క్యాన్సర్ మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో తెలిసిందే. ఒకసారి శరీరంలో క్యాన్సర్ ఏర్పడిందంటే చాలు.. జీవితం నరకమే. అయితే, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే.. చికిత్స సాధ్యమే. కానీ, క్యాన్సర్లు చాలా రకాలు. వాటిలో ఏ రకం క్యాన్సర్ ఏర్పడిందో తెలుసుకోవడం కష్టమే. క్యాన్సర్ గురించి తగిన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. నేడు ‘వరల్డ్ క్యాన్సర్ డే’ (World Cancer Day) నేపథ్యంలో ఏయే క్యాన్సర్‌‌లో ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది ఇక్కడ అందిస్తున్నాం. తప్పకుండా తెలుసుకోండి.


క్యాన్సర్ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పలేం. స్త్రీలకు, పురుషులకు వేర్వేరు క్యాన్సర్లు ఏర్పడతాయి. వయస్సు పెరిగే కొద్ది క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. దాదాపు వంద కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు ఉనికిలో ఉన్నాయి. వీటిలో ఎక్కువమందిలో కనిపించే కొన్ని క్యాన్సర్ల లక్షణాలను ఇక్కడ చూడండి.


రొమ్ము క్యాన్సర్ లక్షణాలు: 
⦿ రొమ్ముల వద్ద లేదా చంకలు, కాలర్‌బోన్ చుట్టూ ఏదైనా గడ్డలు ఏర్పడుతుంటే అనుమానించాలి. 
⦿ రొమ్ము వద్ద ఏర్పడే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
⦿ రొమ్ములో వాపు లేదా రొమ్ముపై చర్మం గట్టిపడటం, ఎర్రగా మారడం, పొలుసులుగా మారడం కూడా క్యాన్సర్ లక్షణాలే.
⦿ చనుమొనలో నొప్పి, తల్లిపాలు ఇవ్వడం మానేసినా.. చనుమొనల నుంచి తెల్లనిస్రావం (చీములాంటిది) కారడం.
⦿ చనుమొనలు లోనికి ముడుచుకోవడం.





ఊపిరితిత్తులు(లంగ్) క్యాన్సర్ లక్షణాలు:
⦿ నిరంతర దగ్గు. కాలక్రమేనా పెరుగుతూనే ఉంటుంది. 
⦿ దగ్గుతున్నప్పుడు రక్తం రావడం.
⦿ శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన గురక.
⦿ నిరంతరం ఛాతీ నొప్పి.
⦿ ఎముకల నొప్పి
⦿ గొంతు బొంగురుపోవడం లేదా ఇతర గొంతులో మార్పులు.
⦿ న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్ వంటి సమస్యలు. 
⦿ బరువు తగ్గడం.
⦿ ఆకలిగా లేకపోవడం.
⦿ తరచుగా తలనొప్పి.
⦿ రక్తం గడ్డకట్టడం.
⦿ ఊపిరితిత్తుల క్యాన్సర్ చాపకింద నీరులా పెరుగుతుంది. ముదిరిన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. కాబట్టిపైన పేర్కొన్న సంకేతాల్లో ఒక్కటి కనిపించినా వైద్యుడిని సంప్రదించండి. 


కోలన్, రెక్టల్ క్యాన్సర్లు లేదా కోలోరెక్టల్ క్యాన్సర్స్ లక్షణాలు: 
⦿ బరువు తగ్గడం, శక్తి కోల్పోయినట్లు అనిపించడం, అలసట.
⦿ మలబద్ధకం, అతిసారం ఎక్కువ రోజులు కొనసాగడం.
⦿ మీ కడుపు లేదా ప్రేగులలో నొప్పి వస్తూపోతుండటం లేదా దీర్ఘకాలికంగా కొనసాగడం. 
⦿ పురీషనాళం లేదా పొత్తికడుపులో నొప్పి. 
⦿ మలంలో రక్తం (ఇది ముదురు ఎరుపు లేదా నలుపు రంగులో ఉండవచ్చు)
⦿ పురీషనాళంలో రక్తస్రావం. 
⦿ కొలొరెక్టల్ క్యాన్సర్‌లు ముదురుతున్న సమయంలోనే లక్షణాలు కనిపిస్తాయి. 


ప్రోస్టేట్ క్యాన్సర్: 
⦿ మూత్రవిసర్జన చేయడంలో ఇబ్బందులు. 
⦿ మూత్రం ఆగి ఆగి రావడం. 
⦿ మూత్రం లీక్ కావడం.
⦿ మూత్ర విసర్జనకు అంతరాయం ఏర్పడినట్లుగా అనిపించడం. 
⦿ అకస్మాత్తుగా మూత్రం రావడం.
⦿ మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట. 
⦿ రాత్రి వేళల్లో తరచుగా మూత్ర విసర్జన చేయడం. 
⦿ అంగస్తంభన సమస్య.
⦿ స్కలనం సమయంలో నొప్పి. 
⦿ తక్కువ వీర్యం స్కలనం కావడం.
⦿ మూత్రంలో రక్తం లేదా స్కలనం ద్రవం కారడం.
⦿ వీపు కింద, తొడలు, తుంటి వద్ద నొప్పి.
⦿ పురీషనాళంలో ఒత్తిడి లేదా నొప్పి.
⦿ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా 55 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో కనిపిస్తుంది. పై లక్షణాల్లో ఏది కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి.


బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు:
⦿ మూత్రంలో రక్తం. ఇది సాధారణంగా మూత్రాశయ క్యాన్సర్‌కు మొదటి సంకేతం.
⦿ రక్తం మీ మూత్రాన్ని పింక్, ఎరుపు లేదా నారింజ రంగులో కనిపించేలా చేస్తుంది.
⦿ మూత్రవిసర్జనలో ఇబ్బంది, మూత్ర విసర్జన బలహీనంగా ఉండటం.
⦿ మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మూత్రవిసర్జన చేయడంలో ఇబ్బంది.
⦿ ఈ లక్షణాలు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తలపిస్తాయి.


కిడ్నీ(మూత్రపిండాలు) క్యాన్సర్ లక్షణాలు:  
⦿ మూత్రంలో రక్తం.
⦿ వీపు కింద ఒక వైపు నొప్పిగా అనిపించడం. 
⦿ అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. 
⦿ తక్కువ ఆకలి.
⦿ ప్రయత్నించకుండానే బరువు తగ్గడం
⦿ నిరంతరాయంగా జ్వరం.
⦿ రక్తహీనత.


లుకేమియా లక్షణాలు: 
⦿ జ్వరం, చలిగా ఉండటం, రాత్రి పూట చెమటలు.
⦿ అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం.
⦿ బరువు తగ్గడం
⦿ కాలేయం వాపు (కుడి వైపు పక్కటెముకుల కింద భారంగా అనిపిస్తుంది)
⦿ ప్లీహం వాపు (ఎడమ వైపు పక్కటెముల కింద భారంగా అనిపిస్తుంది)
⦿ ముక్కు నుంచి రక్తం కారుతుంది. 
⦿ చర్మంపై పెటేచియా అనే చిన్న ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. 
⦿ ఎముకల నొప్పి.
⦿ లుకేమియా అనేది రక్త కణజాలాలలో ఏర్పడే క్యాన్సర్. 
⦿ లుకేమియా శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, వ్యాధి సంకేతాలు ఒక్కొక్కరిలో ఒకలా ఉండవచ్చు. 


ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు: 
⦿ బరువు తగ్గడం
⦿ పొత్తికడుపు పైభాగంలో నొప్పి.
⦿ డిప్రెషన్.
⦿ రక్తం గడ్డకట్టడం.
⦿ మధుమేహం.
⦿ శక్తి కోల్పోవడం, అలసట. 
⦿ మీ కళ్ళలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారడం (కామెర్లు).
⦿ క్యాన్సర్ వ్యాధి ముదిరే వరకు లక్షణాలేవీ కనిపించవు.


కాలేయ క్యాన్సర్ లక్షణాలు: 
⦿ బరువు తగ్గడం
⦿ ఆకలి లేకపోవడం
⦿ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం.
⦿ కడుపు నిండిన అనుభూతి
⦿ వికారం లేదా వాంతులు.
⦿ కాలేయం వాపు. 
⦿ కుడి పక్కటెముకల క్రింద భారంగా ఉండవచ్చు.
⦿ ప్లీహము వాపు. దీనివల్ల ఎడమ వైపు పక్కటెముకల క్రింద భారంగా అనిపించవచ్చు.
⦿ ఉబ్బిన పొత్తికడుపు
⦿ అకారణంగా చర్మం దురద.
⦿ కళ్ళలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారడం (కామెర్లు)
⦿ అసాధారణ గాయాలు లేదా రక్తస్రావం.
⦿ జ్వరం
⦿ తలతిరగడం లేదా మూర్ఛపోవడం.
⦿ బలహీనత లేదా గందరగోళం.
⦿ మలబద్ధకం


థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు: 
⦿ మీ మెడ వాపు.
⦿ మీ మెడ నొప్పి మీ చెవుల వరకు వ్యాపించవచ్చు.
⦿ మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
⦿ స్వరం మారుతుంది. 
⦿ గొంతు బొంగురుపోవడం వంటివి తగ్గవు
⦿ దగ్గు తగ్గకపోవడం.


ఎండోమెట్రియల్ క్యాన్సర్ లక్షణాలు: ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని ఎండోమెట్రియంను ప్రభావితం చేసే ఒక రకమైన గర్భాశయ క్యాన్సర్.  
⦿ పిరియడ్స్ లేకపోయినా యోని నుంచి రక్తస్రావం.
⦿ యోని దుర్వాసన కలిగించే స్రావాలు.
⦿ పెల్విక్ వద్ద నొప్పి.
⦿ బరువు తగ్గడం.


మెలనోమా క్యాన్సర్ లేదా చర్మ క్యాన్సర్ లక్షణాలు:  
⦿ చర్మంపై ఒక పుట్టుమచ్చ లాంటి మచ్చ లేదా ఒక రూపంలేని అసమా మచ్చలు కనిపిస్తాయి. 
⦿ రంగు రంగుల పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న మచ్చలు. 
⦿ గోధుమ, నలుపు, తెలుపు, ఎరుపు, గులాబీ లేదా నీలం రంగులో మచ్చలు.
⦿ ఎరుపు, తెలుపు లేదా నీలం రంగులో మచ్చలు.
⦿ పెద్ద సైజు పుట్టుమచ్చలు.
⦿ వేగంగా పెరిగే మచ్చలు లేదా పుట్టుమచ్చలు. 
⦿ పుట్టుమచ్చల నుంచి రక్తం కారడం, దురద.
⦿ మీ చర్మంపై కొత్తగా ఎలాంటి మచ్చలు ఉన్నా వైద్యుడిని సంప్రదించడం ద్వారా చర్మ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. 


నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్: అమెరికన్లలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఇది. అత్యధిక చర్మ క్యాన్సర్లు నాన్ మెలనోమా చర్మ క్యాన్సర్ రకానికి చెందినవి. వీటిలో బేసల్ సెల్ కార్సినోమా, స్కామౌస్ సెల్ క్యాన్సర్ అనే రెండు రకాల చర్మ క్యాన్సర్లు వీటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. 
బేసల్ సెల్ కార్సినోమా లక్షణాలు:
⦿ పుండ్లు లేదా గాయాలు నయం కాకపోవడం.
⦿ చర్మంపై పొలుసులు, ఎర్రపు రంగు మచ్చలు.
⦿ ఎరుపు, గులాబీ, తెలుపు రంగు బొడిపెలు. 
⦿ మచ్చల నుంచి రక్తస్రావం లేదా దురద.
⦿ మచ్చలు పుండ్లుగా మారడం.
⦿ ఇవి ఎక్కువగా తల, ముఖం, మెడ, ఛాతి మీద మచ్చలు కనిపిస్తాయి.


స్కామౌస్ సెల్ క్యాన్సర్ లక్షణాలు: 
⦿ గుడ్రంగా కాకుండా ఒక ఆకారమంటూ లేని ఎరుపు మచ్చలు ఏర్పడతాయి.
⦿ మొటిమల్లాంటి మచ్చలు ఏర్పడటం. 
⦿ పుండ్లు నుంచి రక్తస్రావం.
⦿ నయం కాని పుండ్లు.
⦿ దురద, చిరాకు లేదా బాధాకరమైన బొడిపెలు.
⦿ ఈ క్యాన్సర్ కణాలు.. సూర్యరశ్మి తగిలే చర్మంపై ఎక్కువగా ఏర్పడతాయి.