Obesity Cases in India : ఇండియాలో ఊబకాయాన్ని అరికట్టకపోతే.. రానున్న రోజుల్లో అతిపెద్ద ప్రజారోగ్య సవాళ్లలో ఇది ఒకటిగా మారనుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ 2023 నివేదిక ప్రకారం.. "ప్రస్తుతం 135 మిలియన్లకు పైగా భారతీయులు ఊబకాయంతో జీవిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే 2035 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత దశాబ్దంలో భారతదేశంలో బాల్య ఊబకాయం రేట్లు దాదాపు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణం నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు, పట్టణీకరణ పెరగడమే అంటూ షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చింది."

ఇండియాలో ఊబకాయం..

ఇండియాలో ఊబకాయం అనే మహమ్మారి.. ఆందోళనకరమైన వేగంతో పెరుగుతోందని డైజెస్టివ్ హెల్త్ ఇన్​స్టిట్యూట్​ వ్యవస్థాపకుడు డాక్టర్ ముఫజల్ లక్డవాలా తెలిపారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు భారతదేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి చిన్న పట్టణాలలోకి కూడా వెళ్లిపోయిందని తెలిపారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. పిల్లలు, యువకులలో కూడా దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. 

ఊబకాయంతో వచ్చే సమస్యలు

చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉన్న తరాన్ని మనం పెంచుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ ముఫజల్. ఊబకాయం కేవలం అధిక బరువు మాత్రమే కాదని. ఇది ఒక సంక్లిష్టమైన, దీర్ఘకాలిక వ్యాధి అని తెలిపారు. దీనివల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయంలో కొవ్వు, ఆస్టియో ఆర్థరైటిస్, వంధ్యత్వం, శ్వాసకోశ రుగ్మతలు, కొన్ని రకాల క్యాన్సర్‌ల వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుందని తెలిపారు.

ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ మహమ్మారి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను దెబ్బతీస్తుందని.. ఆర్థిక ఉత్పాదకతను తగ్గిస్తుందని.. కుటుంబాలపై మానసికంగా, ఆర్థికంగా భారం కానుందని నిపుణులు చెప్తున్నారు. అయితే భారతదేశం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇప్పటికీ నివారణ వ్యూహాల కంటే వైద్య చికిత్సకే ప్రాధాన్యతనిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. వ్యాధులు వచ్చిన తర్వాత వాటిని నయం చేయడం కంటే..  రాకుండా నివారించడంపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. 

ఊబకాయం రాకుండా.. 

రానున్న రోజుల్లో ఊబకాయ వ్యాప్తి పెరగకుండా ఉండాలంటే.. భారతదేశంలో కొన్ని మార్పులు చేయాలని తెలిపారు. ముందుచూపుతో అత్యవసరంగా స్పందించాలని.. సమస్య వచ్చినప్పుడు తగ్గించడమే కాకుండా.. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా కృషి చేయాలని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయానికి కారణమయ్యే కారణాలు గుర్తించి.. వాటిని నివారించాలని సూచిస్తున్నారు. పోషకాహార లోపం వల్లే ఊబకాయం సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి.. దానిపై కచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి గురించిన సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇండియాలో ఈ సమస్య ఎక్కువ అవుతుందని నిపుణులు చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.