తామర పువ్వులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. బురదలో ఉన్నప్పటికీ వాటి అందం మాత్రం ఏ మాత్రం తగ్గదు. అయితే తామర వేళ్ళతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. చాలా రుచికరంగా కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ తామర వేళ్లని లోటస్ రూట్స్ అని పిలుస్తారు. ఆసియా వంటకాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. వీటినే కమల్ కక్డి అని కూడా పిలుస్తారు. బురదలో ఉండటం వల్ల వీటిని తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటారు.


లోటస్ రూట్ అనేది ఒక రకమైన ఆక్వాటిక్ రూట్ వెజిటబుల్. దీని రూపం కొద్దిగా స్క్వాష్ కూరగాయని పోలి ఉంటుంది. కొద్దిగా తీపి రుచి కలిగి ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, కేలరీలు కూడా తక్కువ. ఈ కూరగాయలో లభించే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బరువు తగ్గేందుకు అద్భుతమైన ఆహారంగా దీన్ని పరిగణిస్తారు. పొటాషియం, భాస్వరం, రాగి, ఐరన్, మాంగనీస్, లోటస్ రూట్ లో లభించే ఖనిజాలు. థయామిన్, పాంతోతేనిక్ యాసిడ్, జింక్, విటమిన్ B6, విటమిన్ సి దీనిలో లభిస్తాయి. లోటస్ రూట్ లో లభించే అత్యంత ముఖ్యమైన పోషకం ఫైబర్. నీరు శాతం అధికంగా ఉంటుంది.


లోటస్ రూట్ ప్రయోజనాలు


⦿ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది


⦿ హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారిస్తుంది


⦿ జీర్ణక్రియని సులభతరం చేస్తుంది


⦿ గుండెకి మేలు చేస్తుంది


⦿ చర్మ సంరక్షణకి ఉపయోగపడుతుంది


⦿ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది


⦿ రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది


లోటస్ రూట్ ని బాగా శుభ్రం చేసిన తర్వాత ఉడికించుకుని తినాలి. ముక్కలుగా కోసిన తర్వాత వాటి రంధ్రాల్లో ఉన్న మట్టిని చక్కగా తొలగించి శుభ్రం చేసుకోవాలి. వీటికి మసాలా దట్టించి వేయించి స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. కరకరలాడుతూ ఉండటం వల్ల వీటిని చాలా మంది పచ్చిగా తినేందుకు చూస్తారు. కానీ దీని వల్ల అనారోగ్య సమస్యలు లేనప్పటికీ పచ్చిగా తినడానికి మాత్రం ఎంచుకోవద్దు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా లేదా పరాన్న జీవులని అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. అందువల్ల తామర వేళ్ళని తినడానికి ముందుగా బాగా నీటితో మట్టి పోయే విధంగా కడుక్కుని ఉడికించుకుని తినడం మేలు.


ఈ వేళ్ళని ఎండబెట్టి పొడి చేసి మూలికా వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. అలర్జీ, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఊరగాయగా కూడా పెట్టుకుంటారు. రొయ్యలతో కలిపి వండుకుని తింటే రుచి చాలా బాగుంటుంది. చర్మ సంరక్షణకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులోని లక్షణాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉండేలా చేస్తాయి. చర్మం మీద ముడతలు, వృద్ధాప్య సంకేతాలని దూరం చేసేందుకు సహాయపడుతుంది. చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్న వాళ్ళు ఈ తామర పువ్వు గుణాలు ఉన్న ఉత్పత్తులు వినియోగిస్తే చక్కటి ఫలితం పొందుతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: యవ్వనమైన చర్మం కావాలా? ఈ ఆహార పదార్థాలతో అది సాధ్యమే!