మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కేసులు పెరిగిపోతున్నాయి. అధిక సంఖ్యలో జనాభా మధుమేహం బారిన పడుతున్నారు. మన దేశంలో మధుమేహం వల్ల వచ్చే గుండె సమస్యలు అధికంగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది. 30 ఏళ్లు దాటిన పెద్దలలో అధిక శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్‌కు, గుండె ఆరోగ్యానికి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. డయాబెటిస్ ఉన్న వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్డియో వాస్కులర్ డిసీస్ లేదా కరోనరీ వ్యాధులు... గుండెపోటును, స్ట్రోక్‌ను త్వరగా వచ్చేలా చేస్తాయి. శరీరంలో మధుమేహం అదుపులో ఉండకపోతే గుండె సమస్యలు త్వరగా వస్తాయి.


రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. అవి నిరంతరం అధిక స్థాయిలో ఉండడం వల్ల గుండెకు చేటు తప్పదు. శరీరమంతా రక్తాన్ని సరఫరా చేసే బాధ్యత రక్తనాళాలదే.  రక్తనాళాల్లో ముఖ్యమైనవి ధమనులు, సిరలు. ఈ నాళాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే ధమని గోడలపై ఫలకాలు ఏర్పడతాయి. దీనివల్ల రక్తప్రసారానికి ఆటంకాలు ఏర్పడతాయి. రక్తనాళాలు ఇరుగ్గా మారుతాయి. రక్తాన్ని పంపు చేయడానికి గుండె ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఇలా పని చేయాల్సి వచ్చినప్పుడు ఒత్తిడి అధికంగా పడి గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది.


రక్తంలోని అధిక చక్కర స్థాయిలు శరీరంలో ఇన్ఫ్లమేషన్‌కు కారణం అవుతాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదించాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అధిక రక్తపోటు రాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు రక్తంలో బ్లడ్ షుగర్‌ను చెక్ చేసుకోవడం అవసరం.


రోజులో గంట నడవడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం, బరువు పెరగకుండా జాగ్రత్త పడటం, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే తీపి పదార్థాలు పూర్తిగా దూరంగా ఉండాలి. తెల్ల అన్నాన్ని తినడం తగ్గించాలి. తాజా ఆకుకూరలతో, కూరగాయలతో వండిన ఆహారాన్ని తినాలి. పండ్లు అధికంగా తింటూ ఉండాలి. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇవన్నీ చేస్తే రక్తంలో చక్కర స్థాయిలో అదుపులో ఉంటాయి. డయాబెటిస్ అదుపులో లేకపోతే మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోతే మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి.


Also read: వర్క్ ఫ్రం హోం మీకు ఎంత హాని చేస్తుందో తెలుసా? దీనివల్ల ఆరోగ్యపరంగా అంతా చెడే



Also read: ఇంట్లో ఒకే సబ్బును కుటుంబ సభ్యులంతా ఉపయోగించవచ్చా?




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.