భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతుందని ఇది మరింత బలపడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఏన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు మోస్తారు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరద, భారీవర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, డా.బి.ఆర్అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో మొదటి హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులతో సమన్వయ పరుచుకుని సహాయక చర్యలకు రెండు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపినట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, చింతూరులో ఒక ఎస్డీఆర్ఎఫ్, తూర్పుగోదావరి జిల్లా వి.ఆర్.పురంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం ఉన్నట్లు చెప్పారు. ఈ బృందాలు ఓబియమ్ బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నాయన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహాయక సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఏన్టీఆర్, కృష్ణా జిల్లాల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
టోల్ ఫ్రీ నెంబర్లు
వర్షాలు, వరదలు ముంచెత్తున్న వేళ అత్యవసర సహాయం, ఇతర సమాచారం కోసం ఈ క్రింది టోల్ ఫ్రీ నెంబర్లను ప్రతీ ఒక్కరి వద్దా ఉంచుకోవాలని.. 24 గంటలూ అవి పనిచేస్తూ ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
నెంబర్లు ఇవే:-
1070
18004250101
08632377118