చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనపై పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ దాడిలో చిత్తూరుకు చెందిన కీలక నేతల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. ఆ దిశగానే కేసులు నమోదు చేస్తూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే 62 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరికొందర్ని అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. 


టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో జరిగిన ఘర్షణల్లో  చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ లీడర్లపై కేసు నమోదయ్యాయి. అమర్‌నాథ్‌ రెడ్డి, నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి, గంటా నరహరి, చిన్నబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నరహరి వాహనంలో తనిఖీలు చేసినట్టు గన్, 1.5 లక్షల రూపాయల డబ్బు, 3 మద్యం సీసాలు, పార్టీ కండువాలు గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. గొడవల్లో వీళ్ల ప్రమేయం ఉందని అనుమానంతో ఐపీసీ 120B, 307, 341, 352, 336, 506 రెడ్‌విత్ 34 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఆదివారం మీడియాతో మాట్లాడిన పలమనేరులో అడిషనల్ ఎస్పీ కె.లక్ష్మీ.. 62 మందిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. సాగునీటి విధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరు మీదుగా తిరుపతి వెళ్తున్న టైంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై కేసులు రిజిస్టర్ చేసిన పోలీసులు 62 మంది టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. 


చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాలతో ఘటనకు సంబంధించి దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ చెప్పారు. ముందుగా చెప్పిన ప్లాన్‌లో లేకున్నప్పటికీ చంద్రబాబు రోడ్ షో ను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీన పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు(చల్లా రామచంద్రారెడ్డి) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో టీడీపీ కార్యకర్తలను ప్రేరేపించినట్టు పిఏ గోవర్ధన్ రెడ్డి చెప్పారని తెలిపారు. 


ఈ సంఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డిని ఏ1 గా పోలీసులపై దాడికి పాల్పడి రాళ్లు, బీరు బాటిళ్లు విసిరి గాయపరిచారని, ఒక పోలీసు వాహనం, మరొక టీయర్ గ్యాస్ వాహనానికి నిప్పు పెట్టిన వారిపై వివిధ సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తాంమని. ఈ కేసులో మరికొంత మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని అడిషనల్ ఎస్పీ కే.లక్ష్మీ స్పష్టం చేశారు..


టీడీపీ నేతలపైనే ఎస్పీ ఆరోపణలు 
పుంగనూరులో చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి  కూడా చంద్రబాబుదే తప్పని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.