ఆకలేస్తే ఆహారం తింటాం, దాహమేస్తే నీళ్లు తాగుతాం. మరి శరీరానికి అలాంటి కోరికలు కలిగితే? దీనికి సమాధానం కొంచెం కష్టమే. ఎందుకంటే.. అది వెంటనే కోరుకుంటే దొరికేది కాదు. పైగా సమాజంలో శారీరక కలయికను తప్పుగా కూడా పరిగణిస్తారు. రోజులు మారుతున్నా.. దీనిపై మాట్లాడటం, చర్చించడం ఇంకా తప్పుగానే పరిగణిస్తున్నారు. చివరికి భార్యభర్తలు సైతం దీన్ని.. పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు. బిజీ లైఫ్, పిల్లలు... పనులు ఇంకా చాలా అంశాలు వారి లైంగిక జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. ఒకరిపై ఒకరికి ఆసక్తి తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణం. అయితే, భర్తతో ఆ సుఖాన్ని పొందకపోతే నష్టపోయేది మహిళలేనని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా చనిపోయే ప్రమాదం తెలుపుతున్నాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల వాల్డెన్ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. స్టడీలో భాగంగా 14,542 మంది పురుషులు, మహిళలపై హెల్త్ డేటాను పరిశీలించారు. ఈ సందర్భంగా 20 నుంచి 59 ఏళ్ల వయస్సు గల మహిళలు.. వారంలో ఒకసారి కంటే ఎక్కువ రోజులు ‘కలయిక’కు దూరంగా ఉన్నట్లయితే.. చనిపోయే అవకాశాలున్నాయని అంచనా వేశారు. వారంలో కనీసం ఒకసారి తమ భాగస్వామితో ఆ సుఖాన్ని పొందినవారితో పోల్చితే.. ఆ సుఖానికి దూరంగా ఉన్న మహిళలు చనిపోయే అవకాశాలు 70 శాతం ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడించారు.
ఎందుకు చనిపోతారు?
పడక సుఖానికి దూరమైన మహిళల్లో అనారోగ్యానికి కారణమయ్యే ప్రోటీన్ల స్థాయి పెరుగుతున్నట్లు తెలిసింది. వాటి వల్ల ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలు, అవయవాలకు హాని కలుగుతుంది. కలయిక వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుందని, దాని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తప్పుందని అధ్యయనం పేర్కొంది. అందుకే, ఆ సుఖాన్ని పొందని మహిళలు త్వరగా అనారోగ్యానికి గురవ్వుతారని తెలిపింది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే నెలలో కనీసం నాలుగు సార్లైనా భాగస్వామితో ఆ సుఖాన్ని పొందాలని పరిశోధకులు సూచిస్తున్నారు. శారీరక సుఖం వల్ల ఆరోగ్యమే కాదు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.. రోగాల నుంచి కోలుకోడానికి కూడా సహకరిస్తుందని చెబుతున్నారు.
ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు?
కలయిక వల్ల కేవలం గుండె సమస్యలు మాత్రమే కాదు. డిప్రెషన్, ఊబకాయం వంటి సమస్యలు కూడా దరిచేరవని అధ్యయనం వెల్లడించింది. స్టడీలో పాల్గొన్న స్త్రీ పురుషులను.. కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏడాదిలో ఎన్ని సార్లు మీ భాగస్వామితో సుఖాన్ని పొందారని ప్రశ్నించారు. వారిలో 95 శాతం మంది ఏడాదిలో 12 సార్లు అని సమాధానం ఇచ్చారు. అంటే వారిలో 38 శాతం మంది ఒక వారం ఒకసారి, లేదా రెండు వారాల్లో ఒకసారి చొప్పున తమ భాగస్వామితో లైంగికగా కలుస్తున్నట్లు వెల్లడించారు.
డిప్రెషన్ ఉంటే మరింత డేంజర్
డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలు.. వారంలో ఒక్కసారి కూడా ఆ సుఖాన్ని పొందకపోతే చనిపోయే ప్రమాదం 197 శాతంగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. అయితే, నిత్యం పడక సుఖాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తుల్లో మాత్రం డిప్రెషన్ చాయలే కనిపించలేదని స్టడీ వెల్లడించింది. ఎందుకంటే.. ఆ సుఖాన్ని పొందేప్పుడు ఎండార్ఫిన్స్ (endorphins) విడుదల అవుతాయి. అవి మనకు పెయిన్ కిల్లర్స్‌లా ఉపయోగపడతాయి. అంతేకాదు.. అవి స్ట్రెస్ నుంచి కూడా దూరం చేస్తాయి.
అతిగా చేసినా అనార్థమే
ఆ సుఖం ఆరోగ్యానికి మంచిదే కదా అని.. అదే పనిగా చేస్తున్నా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషులకే ఆ ముప్పు ఎక్కువట. అతిగా సుఖాన్ని పొందే మహిళలతో పోల్చితే.. పురుషులకే ఆ చనిపోయే ప్రమాదం ఆరు రెట్లు అధికంగా ఉందని తాజా స్టడీలో వెల్లడించారు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయట. ఆ పని చేస్తున్న సమయంలో రక్త ప్రవాహంలోకి అడ్రినలిన్, కార్టిసాల్ విడుదల అవుతాయి. అది గుండె దడను పెంచుతాయి. రక్తపోటు పెరిగి శరీరం అదుపుతప్పే ప్రమాదం కూడా ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువగా లైంగిక చర్యల్లో పాల్గొనేవారిలో గుండె సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి?
చాలామంది జంటలు ఇటీవల కాలంలో లైంగిక సుఖానికి దూరమవుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. లైఫ్ స్టైల్, ఆర్థిక పరిస్థితులు, పిల్లలు, ఆసక్తి తగ్గిపోవడం, అనారోగ్యం, మనస్పర్థలు, మానసిక ఆందోళనలు.. ఇలా కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో మీకు ఏ సమస్య ఉన్నా.. తప్పకుండా డాక్టర్‌ను లేదా మానసిక నిపుణులను సంప్రదించండి. వీలైతే దీనిపై ఇద్దరూ చర్చించుకోండి. ఒకరి తప్పులను ఒకరు సరిదిద్దుకుని ‘ఒక్కటి’గా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లండి. ఎక్కువ కాలం జీవించేందుకు ప్రయత్నించండి.
Also Read : బీపీ ఉన్నవారు ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ జోలికి మాత్రం అస్సలు పోకూడదు
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు అధ్యయనాలు, జర్నల్స్ నుంచి సేకరించిన అంశాలను యథావిధిగా ఇక్కడ అందించాం. ఇలాంటి సమస్యలపై నిపుణులను సంప్రదించాలని మనవి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’ లేదా ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.