నాజూకైనా ఆకృతి కోసం ఎక్కువ మంది లెమన్ వాటర్ పొద్దున్నే తాగేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే పానీయాలలో ఇదీ ఒకటి అని నమ్ముతారు. గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని అందులో కాస్త తేనె జోడించుకుని తీసుకుంటారు. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. నిర్జలీకరణం బారిన పడకుండా కాపాడుతుంది. జీర్ణక్రియకి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ చక్కని అద్భుతమైన పానీయం అంతగా ఆరోగ్య ఔత్సాహికులని ఆకర్షించడానికి కారణం ఏంటో తెలుసా? అందులో ఉండే పోషకాలు. ఈ డ్రింక్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమే కాదు పొటాషియం, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.
హైడ్రేట్ చేస్తుంది
ఉదయం మీ రోజుని కాఫీ, టీతో కాకుండా నిమ్మకాయ నీటితో ప్రారంభిస్తే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మానికి ఇది మేలు చేస్తుంది.
విటమిన్ సి పుష్కలం
నిమ్మకాయలు విటమిన్ సి కి గొప్ప మూలం. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ప్రసిద్ధి చెందింది. నిమ్మకాయ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతుంది.
మెరుగైన జీర్ణక్రియ
జీర్ణక్రియకి నిమ్మరసం అద్భుతమైన పానీయం. ఇందులోని ఆమ్లత్వం జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారం విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ కలయిక జీర్ణవ్యవస్థపై చక్కని ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్, వ్యర్థాలని బయటకి పంపడంలో సహాయపడుతుంది.
చర్మానికి మేలు
ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలనుకుంటే నిమ్మకాయ నీరు తాగొచ్చు. ఇందులోని విటమిన్ సి చర్మం మెరిసేలా చేసే కొల్లాజెన్ ని అందిస్తుంది. చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గుతారు
బరువు తగ్గించడంలో కొంత వరకు నిమ్మకాయ నీరు సహాయపడుతుంది. నిమ్మకాయలోని పెక్టిన్ ఫైబర్ ఆకలి కోరికల్ని అరికట్టడంలో సహాయపడుతుంది. అదనపు కేలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది.
ఏది సరైన సమయం
నిమ్మరసం కలుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అధిక మొత్తంలో నిమ్మరసం జోడించడం ప్రమాదకరం. ఇందులోని అధిక ఆమ్లత్వం కడుపుని చికాకు పెట్టేస్తుంది. అది మాత్రమే కాదు దంతాల మీద ఉండే ఎనామెల్ ని నాశనం చేస్తుంది. పళ్ళు సున్నితత్వం అయ్యేలా చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండుకుని తీసుకుంటే మంచిది. ఇది తాగేందుకు సరైన సమయం కూడా చూసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఉత్తమ సమయం. జీవక్రియ, జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
నష్టాలున్నాయ్ జాగ్రత్త
ఆరోగ్యాన్ని అందిస్తుందని అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. హైడ్రేట్ గా ఉంచడమే కాదు అధిక మొత్తంలో నిమ్మకాయ నీరు తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపిస్తుంది. జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. నోట్లో పుళ్ళు వచ్చేలా చేస్తుంది. అందుకే మితంగా తీసుకుంటే ఆరోగ్యకరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పిల్లలకు దగ్గు తగ్గుతుందని తేనె పెడుతున్నారా- ఈ భయంకరమైన వ్యాధి రావొచ్చు జాగ్రత్త!