Home Food Hygiene Tips : ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఫుడ్‌ని ఎలా తీసుకోవాలో చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం (World Food Safety Day 2025) నిర్వహిస్తున్నారు. ఆహారాన్ని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి ఇబ్బందులు రావు అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్‌గా చేసే కొన్ని తప్పులను గుర్తించి.. వాటిని సరిచేసుకుంటే మంచిదని చెప్తున్నారు.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఇంట్లో తెలియకుండా చేసే మిస్టేక్స్ వల్లే వస్తున్నాయట. ఫుడ్ పాయిజినింగ్, కడుపులో ఇన్ఫెక్షన్లు, వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అందుకే ఆ తప్పులను గుర్తించి.. ఆ అలవాట్లు మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ మార్పులు చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. అందరూ కామన్‌గా చేసే తప్పులు ఏంటి? వాటివల్ల కలిగే నష్టాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
తినేముందు
భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని అందరికీ తెలుసు. అయితే వండే ముందు కూడా చేతులు కడుక్కోవాలని చెప్తున్నారు నిపుణులు. హ్యాండ్ వాష్ లేదా సోప్‌తో 20 సెకన్లు చేతులు కడగాలని సూచిస్తున్నారు. అలాగే మాంసం, గుడ్లు, కూరగాయలు పట్టుకుంటే కచ్చితంగా వాటిని కడగడంతో పాటు చేతులు కూడా కడుక్కోవాలని చెప్తున్నారు. హైజీన్‌గా లేకుండా వంట చేస్తే వివిధ ఇన్ఫెక్షన్లు వస్తాయని చెప్తున్నారు.
శుభ్రత
పండ్లు తినేముందు, కూరగాయలు వండే ముందు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. వాటిపై ఉండే మురికి, పురుగుమందులు, బ్యాక్టీరియాను తొలగించడానికి నీటితో బాగా కడగాలి. కుదిరితే వాటిని కడిగేప్పుడు పండ్లు, కూరగాయల వాష్‌తో లేదా ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచి తర్వాత వినియోగించుకోవచ్చు.
కటింగ్ చేసేప్పుడు
చాలామంది చేసే మిస్టేక్స్‌లో కటింగ్ బోర్డ్ వినియోగం కూడా ఒకటి. ఎందుకంటే కొందరు అన్నింటికీ ఒకటే కటింగ్ బోర్డ్ వాడతారు. మాంసం, కూరగాయల కోసం ఒకటే కాకుండా వేర్వేరు కటింగ్ బోర్డ్‌లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే వండిన ఫుడ్, వండనివి ఒకే చోట ఉంచకూడదని చెప్తున్నారు. కిచెన్ కౌంటర్ కూడా పొడిగా ఉండేలా చూసుకోమని చెప్తున్నారు.
సరిగ్గా ఉడికించకుంటే
ఆహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తీసుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా చికెన్, ఎగ్స్ వంటి నాన్‌వెజ్ సరిగ్గా వండకపోతే కచ్చితంగా ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. మంచిగా ఉడికించకపోతే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వ్యాపిస్తుందని ఇది ఇన్ఫెక్షన్లకు కలిగిస్తుందని అంటున్నారు.
స్టోరేజ్
ఆహారాలను చాలామంది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎక్కువ రోజులు ఉంచేస్తారు. ఫ్రిడ్జ్‌లో ఎక్కువ రోజులు ఉంచేసి తర్వాత దానిని తింటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. అలాగే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన ఫుడ్స్‌ని వెంటనే రెండు గంటల్లోపు తినేయాలట. అలాగే పాలు, గుడ్లు, మాంసం ఎక్కువ సేపు బయట ఉంచవద్దని చెప్తున్నారు. ఫుడ్‌ని డ్రైగా ఉండే కంటైనర్స్లోనే పెట్టాలని చెప్తున్నారు.
గడువు తేదీ
ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లేదా ఇతర ఫుడ్స్ ఏది తీసుకున్నా వాటి ఎక్స్పైరీ డేట్ కచ్చితంగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గడువు తీరిన ఫుడ్స్ తినకపోవడమే మంచిదని.. అలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. అలాగే ఆహారం నుంచి దుర్వాసన వస్తుంటే వాటిని ఉపయోగించకపోవడమే మంచిదని అంటున్నారు.
వేడిచేయడం
కొన్ని ఫుడ్స్ ఎక్కువగా మళ్లీ మళ్లీ వేడి చేస్తే వాటిలోని పోషకాలు తగ్గి.. బ్యాక్టీరియా పెరిగే అవకాశముందని చెప్తున్నారు. అలాగే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే వాటిని వేడిచేయవద్దని చెప్తున్నారు.
ఇవేకాకుండా కిచెన్ కౌంటర్ క్లీన్ చేయడానికి స్పాంజ్లు, డిష్ క్లాత్‌లు తరచూ మార్చాలని సూచిస్తున్నారు. అలాగే వంట చేసేప్పుడు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించాలని చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలతో ఉన్నప్పుడు కూడా కిచెన్‌లో ఉండకపోవడం, వంట చేయకపోవడమే మంచిదని అంటున్నారు.