Pregnancy Chances Are Decreasing in Women : మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం వేగంగా క్షీణిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 18.6 కోట్ల మంది ఏదో ఒక రూపంలో వంధ్యత్వంతో బాధపడుతున్నారు. భారతదేశంలో కూడా ప్రాథమిక వంధ్యత్వ రేటు 3.9% నుంచి 16.8% వరకు ఉంది. కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ రేటు మరింత ఎక్కువగా ఉంది. ఒకవైపు సాంకేతికత సంతానోత్పత్తికి సంబంధించిన ఎంపికలను పెంచింది.. కానీ జీవనశైలి, మానసిక ఆరోగ్యం వంటి కారణాల వల్ల మహిళల్లో సహజ సంతానోత్పత్తి వయస్సు నెగిటివ్​గా ప్రభావితమవుతోంది.

హార్మోన్ల అసమతుల్యత 

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, థైరాయిడ్, క్రమరహిత పీరియడ్స్, ఊబకాయం వంటి పరిస్థితులు సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. నేటి బిజీ లైఫ్‌స్టైల్, జంక్ ఫుడ్, నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటివి ఈ సమస్యలను పెంచుతున్నాయి. BMI (బాడీ మాస్ ఇండెక్స్) 25 కంటే ఎక్కువ లేదా 19 కంటే తక్కువగా ఉంటే.. గర్భధారణ ఆలస్యం అయ్యే అవకాశం పెరుగుతుంది.

తల్లి కావాలనే నిర్ణయాన్ని వాయిదా వేయడం

నేటి మహిళలు కెరీర్ పరంగా.. జీవితంలోని ఇతర లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచిదే. అయితే 35 ఏళ్లు పైబడిన మహిళల్లో అండాల నాణ్యత, సంఖ్య తగ్గుముఖం పడుతుందనేది వాస్తవం. డెహ్రాడూన్‌లోని ఇందిరా IVF క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రీమా సిర్కార్ ప్రకారం.. "35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశం 25 శాతం వరకు తగ్గుతుంది. అదే సమయంలో.. 40 ఏళ్ల తర్వాత ఇది కేవలం 5-10 శాతం మాత్రమే ఉంటుంది" అని చెప్పారు. ఆ సమయంలో ఐవీఎఫ్ కోసం ట్రై చేస్తే కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. 

మానసిక ఒత్తిడి 

IVF చేయించుకుంటున్న మహిళల్లో ఒత్తిడి, డిప్రెషన్, నిద్రకు సంబంధించిన సమస్యలు సర్వసాధారణం. ఒక అధ్యయనంలో.. రెసిలియన్స్ అంటే మానసిక బలం ఎక్కువగా ఉన్న మహిళలు IVF మొదటి ప్రయత్నంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే మొదటి ప్రయత్నం విఫలమైతే.. ఒత్తిడి, విచారం పెరిగిపోతున్నాయట.

ఒంటరితనం

'పిల్లలు ఎప్పుడు పుడతారు?' అనే ప్రశ్న నేటికీ ప్రతి వివాహిత మహిళ ఎదుర్కొంటున్నది. సమాజం పెట్టే ఈ ఒత్తిడి, కుటుంబ సభ్యులు పెట్టే ప్రెజర్ మహిళలను మానసికంగా కృంగిపోయేలా చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం.. సామాజిక, కుటుంబ మద్దతు పొందిన మహిళల్లో డిప్రెషన్ వచ్చే అవకాశం 25 శాతం వరకు తగ్గింది.

అపోహలు

ఒక బిడ్డ పుడితే.. రెండవ బిడ్డ తనంతట అదే పుడుతుందని నేటికీ చాలా మంది నమ్ముతారు. కానీ ద్వితీయ వంధ్యత్వం కూడా ఒక పెద్ద సమస్య. అలాగే వంధ్యత్వం అనేది మహిళల సమస్య మాత్రమే అని అనుకోవడం చాలా ప్రమాదకరమైన అపోహ. గణాంకాలు 30-50% కేసుల్లో పురుషుల పాత్ర కూడా ఉంటుందని చూపిస్తున్నాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలివే

ప్రతి మహిళ సంతానోత్పత్తి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. కొందరికి ఇది సులభం అయితే మరికొందరికి కొన్ని సవాళ్లతో నిండి ఉంటుంది. అయితే ఈ విషయాలను సకాలంలో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ 35వరకు కాకుండా 30 ఏళ్ల తర్వాత సంతానోత్పత్తికి ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో అయితే ఇంకా బెటర్. మీకు క్రమరహిత పీరియడ్స్ లేదా థైరాయిడ్, PCOS వంటి సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేయవద్దు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా నిద్రపోవడం, ఒత్తిడిని నివారించడం వంటి ప్రాథమిక విషయాలు కూడా శరీరంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. IVF లేదా ఎగ్ ఫ్రీజింగ్ వంటి ఎంపికల గురించి అవగాహన పెంచుకుంటే మరీ మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.