Bunny Vas Reaction On Percentage Issue: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల పరిణామాలపై ప్రొడ్యూసర్ బన్నీ వాస్ తాజాగా స్పందించారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు ఫోకస్ చేయాలని.. పర్సంటేజీల విధానంపై కాదంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఓటీటీల్లో మూవీస్ రిలీజ్ టైంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

'టాప్ హీరోస్ ఆలోచించాలి'

ఎగ్జిబిటర్లు, నిర్మాతలు గ్రహించాల్సింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజీ విధానం కాదని.. ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని బన్నీ వాస్ అన్నారు. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు. ఇంతకు ముందులా మన బిజినెస్ ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలి.' అని తెలిపారు.

ఓ మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయిన 28 రోజుల్లోపే (4 వారాలు) ఓటీటీలోకి వచ్చేస్తోందని.. ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉందన్నారు బన్నీ వాస్. 'ఇదే విషయాన్ని టాప్ హీరోస్ కూడా ఆలోచించాలి. మీరు 2, 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు దూరమైపోతారు. ఈ సమయంలో చాలామంది యజమానులు థియేటర్లు నడపలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే.. కేవలం మల్టీప్లెక్సుల వల్ల మీ సినిమాకు థియేటర్స్ నుంచి వచ్చే ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. ఈ విషయాన్ని టాప్ హీరోస్ గ్రహించాలి.' అంటూ పేర్కొన్నారు.

Also Read: 'స్పిరిట్' ఒక్కటే కాదు.. ప్రభాస్ 'కల్కి 2' నుంచి కూడా అవుట్? - కొంప ముంచుతున్న దీపికా డిమాండ్స్

ఇటీవల ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజీల విధానం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం వల్ల థియేటర్స్ బంద్ అనే అంశం తెరపైకి రాగా.. పవన్ మూవీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైంలోనే ఇలా జరిగిందంటూ మరో చర్చ కూడా సాగింది. ఈ అంశంపై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కూడా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. పవన్ సినిమాను ఆపే ధైర్యం ఎవరికీ లేదంటూ కామెంట్స్ చేశారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ మధ్య పర్సంటేజీల విధానం, ఇతర సమస్యలపై కూడా చర్చ సాగుతోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ అంశాలపైనే బన్నీ వాస్ తాజాగా స్పందించారు.

ఓటీటీల అంశంపై.. 

సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలోకి వస్తోంది. కొన్ని సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ టైం పెంచడంపై టాప్ హీరోస్ దృష్టి సారించాలని బన్నీ వాస్ తాజాగా అన్నారు. ఇటీవల కమల్ హాసన్ కూడా ఇదే కామెంట్స్ చేశారు. ఆయన రీసెంట్ మూవీ 'థగ్ లైఫ్' కూడా థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా డిజిటల్ రైట్స్ డీల్ ఇచ్చారు. ఓటీటీలోకి ముందుగానే రావడంతోనే ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదని.. దీని వల్ల సింగిల్ స్క్రీన్స్ మూతపడే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు బన్నీ వాస్.