కరోనా తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆఫీసుల్లో విపరీత మార్పులు వచ్చాయి. పూర్తిగా  వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కార్యాలయాలు ఉన్నాయి. అలాగే మూడు రోజులు ఆఫీస్‌కు వస్తే, మూడు రోజులు ఇంటి దగ్గర పని చేసే హైబ్రిడ్ మోడల్ కూడా వచ్చాయి. కొత్తల్లో ఉద్యోగులంతా సంతోషించారు. ఇంట్లోనే  హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ దీర్ఘకాలంగా ఇలా వర్క్ ఫ్రం హోం చేసేవారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంటి నుండి పనిచేయడం అనేది ఆరోగ్యం పై ప్రతికూలతనే పెంచుతుంది. 


ఎక్కువమంది ఇంట్లో కూర్చుని గంటల తరబడి ఒకే భంగిమలో ఉంటారు. అలా  ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉంటారు. అదే ఆఫీసులో అయితే మధ్య మధ్యలో స్నేహితులతో మాట్లాడడం, వారితో బయటికి టీ తాగడానికి వెళ్లడం, ఇటూ అటూ నడవడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం కదలకుండా ఎక్కువ గంటలసేపు కూర్చుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఎముకలు, కండరాలు, కీళ్ల సంబంధిత సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలానే కొన్నేళ్లపాటు కొనసాగితే కండరాలు, ఎముకలు, కీళ్లు క్షీణిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడం వల్ల విటమిన్ డి కూడా శరీరానికి అందడం లేదు. శరీరంలో విటమిన్ డి ఎప్పుడైతే తగ్గిందో క్యాల్షియం శోషణ కూడా తగ్గిపోతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంది. ధూమపానం ఎంత హానికరమో, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పనిచేసే వర్క్ ఫ్రం హోం పద్ధతి కూడా అంతే హానికరం. ఇలా చేయడం వల్ల వెన్ను కండరాలు, ఎముకలు దెబ్బతింటాయి. ఇలా కొన్ని గంటల పాటు కదలకుండా ఉండడం వల్ల డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనే తీవ్రమైన ఆరోగ్య సమస్య రావచ్చు. దీనివల్ల కాళ్లల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. అలాగే ప్రాణాంతకమైన పల్మనరీ ఎంబోలిజం సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.


వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఎక్కువ గంటల పాటు కదలకుండా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనివల్ల నడుము వంకరగా మారే అవకాశం ఉంది. కాలక్రమేనా నడుము దిగువ భాగంలో, మధ్య భాగంలో ఉన్న కండరాలు బలహీన పడవచ్చు. దీనివల్ల నడుము నొప్పులు, మెడ నొప్పులు వస్తాయి. కాబట్టి నిశ్చల జీవనశైలిని అలవాటు చేసే వర్క్ ఫ్రం హోం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు ఏమీ లేదు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారిలో ఒత్తిడి కూడా అధికంగా ఉంటున్నట్టు చెబుతున్నారు పరిశోధనకర్తలు. ఇలా దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్న వారిలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది ఎముక ఆరోగ్యాన్ని కూడా పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తనాళాలు పరిమితంగానే రక్తాన్ని అవయవాలకు సరఫరా చేస్తాయి. దీనివల్ల కండరాలు, కీళ్లు దెబ్బతింటాయి. కొన్ని అవయవాలకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. పోషకాలు కూడా ఇది మొత్తం మీద శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు గంటలు గంటలు కూర్చోవడం మానేయాలి. రెండు గంటలకు ఒకసారైనా లేచి అటూ ఇటూ పావుగంట సేపు తిరగాలి. ఇలా ఒకే పొజిషన్లో గంటలపాటు కూర్చుంటే హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది.


Also read: ఇంట్లో ఒకే సబ్బును కుటుంబ సభ్యులంతా ఉపయోగించవచ్చా?




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.