World Lung Day : ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ.. వాటిని మెరుగ్గా ఎలా ఉంచుకోవాలో చెప్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం (World Lung Day 2024) జరుపుకుంటున్నారు. 2016లో ప్రెసిడెంట్ మిచియాకి మిషిమా ఆధ్వర్యంలో ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొదించడంపై అవగాహన కల్పిస్తున్నారు. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? థీమ్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం ప్రాముఖ్యత
ఫోరమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్ (FIRS) అనేది ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంపొందించడం, అంతర్జాతీయ శ్వాసకోశ సంఘాలు కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ డేని పురస్కరించుకుని పొగాకు వాడకం, వాయు కాలుష్యం, లైఫ్ స్టైల్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన అందిస్తారు. ఇవన్నీ శ్వాసకోశ వ్యాధులపై ఎలా ప్రభావం చూపిస్తాయో వివరిస్తారు. ఊపిరితిత్తుల రుగ్మతల పెరుగుదలను తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవడంపై అవగాహన కల్పిస్తారు. శ్వాసకోశ రుగ్మతలు, మరణాలు, అనారోగ్యాల రేటును తగ్గించడంపై నిపుణులు ఇచ్చే సూచనలు హైలైట్ చేస్తారు.
ఈ ఏడాది థీమ్ ఏంటంటే..
ప్రతి సంవత్సరం ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం రోజున ఓ థీమ్‌తో ముందుకు వస్తారు. దీనిపై ప్రజలకు అవగాహన అందిస్తారు. మరి 2024 థీమ్ ఏంటంటే.. అందరికీ స్వచ్ఛమైన గాలి అందాలి.. ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉండాలనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ థీమ్ ద్వారా గాలి నాణ్యత, ఊపిరితిత్తుల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
మిలియన్లలో మరణాలు..
ఊపిరితిత్తుల వ్యాధులనేవి పలు రకాలు ఉంటాయి. ఇవి పిల్లలనుంచి పెద్దలవరకు ప్రభావితం చేస్తాయి. ఆస్తమా లంగ్స్‌కి సంబంధించిన రుగ్మతే. ఈ దీర్ఘకాలిక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది పిల్లలను ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. క్రానిక్ అబ్స్ట్రక్క్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాల్లో మూడవ ప్రధాన కారణమట. ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల ఏటా 1.6 మిలియన్ల మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇది అత్యంత సాధారణమైన క్యాన్సర్. అత్యంత ప్రాణాంతకమైన అంటువ్యాధుల్లో టీబీ ఒకటి. దీనివల్ల ఏటా 1.04 కోట్ల కేసులు నమోదు కాగా.. 14 లక్షల మంది ఏటా చనిపోతున్నారు.
చికిత్సలివే..
రుగ్మతని బట్టి చికిత్స ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యాధులను బట్టి చికిత్సలు మారుతూ ఉంటాయి. ఆస్తమాకు COPD కోసం ఇన్హేలర్లు ఇస్తారు. టీపీ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ అందిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకై కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు ఉంటాయి. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధిని తగ్గించడం కోసం పల్మనరీ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇవి పర్సన్‌ని బట్టి మారుతూ ఉండొచ్చు కానీ.. దాదాపు ఇవే చికిత్సలు ఉంటాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు రెగ్యూలర్‌గా ఫాలో అవ్వాలి. పొగాకు వాడకాన్ని మానేయాలి. అలాగే సెకండ్ హ్యాండ్ పొగను పూర్తిగా నివారించాలి. ఇండోర్, అవుట్డోర్లలో వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా రెగ్యూలర్‌గా వ్యాయామం చేయాలి. వీటివల్ల లంగ్స్ హెల్తీగా మారుతాయి. అలాగే తీసుకునే ఫుడ్ కూడా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది కాబట్టి హెల్తీ ఫుడ్‌ని తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారంతో జీవనశైలిని ముందుకు తీసుకెళ్లాలి. ఫ్లూ, న్యూమోనియా వంటి వాటికి వ్యతిరేకంగా టీకాలు తీసుకోవాలి.
అన్ని విషయాలను గుర్తించుకుని ఊపిరితిత్తులను కాపాడుకోవడం బాధ్యతగా తీసుకోవాలి. వీటిని రెగ్యూలర్‌గా ఫాలో అయి.. వైద్యులు సలహాలు పాటిస్తే మీతో పాటు ఊపిరితిత్తులు హెల్తీగా ఉంటాయి. మీకు తెలిసిన విషయాన్ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసుకుని వారిని కూడా హెల్తీగా ఉండేలా చేయండి.
Also Read : ఆ లక్షణాలు కిడ్నీ సమస్యలకు దారితీస్తాయట.. హెచ్చరిక సంకేతాలు ఇవే అంటోన్న నిపుణులు