శరీరంలో నిర్లక్ష్యం చేసే భాగాల్లో గోళ్లు కూడా ఒకటి. మనలో చాలామందికి వాటికి నెయిల్ పాలిష్ వేయడం అలవాటు. అయితే వాటి శుభ్రత గురించి మాత్రం పట్టించుకోము. కానీ గోళ్లు మన ఆరోగ్యాన్ని చెప్పేస్తాయి. గోళ్ళ పై తెల్ల మచ్చలు వస్తే అవి మీ ఆరోగ్యానికి సంబంధించిన సూచికలుగా భావించాలి. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఆరోగ్యకరమైన గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. గోళ్ళ కొనవద్ద కొంచెం వంపు ఉంటుంది. రంగు, ఆకృతిలో మార్పు అనేది పోషక లోపాలను, అంటువ్యాధులను, అంతర్లీన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. జుట్టు, గోళ్లు వంటివి కెరాటిన్ తో తయారవుతాయి. కెరాటిన్ లోపం వల్ల గోళ్లు పెళుసుగా, నిస్తేజంగా, పొడిగా మారుతాయి. మనకు ఏడాదిలో గోళ్లు ఒక అంగుళం మేర పెరుగుతూ ఉంటాయి.


గోళ్లు నేరుగా పెరగకుండా వ్యతిరేక దిశలో లేదా వక్రంగా పెరుగుతూ ఉంటే మీకు ఇనుము లోపం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. లేదా శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలకు కూడా దీన్ని సంకేతంగా భావించవచ్చు. చతురస్రాకారంలో లేదా వెడల్పుగా ఉన్న గోళ్లు హార్మోన్ల రుగ్మతలను సూచిస్తాయి. చదునైనా సన్నని గోళ్లు తగినంత పోషకాలు అందుతున్నట్టు సూచిస్తాయి. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి విటమిన్లను అధికంగా కలిగి ఉంటాయి. ఆకుపచ్చని ఆకుకూరలు, నట్స్ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే సిట్రస్ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


కెరాటిన్ పైన ఉన్న రక్షిత పొరలు దెబ్బతిన్నప్పుడు గోళ్లు... పెళుసుగా మారి రాలిపోతూ ఉంటాయి. వేడి గాలి, చల్లదనం వంటి వాటికీ గోళ్లు గురైతే  పొట్టు పొట్టుగా రాలిపోతాయి. ఈ పరిస్థితి తరచుగా ఒమెగా 3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని సూచిస్తుంది. వీటి కోసం వాల్‌నట్స్, పొద్దు తిరుగుడు గింజలు, బాదం వంటివి తినాలి. అలాగే గోళ్లను ఎప్పుడూ మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి.


పసుపు రంగులోకి గోళ్లు మారడం, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, కాలేయ సమస్యలను సూచిస్తుంది. ఇది అనేక వివిధ అంతర్గత రుగ్మతలకు ముందస్తు సంకేతం. గోళ్ళపై వచ్చే పసుపు మచ్చలు ఫంగస్ లేదా సోరియాసిస్ వంటి వాటికి కూడా సూచికగా పనిచేస్తాయి.


పెళుసుగా ఉండే గోళ్లు త్వరగా రాలిపోతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో ఇలా గోళ్లు పెళుసుగా మారడం అనే సమస్య ఉంటుంది. ఆహారంలో కాల్షియం, ప్రోటీన్లు తగినంతగా తీసుకోకపోవడం వల్ల ఇవి బలహీనంగా ఉంటాయి. మెంతాకులు, చేపలు, ఆకుకూరలు వంటివి తినడం వల్ల గోళ్ళల్లో పెళుసుదనం తగ్గుతుంది.


తెల్లటి గీతలు, మచ్చలు వంటివి గోళ్ళపై కనిపిస్తూ ఉంటాయి. ఇది జ్వరం, కాలేయం, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలను సూచిస్తుంది. అలాగే ఇనుము, జింక్ వంటివి లోపించడానికి కూడా ఇవి సంకేతం. బీన్స్, పాల ఉత్పత్తులు, చికెన్, ఎండు ద్రాక్ష, బఠానీలు వంటివి తింటే ఈ సమస్య తగ్గుతుంది.


 గోళ్లు అనారోగ్య కరమైన రంగులో ఉంటే దానికి కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు అని అర్థం చేసుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్లను గోరును బేస్ నుండి వేరు చేస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ప్రభావితమైన గోరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.


గోరుపై కనిపించే నిలువ చీలికలు ఇనుము లోపం, విటమిన్లు వంటి పోషకాల లోపాన్ని సూచిస్తుంది. మూత్రపిండాల సమస్యలను కూడా ఈ నిలువు గీతలు సూచిస్తాయి. ఈ నిలువుగీతలు ఉన్నవారికి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంది.


Also read: ఏడు నెలల పాప పొట్టలో రెండు కిలోల బరువున్న మరో బిడ్డ, ఇలా ఎందుకు జరుగుతుంది?










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.