ఒక చిన్న చాక్లెట్ తో ప్రేమ, ఆనందం, సంతోషం అన్నింటినీ పంచుకోవచ్చు. మీకిష్టమైన వాళ్ళకి చాక్లెట్ ఇచ్చారంటే ఎంతో సంతోషిస్తారు. ఇది జీవితంలో ఆనందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈరోజు(జులై 7) ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. యూరప్ లో 1550 లో చాక్లెట్ ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి జులై 7 చాక్లెట్ డే గా జరుపుతున్నారు. చాక్లెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మార్పులు జరిగాయి. వివిధ రకాల ఫ్లేవర్ చాక్లెట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.
కోకో మొక్కలో లభించే కోకో నుంచి చాక్లెట్లని తయారు చేస్తారు. వీటిలో యాక్టివ్ ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఫ్లేవనోల్స్ ఉన్నాయి. డార్క్ చాక్లెట్ లో ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులని నయం చేయడంలో సహాయపడతాయి. మనం ఎంచుకునే చాక్లెట్ రకాన్ని బట్టి వాటిలో చక్కెర ఉంటుంది. ఆరోగ్యాని ప్రతికూలంగా ప్రభావితం చేయని విధంగా తక్కువ చక్కెర ఉన్న చాక్లెట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యం నుంచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేవరకు అనేక ప్రయోజనాలను చాక్లెట్ లు అందిస్తాయి. అందుకే ప్రతిరోజు ఒక చిన్న చాక్లెట్ ముక్క తింటే ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమీ ఉండదు.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గిస్తాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ నష్టం అనేక దీర్ఘకాలిక వ్యాధులకి దారి తీస్తుంది. అందుకే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు.
రక్త ప్రసరణ మెరుగు
చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి ఎండోథెలీయం ని ప్రేరేపిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ ధమనులకు విశ్రాంతినిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
రక్తపోటు తగ్గిస్తుంది
ఇందులోని నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ధమనుల్లో రక్తం సులభంగా ప్రవహించినప్పుడు రక్తపోటు స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. అందుకే మితమైన పరిమాణంలో చాక్లెట్ తినడం మంచిదే.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్ మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్ లని తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది.
గుండెకి మేలు
రక్తపోటు నిరోధించడం, మంచి కొలెస్ట్రాల్ పెంచడం, ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని తగ్గించడం.. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.
మెదడు ఆరోగ్యం మెరుగు
చాక్లెట్ లో కోకో ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఇవి ఆలోచన పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఏకాగ్రత, శ్రద్దని పెంచుతాయి. అందుకే చాక్లెట్లు తింటే మెదడు చక్కగా పని చేస్తుందని చెప్తుంటారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వర్షాకాలంలో చుండ్రు వేధిస్తుందా? ఈ టిప్స్ పాటించారంటే సులభంగా తగ్గిపోతుంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial