కొన్ని ఘటనలు చాలా ఆశ్చర్యపరుస్తాయి. ఇలా కూడా జరుగుతాయా? అనిపించేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఇదీ ఒకటి. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయోగరాజ్‌లో ఓ అరుదైన కేసు బయటపడింది. ఏడు నెలల చిన్నారి పొట్టలో రెండు కిలోలు బరువు ఉన్న పిండం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దానికి సకాలంలో శస్త్ర చికిత్స చేసి ఆ పిండాన్ని తొలగించడంతో ఏడు నెలల పాప ప్రాణాలు నిలిచాయి.


పాప పుట్టినప్పటినుంచి ఆమె పొట్ట కాస్త ఎత్తుగా ఉండేది. పాప వయసు పెరుగుతున్న కొద్ధీ పొట్ట కూడా పెద్దగా అయింది. ఈమె తల్లీ ప్రసవ సమయంలోనే మరణించింది. తండ్రికి చిన్నారి పొట్ట ఎందుకంత ఎత్తుగా ఉందో తెలియక భయపడ్డాడు. చాలామంది వైద్యులకు చూపించాడు. అందరి వైద్యులు బయట నుంచి పొట్టను చూసి, పొట్ట ఉబ్బరము లేక మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. కొన్ని మందులను సూచించారు. అవి వాడాక కూడా పొట్ట పరిమాణం ఏమాత్రం తగ్గలేదు. దీంతో ఆ తండ్రి మోతిలాల్ నెహ్రూ ప్రభుత్వ వైద్య కళాశాలలోని సరోజినీ నాయుడు పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శిశువుకు కొన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో చిన్నారి కడుపులో ఆరు నెలల పిండం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆ పిండానికి చేతులు, కాళ్లు, తలపై వెంట్రుకలు అభివృద్ధి చెందాయి. శస్త్ర చికిత్స చేసి ఆ పిండాన్ని తొలగించారు. అది పాక్షికంగా మాత్రమే అభివృద్ధి చెందింది. అయితే అలా వదిలేసినా కూడా ఆ పిండం బిడ్డగా మారి బతికే అవకాశం లేదు. అందుకే వైద్యులు తొలగించారు. అంతేకాదు 7 నెలల పాప ప్రాణాన్ని కాపాడాలంటే ఆ పిండాన్ని తొలగించాలి.


వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200 కేసులు మాత్రమే ఇలాంటివి నమోదవుతూ ఉంటాయని వివరించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పిల్లలకు ఏదో ఒక వ్యాధి వస్తుందని అయితే ఈ బిడ్డకు వేరే ఎలాంటి వ్యాధి కానీ సమస్య కానీ లేదని వివరించారు. పిండం తొలగించాక ఆ పిల్లవాడు ఆరోగ్యకరమైన స్థితిలోనే ఉన్నట్టు తెలిపారు.


ఇలాంటి పరిస్థితిని Foetus in Fote అని పిలుస్తారు. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే రెండో పిండం కూడా ఫలదీకరణం చెంది బిడ్డలో చేరుతుంది. అలా బిడ్డతో పాటు ఆ రెండో పిండం కూడా ఎదుగుతూ ఉంటుంది. బిడ్డకు జన్మనిచ్చాక ఆ బిడ్డ పొట్ట పరిమాణాన్ని బట్టి లోపల మరో పిండం ఉన్న విషయం బయటపడుతుంది. అంతవరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలా అరుదుగానే ఇలా జరుగుతుంది. గర్భిణీ స్త్రీ లోని పొట్టలో రెండు అండాలు ఫలదీకరణం చెందినప్పుడు కవలలు పుడతారు. కానీ ఒక పిండం లోపల మరో పిండం చేరడం అనేది ప్రపంచంలో చాలా అరుదుగా జరిగే ప్రక్రియ.


Also read: ఈ ఏడు లక్షణాలు కనిపిస్తే, మీరు వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించాల్సిందే









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.