విటమిన్లు అనగానే ఏ, బి, సి, డి ఠక్కున గుర్తుకు వస్తాయి. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి విటమిన్ పి మాటేమిటి. అదేంటి విటమిన్ పి కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజమే. విటమిన్ పిని ఫ్లేవనాయిడ్స్ అంటారు. నిజానికి ఇది విటమిన్ కిందకు రాదు. అందుకే దీనికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఫైటోన్యూట్రియెంట్స్ ని విటమిన్ పి కింద లెక్కకడతారు. ఇది ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహార పదార్థాలలో లభిస్తుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


గుండెకి మేలు


విటమిన్ పి ని బయో ఫ్లేవనాయిడ్స్ అని కూడా పిలుస్తారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన రక్తనాళాల పనితీరుకి సహాయపడుతుంది.


మెరుగైన రోగనిరోధక వ్యవస్థ


విటమిన్ పి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. కణాలని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పని చేసేలా చేస్తుంది.


ఉబ్బసం తగ్గిస్తుంది


బయోఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంటాయి. వాపుని తగ్గించడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, అలర్జీలు, ఉబ్బసం వంటి లక్షణాలని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


చర్మానికి మంచిదే


విటమిన్ పి చర్మంలోని కేశనాలికలుని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చర్మం పగుళ్లు రాకుండా, గాయాలు త్వరగా నయం అయ్యేలా చూస్తుంది.


కంటికి మేలు


కంటిలోని ఆరోగ్యకరమైన రక్తనాళాలకు బయోఫ్లేవనాయిడ్స్ అవసరం. ఇవి దృష్టిని మెరుగుపరుస్తుంది. కంటి శుక్లం వంటి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


మెదడు పనితీరు చక్కగా


జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు పనితీరుని మెరుగుపరచడంలో ఈ విటమిన్ సహకరిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.


క్యాన్సర్ నివారణ


కొన్ని బయోఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తాయి. రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


ఏయే ఆహారాల్లో లభిస్తుంది


సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి.


డార్క్ చాక్లెట్: 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్ లో క్యాటెచిన్, ప్రొసైనిడిన్స్ వంటి ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి.


బెర్రీస్: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలో ఆంథోసైనిన్ వంటి ఫ్లేవనాయిడ్ లభిస్తాయి.


యాపిల్: యాపిల్ లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ లభ్యమవుతుంది. ఎరుపు, పసుపు రంగు యాపిల్స్ లో ఇది అధికంగా ఉంటుంది.


గ్రీన్ టీ; గ్రీన్ టీలో క్యాటెచిన్ అనే ఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది.


రెడ్ వైన్: రెస్వెరాట్రాల్ వంటి ఫ్లేవనాయిడ్‌లను కలిగి ఉంటుంది. కానీ దీన్ని మితంగా తీసుకునే గుండెకి మేలు చేస్తుంది.


ఆకుకూరలు: కాలే, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరల్లో అధికంగా ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఖతర్నాక్ కరోనా - లంగ్స్ మాత్రమే కాదు, ఈ అవయవాలనూ చిద్రం చేస్తుందట!