సూర్యుడు ఉగ్రరూపం దాల్చి నిప్పులు కురిపిస్తున్నాడు. వేగవంతమైన జీవనశైలిలో వేడి, తేమ శరీరాన్ని దెబ్బతీస్తాయి. అలసట, నిర్జలీకరణం, వేడి సంబంధిత అనారోగ్యాలని నివారించడానికి వేసవిలో హైడ్రేట్ గా ఉండటమే అన్నింటికీ మంచి పరిష్కారం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీటితో పాటు చల్లగా ఉండే చక్కెర, కెఫిన్ పానీయాలు తాగుతారు. సోడాలు, కోలా, ప్రాసెస్ చేసిన రసాలు వంటి పానీయాలు అధిక చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు శరీరంపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే బరువు పెరగడం, పళ్ళు పుచ్చిపోవడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ పానీయాలకు వేసవిలో తప్పనిసరిగా దూరంగా ఉండాలి.
ఛాయ్: వేసవిలో మసాలా ఛాయ్, కాఫీ వంటి వేడి పానీయాలు తాగడం మానుకోండి. ఎందుకంటే ఇవి పొట్టపై అదనపు వేడిని కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వేడిని మరింత ఎక్కువ చేయడం వల్ల శరీరం దాన్ని తట్టుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
సోడా: చక్కెర, కెఫీన్, కృత్రిమ స్వీటేనర్లతో నిండిన కోలా, సోడాలు వంటి కార్బో =నేటెడ్ పానీయాలను నివారించాలి. అవి శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వాటికి బదులు మజ్జిగ, ఛాస్, నిమ్మరసం, పుచ్చకాయ, కొబ్బరి నీళ్ళు వంటివి తీసుకోవడం మంచిది.
పండ్ల రసాలు: సీజనల్ వారీగా వచ్చే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేసే దాని కంటే హాని ఎక్కువ కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన పండ్ల రసాల్లో అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఆల్కాహాల్: వేసవిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కి ఎక్కువగా దారి తీస్తుంది. తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఎనర్జీ డ్రింక్స్: అధిక స్థాయిలో కెఫీన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ తాగితే అప్పటికప్పుడు తక్షణ శక్తి లభిస్తుంది. కానీ కాసేపటికే ఇవి శరీరం నుంచి మొత్తం శక్తిని ఖాళీ చేసేస్తాయి.
మిల్క్ షేక్: మిల్క్ షేక్ వంటి పాల ఆధారిత పానీయాలు జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. గ్యాస్, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది.
స్పోర్ట్స్ డ్రింక్స్: అధిక స్థాయిలో చక్కెర తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయేలా చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వేసవిలో హైడ్రేట్ గా ఉండాలంటే నీరు లేదా కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది. ఈ అనారోగ్యకరమైన చక్కెర పానీయాలకు బదులుగా చక్కెర కంటెంట్ తక్కువగా ఉన్న సహజ పండ్ల రసాలు ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మిగిలిపోయిన అన్నం తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెప్తున్నారు