల్ చేయాలి.
ఇలా రోల్ చేసిన బ్రెడ్ చీజ్‌ను ముందుగా కార్న ఫ్లోర్ పేస్ట్‌లో ముంచాలి. అనివైపులా కార్న్ అంటుకున్న తర్వాత వాటిని బ్రెడ్ క్రంబ్స్‌లో వేయాలి. బ్రెడ్ క్రంబ్స్ రోల్స్ పట్టుకునేలా.. లేదంటే.. అంటుకోని ప్లేస్‌లో మీరే బ్రెడ్ క్రంబ్స్ వేయండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాటిని రెండు మూడు నిమిషాలు డీప్ ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా చేయడం వల్ల రోల్స్‌కి అంటుకున్న బ్రెడ్ క్రంబ్స్ ఫ్రై చేసినపప్పుడు వాటిని విడిపోకుండా ఉంటాయి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై పాన్ పెట్టి నూనె వేయండి. అవి కాగే లోపు ఫ్రిజ్‌లో పెట్టుకున్న రోల్స్‌ను బయటకు తీయండి. నూనె వేగిన తర్వాత బ్రెడ్ రోల్స్‌ను నూనెలో వేసి వేయించండి. మంటను మీడియంగా ఉంచి.. దగ్గరే ఉంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు వేగింది.. రంగు మారింది అనుకుంటే మరోవైపు తిప్పాలి. ఫ్రై చేస్తున్నప్పుడు కచ్చితంగా స్టౌవ్ దగ్గరే ఉండేలా చూసుకోండి. లేదంటే అవి త్వరగా మాడిపోయే ప్రమాదముంది. ఇలా అన్ని వేగినతర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
మయోనీస్తో వాటిని గార్నిష్ చేసుకోవాలి. కుదిరితే పైన చాట్ మసాలా లేదంటే చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానోని కూడా చల్లుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆస్వాదించడానికి బ్రెడ్ చీజ్ రోల్స్ రెడీ. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వారికి వీటిని స్నాక్స్ బాక్స్‌గా, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. వీటికి తోడు ఆలు చిప్స్ ఇస్తే అది వారికి పండుగే అవుతుంది. పెద్దలు కూడా ఏదైనా సినిమా చూసే సమయంలో ఇంట్లోనే వీటిని సింపుల్‌గా తయారు చేసుకుని హాయిగా ఆస్వాదించవచ్చు.
Also Read : డైట్లో ఉన్నప్పుడు బ్రెడ్‌తో చేసుకోగలిగే సింపుల్ రెసిపీలు ఇవే