ఆ మహిళ నివసించేది నాలుగో ఫ్లోర్లో. కిటికీకి దుమ్ముపడితే లోపల తుడిచింది సరే, మరి బయట వైపు దుమ్ము ఎలా దులపాలి? అందుకోసం ప్రాణాన్నే పణంగా పెట్టింది. కిటికీని పట్టుకుని బయటికి వేలాడుతూ తుడిచింది.పట్టు జారితే ఎముకలు విరగడం ఖాయం. ఆమె చేసిన ప్రమాదకరమైన విన్యాసాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. దాన్ని ట్విట్టర్లో అప్‌లోడ్ చేయగానే వైరల్ గా మారింది. ఆమె పేరు తెలియదు కానీ ఊరు మాత్రం ఘజియాబాద్ అని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు. ‘శుభ్రం పరచడం ఒక జీవితం కన్నా ముఖ్యమైనది కాదు. ఆమె క్షేమంగా ఉందని నేను భావిస్తున్నాను’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో సభ్యుడు ‘చూస్తుంటే భయమేస్తోంది’ అని రాశారు. ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్స్ చేసే వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నాయి.
మొన్నటికిమొన్న ఫరీదాబాద్ లోని సెక్టార్ 82 ప్రాంతంలో ఉన్న ఫ్లోరిడా అపార్ట్ మెంట్లో 12 వ అంతస్థులో ఓ వ్యక్తి ప్రమాదకరంగా వ్యాయామాలు చేశాడు. బాల్కనీలోని రెయిలింగ్ పట్టుకుని స్ట్రెచెస్ చేశాడు. చూసిని వారికి ఆ ఘటన చాలా భయమేసింది.కాసేపటికి ఓ మహిళ వచ్చి అతడిని లోపలికి తీసుకెళ్లింది. ఆ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి అలా చేసినట్టు వార్తలు వచ్చాయి.
అంతకుముందు ఓ మహిళ ఇలాగే ఓ ప్రమాదకరమైన ఫీట్ చేసింది. చీర కింద ఫ్లాట్ వారి బాల్కనీలో పడిపోయిందని కొడుకు నడుముకి తాడు కట్టి దించింది. ఇదంతా జరిగింది పదో ఫ్లోర్లో. తాడు తెగితే ఆ బాలుడి పరిస్థితి ఏమవుతుందో అన్న భయం తల్లికి కలుగలేదు. ఇలాంటి వీడియోలన్నీ ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.
Also read: పెళ్లి చేసుకుంటే మతిమరుపు పోతుందా ! అధ్యయనంలో తేలిన విషయాలివే
Also read: శునకాన్ని పెంచుకుంటే ఎన్ని లాభాలో, గుండె పోటు రిస్క్‌ను కూడా తగ్గించుకోవచ్చు