Pneumonia Causes and Prevention Tips : చలికాలం ప్రారంభం కాగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు రావడం కామన్. చల్లని గాలి, ఉష్ణోగ్రతలు తగ్గడం, శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారడం వల్ల చాలామంది త్వరగా అనారోగ్యానికి గురవుతారు. అయితే అన్ని జలుబులు.. సాధారణ జలుబు కాకపోవచ్చు. ఎందుకంటే అది న్యుమోనియా కావచ్చు. మొదట్లో సాధారణ జలుబుగా ప్రారంభమై.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రూపం దాల్చవచ్చు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.
చలికాలంలో శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తగ్గుతుంది. దీని వలన వైరస్, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముక్కు, గొంతు ఎండిపోతుంది. దీని వలన ఇన్ఫెక్షన్ సులభంగా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. అందుకే చలికాలంలో న్యుమోనియా కేసులు బాగా పెరుగుతాయి. మరి చలికాలంలో న్యుమోనియా ఎందుకు పెరుగుతుందో.. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
న్యుమోనియాకు కారణాలివే..
చలికాలంలో శ్వాస తీసుకునేప్పుడు చల్లని గాలి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఈ గాలి ఊపిరితిత్తుల కణజాలాలను ప్రభావితం చేసి.. ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. చలి కారణంగా ఎక్కువమంది కిటికీలు, తలుపులు మూసివేస్తారు. స్వచ్ఛమైన గాలి లోపలికి రాదు. లోపలి గాలి బయటకు వెళ్లేదారి ఉండదు. దీని వలన కూడా వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వింటర్లో శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి కొంచెం నెమ్మదిస్తుంది. అటువంటి పరిస్థితిలో.. శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడలేకపోతుంది. ఇది న్యుమోనియా ప్రమాదం పెంచుతుంది.
పొడి, చల్లని గాలి ముక్కు, గొంతులో తేమను తగ్గిస్తుంది. దీని వలన వైరస్లు, బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆస్తమా, గుండె ఆరోగ్యం, మధుమేహం లేదా COPD ఉన్నవారిలో చలికాలంలో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. వారికి న్యుమోనియా వచ్చే అవకాశం పెరుగుతుంది.
న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
చల్లని గాలి నేరుగా ముక్కు నుంచి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్ లేదా మాస్క్ ధరించండి. వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి.. చేతులను శుభ్రంగా కడుక్కోండి. లేదా శానిటైజర్ చేసుకోండి. కిటికీలను కొద్దిసేపు తెరవండి. తద్వారా గాలి లోపలికి, బయటకు వెళ్లే అవకాశముంది. చలికాలంలో తక్కువ నీరు తాగుతారు. దీని వలన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి నీళ్లు తాగండి. లేకపోతే సూప్, కషాయం వంటి హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, విటమిన్-సి అధికంగా ఉండే వాటిని తీసుకోండి. సిగరెట్లు ఊపిరితిత్తులను బలహీనపరుస్తాయి. న్యుమోనియా ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవాలి. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. చలికాలంలో ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి కొంత దూరం పాటించండి. మాస్క్లు వేసుకుంటే మంచిది.