నసుకు నచ్చిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే.. ఎంత బాధగా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తి చావుబతుకులతో పోరాడుతుంటే గుండె బరువెక్కుతుంది. అందుకే, ఆమె తన ప్రేమికుడిని ఎలాగైనా ప్రేమించుకోవాలని అనుకుంది. తనలో సగంగా భావించే అతడి కోసం తన కిడ్నీల్లో ఒకటి దానమిచ్చి.. జీవితాంతం తోడు ఉండాలని అనుకుంది. కానీ, అక్కడే సీన్ రివర్స్ అయ్యింది. ఆమె కిడ్నీతో మళ్లీ ఊపిరి పోసుకున్న అతడు.. ఊహించని విధంగా ఆమెకు షాకిచ్చాడు. ఆమె గుండెను ముక్కలు చేశాడు. 


హాంగ్‌కాంగ్‌కు చెందిన కోలీన్ లీ అనే యువతి 17 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడింది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న తన ప్రియుడిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది. దీంతో ఆమె తన కిడ్నీని ప్రియుడికి దానమిచ్చింది. డాక్టర్లు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యవంతుడిగా మారిన కోలీన్ ప్రియుడు.. ఆమె త్యాగాన్ని మరిచిపోయాడు. మరో యువతితో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె టిక్-టాక్ వీడియోలో తెలిపింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఓ టీవీ షోలో తన ప్రేమ కథను చెప్పి గొల్లుమంది. 


‘‘నేను నా ప్రేమను వ్యక్తం చేసిన రోజే అతడు తన కిడ్నీ వ్యాధి గురించి చెప్పాడు. నిజమైన ప్రేమకు అది అడ్డుకాదని అనిపించింది. నా కిడ్నీతో అతడిని బతికించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా. కానీ, అది అతడికి మ్యాచ్ అవుతుందా లేదా అనే అనుమానం కలిగింది. వైద్య పరీక్షల్లో నా కిడ్నీ అతడికి మ్యాచ్ అవుతుందని తేలింది. తల్లిదండ్రులు వారిస్తున్నా.. వేరే ఆలోచన లేకుండా నేను నా కిడ్నీని దానమిచ్చాను’’ అని తెలిపింది.


‘‘నా కిడ్నీతో ప్రాణం పోసుకున్న అతడు.. ఓ రోజు తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్స్ ట్రిప్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అతడిలో చాలా మార్పు కనిపించింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత మా మధ్య గొడవ జరిగింది. నన్ను ఒక గయ్యాళిగా చిత్రీకరించాడు. చివరికి నన్ను మోసం చేశాడు. నాకు బ్రేకప్ చెప్పాడు. ఇప్పుడు నా కిడ్నీ పోయే, ప్రేమా పోయే..’’ అని వాపోయింది. టిక్‌టాక్‌లో ఈమె వీడియో చూసిన కొందరు మద్దతుగా మాట్లాడారు. ‘‘నీది నిజమైన ప్రేమ. నువ్వు లేకుండా బతికేవాడికి.. నీ కిడ్నీ కూడా అవసరం లేదు. దాన్ని వెనక్కి తీసుకో(?)’’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘ప్రేమంటే గుండెలో స్థానం ఇవ్వాలి. కానీ, ఇలా కిడ్నీలు దానిమిచ్చేస్తే ఎలా? నీ జీవితానికి.. నిన్ను ప్రేమించే పెద్దల గురించి కూడా ఆలోచించాలి’’ అని మరొకరు హితవు పలికారు. మరి మీరు ఏమంటారు? 


Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు


Also read: బస్సులో పట్టేంత మందిని ఆటోలో ఎక్కించేశాడు, పోలీసులకే దిమ్మదిరిగింది, వైరలవుతున్న వీడియో