రక్తదానం అంటే ప్రాణదానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తాన్ని అందించి అతని ప్రాణాన్ని నిలపడమే రక్తదానం గొప్పతనం. ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్త దాన దినోత్సవం నిర్వహిస్తారు. రక్త దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, గొప్పతనాన్ని వివరించడమే ఈరోజు ప్రత్యేకత. కొందరు రక్తదానం చేయడం వల్ల తమకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటారు, కానీ రక్తదానం చేయడం వల్ల ఎదుటివారి ప్రాణాన్ని కాపాడటమే కాదు, తమకు సొంతంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఉన్న అదనపు ఇనుము స్థాయిలను తగ్గించుకోవచ్చు. రక్తంలో ఐరన్ శాతం పెరిగితే హిమోక్రోమాటోసిస్ వంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ఈ సమస్య వస్తే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంది. రక్తదానం చేయడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రక్తదానం చేయడానికి ముందే ఆ వ్యక్తి రక్తం ఇవ్వడానికి అర్హుడో కాదో నిర్ణయిస్తారు. రక్తహీనత, అంటువ్యాధులు వంటివి ఉంటే వారి రక్తాన్ని తీసుకోరు. 


రక్తదానం ప్రాముఖ్యతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్ క్రాస్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు కలిసి 2004లో తొలిసారి ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని ప్రారంభించారు.  రక్తదానం చేయడం పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆ రోజు ఎన్నో కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం అనేది ఒక వ్యక్తి చేసే అత్యంత నిస్వార్థమైన పని. ఎందుకంటే అది ఎదుట వారి ప్రాణాలను కాపాడుతుంది. రక్త దానం చేయడం వల్ల పాత రక్తం బయటకు పోయి, కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం పై సానుకూల ప్రభావాలను చూపిస్తుంది.


రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందని చాలా మంది అనుకుంటారు. అది కేవలం ఒక అపోహ. రక్తదానం చేయడం ఎలాంటి బలహీనత రాదు. రక్తదానం చేశాక ఎప్పటిలాగే తమ పనులు తాము చేసుకోవచ్చు. రక్తదానం చేసేటప్పుడు నొప్పి వస్తుందనేది కూడా పెద్ద అపోహే. ఎలాంటి నొప్పి రాదు. కేవలం సూది గుచ్చినప్పుడు మాత్రమే కాస్త నొప్పి వస్తుంది.  రక్తదానం చేయాలనుకునే వ్యక్తికి 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వయసు ఉండాలి. అలాగే యాభై కిలోల బరువు ఉండాలి. జీవిత కాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చు. పురుషులు ప్రతి మూడు నెలలకోసారి, మహిళలు అయితే ఆరు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉన్న వారు మాత్రమే రక్తాన్ని దానం చేయచ్చు.  



Also read: ఆహారాన్ని సురక్షితంగా ఎలా నిల్వ చేయాలో చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ



Also read: ఉదయం టీతో పాటు రస్కులు కూడా తింటున్నారా? అదెంత అనారోగ్యకరమో తెలుసా



























































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.