Soap Sharing: నలుగురు ఉన్న కుటుంబంలో నాలుగు సబ్బులు వాడరు. ఒకే సబ్బును నలుగురూ వాడుకుంటారు. అయితే ఆ నలుగురి చర్మ తత్వాలు ఒకేలా ఉంటాయా? ఈ విషయం వారికి తెలియదు. ఒకే సబ్బుతో నలుగురు స్నానం చేయడంహానికరం అని చెబుతున్నాయి అధ్యయనాలు. నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారయినా... నలుగురి చర్మతత్వాలు వేరు వేరుగా ఉండొచ్చు. వారి పద్ధతులు కూడా వేరుగా ఉండొచ్చు. కొందరు అతి శుభ్రంగా ఉంటే, కొందరు సాధారణ శుభ్రతనే పాటిస్తారు. ఒకే కుటుంబంలో ఉన్నంత మాత్రాన... అందరూ ఒకే సబ్బును వాడాలన్న నియమం లేదు. కానీ ఎక్కువమంది చేసే పని ఇది. ఇలా ఒకే సబ్బును నలుగురు కుటుంబ సభ్యులు వాడడం మంచిది కాదు. ఎందుకో తెలుసుకుందాం.


ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఇంట్లో ఉన్న అందరూ ఒకే సబ్బుతో స్నానం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఒకరు ఒక సబ్బు వాడాక, ఆ సబ్బుపై కొన్ని రకాల సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ. సబ్బుపై అధికంగా  E. Coli,  సాల్మొనెల్లా, ఫిగేల్లా వంటి బాక్టీరియాలు, నోరో వైరస్, రోటా వైరస్, స్టాఫ్ వైరస్ వంటి క్రిములు ఉండే అవకాశం ఉంది. ఇవి ఒకరి నుంచి ఒకరికి త్వరగా సోకుతాయి. ఒకరు వాడిన సబ్బును మరొకరు వాడితే ఇలాంటివి వ్యాపించే అవకాశం ఎక్కువ. దీనివల్ల బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారిలో తీవ్రమైన సమస్యలు రావచ్చు. కాబట్టి ఒకరి సబ్బులను మరొకరు వాడకపోవడమే మంచిది.


ఇంటిల్లపాదీ ఒక్కొక్కరూ ఒక్కో సబ్బు వాడడం అన్ని ఇళ్లల్లో జరగదు. ముఖ్యంగా మధ్యతరగతి ,పేద ఇళ్లల్లో ఒక్కొక్కరు ఒక్కో సబ్బు వాడే పరిస్థితి ఉండదు. అలాంటి వారు లిక్విడ్ సోపులను వాడితే మంచిది. లిక్విడ్ సోప్ అనేది చేతికి తగలకుండా, కేవలం ఆ లిక్విడ్‌ని చేతిలో వేసుకొని శరీరానికి రాసుకుంటారు. కాబట్టి ఈ క్రిములు లిక్విడ్ సోప్ ఉన్న డబ్బాపై చేరకుండా ఉంటాయి. సోప్ లోపలికి కూడా వెళ్లలేదు, కాబట్టి లిక్విడ్ సబ్బులను వాడడం అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకు మాత్రం ప్రత్యేకంగా సబ్బును పెట్టడం చాలా ఉత్తమం. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఒకరు వాడిన సబ్బులను పిల్లలకు వాడడం వల్ల త్వరగా బ్యాక్టీరియా, వైరస్‌లు వారి చర్మంపై చేరుతాయి. దురద, మంట, దద్దుర్లు వంటి వాటికీ కారణం కావచ్చు. శరీరం లోపలికి చేరితే ప్రమాదకరమైన వ్యాధులను కలిగించవచ్చు. కాబట్టి ఇంట్లోని పెద్దలంతా లిక్విడ్ సోపును వాడుతున్నప్పుడు పిల్లలకి మాత్రం సెపరేట్‌గా సబ్బును పెట్టడం ఉత్తమం. ఇది వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


Also read: ఆహారాన్ని చాలా వేగంగా తింటున్నారా? అయితే బరువు పెరిగిపోతారు జాగ్రత్త



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.