కొంతమంది భోజనాన్ని ఐదు నిమిషాల్లోనే ముగిస్తారు. మరి కొంతమంది అరగంట పాటు తింటారు. వేగంగా తిన్న వాళ్ళని ఏదో గొప్ప వాళ్ళలా చూస్తూ ఉంటారు, కానీ అలా వేగంగా తినడమే వారి ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. ఎవరైతే కాస్త నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ నమిలి మింగుతూ ఉంటారో, వారి ఆరోగ్యమే చక్కగా ఉంటుంది. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల నోట్లో ఎక్కువసేపు నమలరు. కేవలం ఒకటి రెండుసార్లు నమిలి మింగేస్తారు. ఇదే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి.  శాస్త్రీయంగా చెప్పాలంటే వేగంగా తినే వ్యక్తి మానసిక, భావోద్వేగ, శారీరక శ్రేయస్సు పై అనేక సమస్యలు పడే అవకాశం ఉంది.


ఆహారాన్ని సరిగా నమలకుండా మింగినప్పుడు అది జీర్ణాశయంలో విచ్ఛిన్నం అవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ ఎసిడిటీ, ఉబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ అనేది మొదట మన నోటిలోనే మొదలవుతుంది. ఆహారాన్ని నమలడం ద్వారా ముందే విచ్ఛిన్నం చేయాలి. ఇది శరీరంలో జీర్ణశయంలోకి చేరాక మరింతగా విచ్ఛిన్నమై సులువుగా జీర్ణం అవుతుంది. అదే ఆహారాన్ని నమలకుండా త్వరగా మింగేయడం వల్ల ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినేస్తారు. బరువు పెరగడానికి ఇది కారణం అవుతుంది.


మనం తిన్న ఆహారం మనకు సరిపోయిందో లేదో పొట్ట నిండిన అనుభూతి రావడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. కానీ కేవలం 5 నిమిషాల్లోనో, పదినిమిషాల్లోనూ ఆహారాన్ని ముగించడం వల్ల పొట్ట నిండిన అనుభూతిని మెదడు గుర్తించలేదు. అందుకే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల ఆహారం మన శరీరానికి సరిపోతుందో లేదో మెదడు అంచనా వేస్తుంది. పొట్ట నిండిన అనుభూతిని మనకు పంపించడానికి 20 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది మెదడు. కానీ అంతవరకు నమిలి తినే వారి సంఖ్య తగ్గిపోతుంది. అదనపు బరువు పెరగడం వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పొట్టనుండి వచ్చే అదనపు ఆమ్లాలు, గుండెల్లో తీవ్రమైన మంటను కలిగిస్తాయి. వేగంగా తినడం వల్ల ఊబకాయమే కాదు మధుమేహం వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇన్సులిన్ నిరోధకత పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవు. దీనివల్ల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది.


ఏం చేయాలి?
నోటి నిండా అన్నం కూరేసుకోకూడదు. కొంచెం కొంచెం గా తింటూ ఉండాలి. ఆహారాన్ని బాగా నమలాలి. ఒక ముద్ద అన్నం నోట్లో పెట్టుకున్నాక కనీసం పది సార్లు అయినా ఆ అన్నాన్ని నమాలాలి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. తినే ముందు రెండు మూడు సిప్‌లా నీటిని తీసుకోవడం వల్ల అన్నం మరింతగా మెత్తగా నమలడానికి వీలవుతుంది. తినేటప్పుడు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడానికి ప్రయత్నించండి. టీవీ చూస్తూ, మాట్లాడుకుంటూ తినడం వల్ల భోజనం తృప్తిగా తిన్న ఫీలింగ్ రాదు. 



Also read: నీళ్లు తాగితే ఎంతో మంచిది, కానీ ఈ మూడు సందర్భాల్లో మాత్రం తాగకండి

































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.