Ice cream vs Dessert: ఇటీవల కాలంలో ఐస్‌క్రీం, గడ్డకట్టిన డెజర్ట్‌ల ప్రచారం విషయంలో వాటి లేబుల్ అంశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఏ ఉత్పత్తులను ఐస్‌క్రీమ్‌గా పేర్కొనాలి, ఏ ఉత్పత్తులను గడ్డకట్టిన డెజర్ట్‌గా పరిగణించాలనే అంశంపై చట్టం స్పష్టతనిచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011 ప్రకారం పాల పదార్థాలను మాత్రమే ముడి పదార్థంగా ఉపయోగించి ఐస్ క్రీం తయారు చేస్తారు. పాలు, పాల ఉత్పత్తులలో పుష్కలమైన వెన్న రుచికి కారణమయ్యే బ్యూట్రిక్ (C4:0) , కాప్రోయిక్ (C6:0) ఆమ్లాల కారణంగా పాల కొవ్వు.. కూరగాయల నూనెల కంటే విలక్షణంగా భిన్నంగా ఉంటుంది. ఫలితంగా కూరగాయల నూనెతో తయారయ్యే ఘనీభవించిన డెజర్ట్.. ఐస్‌క్రీంకు భిన్నమైన రుచి కలిగి ఉంటుంది.
ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.. అందులోనూ వేసవి కాలంలో అయితే చల్లగా ఉంటుందని ఐస్ క్రీం తినాలి అనుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా అంతా ఐస్ క్రీం తినేందుకు ఆసక్తి చూపుతారు. రకరకాల రుచుల్లో ఇంకా ఆకర్షణీయ రంగుల్లో కనిపించే ఐస్‌క్రీం పాలతో తయారు చేస్తారు. వీటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఐస్ క్రీంలలో విటమిన్లు ఇంకా ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఐస్‌క్రీంను అందరూ ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్‌గా పిలుస్తారు. అలసిపోయినప్పుడు లేదా కాస్త నీరసంగా అనిపించినప్పుడు ఐస్ క్రీంని తింటే చాలు వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. నిజానికి పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. త్వరగా అలసిపోకుండా ఉండేందుకు కాల్షియం శరీరానికి చాలా అవసరం.
చర్మంతోపాటు ఎముకలు, నరాలు, శరీరంలోని వివిధ భాగాలకు ప్రోటీన్లు మేలు చేస్తాయి. ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల కణజాలం ఇంకా అలాగే కండరాలు బలపడతాయి. గోర్లు ఇంకా జుట్టు వంటి శరీరంలోని కొన్ని భాగాలకు కూడా ప్రోటీన్ అవసరమే. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది. మీ మూడ్ కనుక సరిగ్గాలేకుంటే వెంటనే ఓ ఐస్ క్రీం తింటే చాలు మామూలు స్థితికి వచ్చేస్తారు. అయితే ప్రస్తుతం అన్నింట్లోనూ నకిలీలు ఉన్నట్టే ఐస్‌క్రీంలోనూ కల్తీలు ప్రవేశించాయి. మరి ఐస్‌క్రీంలో కల్తీని గుర్తించడం ఎలా?
ఐస్‌క్రీం తయారీలో వాడే పదార్థాలు
పాలలోని కొవ్వు, కొవ్వు లేని పాల ఘనపదార్థాలు (లాక్టోస్, కాసిన్, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు మొదలైనవి), స్వీటెనర్‌లు, స్టెబిలైజర్లు, ఎమల్సిఫైయర్‌లు, నీరు, ఫ్లేవర్లు, రంగులు, పండ్లు ఐస్ క్రీం తయారీలో ఉపయోగిస్తారు.
ఐస్ క్రీంలో కల్తీ
నాసి రకం పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఐస్‌క్రీంలను కల్తీ చేస్తారు.
ఐస్‌క్రీంలో కలిపే సంకలనాలు
తక్కువ నాణ్యత, నాసిరకమైన, అనారోగ్యం కలిగించే (ఇది ఆరోగ్యానికి హానికరం) స్వీటెనర్స్ ఉదాహరణకు కార్న్ సిరప్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, గ్లూకోజ్ సిరప్ మొదలైనవి కలుపుతారు. ఐస్ క్రీం స్వాభావిక లక్షణాన్ని పెంచేందుకు, ఆకృతిని అందంగా తీర్చిదిద్దేందుకు, త్వరగా కరగకుండా గట్టిగా ఉండేందుకు, ఎక్కువ రోజులు ఉండేలా అనారోగ్యాన్ని కలిగించే రబ్బరు పదార్థాలను కలుపుతారు. వీటితో పాటు ఐస్‌క్రీం మృదుత్వాన్ని మెరుగుపరిచేందుకు, నురుగు ఎక్కువగా వచ్చేలా చేసి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు డిటర్జెంట్లు, వాషింగ్ పౌడర్ వాడతారు. నాసిరకం లేదా ఆహారంలో వాడకూడని రంగులు, వనస్పతి లేదా డాల్డా వంటి అనారోగ్య హైడ్రోజనేటెడ్ కొవ్వులు వినయోగిస్తారు. పాల ఘనపదార్థాలు, కొవ్వు లేని పాల ఘనపదార్థాలను వినియోగించాల్సిన మొత్తం కంటే తక్కువగా ఉపయోగిస్తారు.
ఇంట్లోనే ఐస్‌క్రీం కల్తీని గుర్తించడం ఎలా?
సింపుల్‌గా చెప్పాలంటే కష్టమే! డిటర్జెంట్ల ఉనికిని కాకుండా, ఐస్ క్రీం తయారీలో ఉపయోగించిన పదార్థాల నాణ్యత తనిఖీ చేయడం అంత సులభం కాదు. డిటర్జెంట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి, ఒక కప్పులో ఒక చెంచా ఐస్ క్రీం తీసుకుని, దానిపై కొద్దిగా నిమ్మరసం పిండండి. నురుగు, బుడగలు రావడం ప్రారంభిస్తే, ఐస్ క్రీంలో డిటర్జెంట్లు ఉన్నట్టు ఇది సూచిస్తుంది.
వివిధ కంపెనీలు తమ ఐస్‌క్రీం ఉత్పత్తులపై అందులో వినియోగించిన పదార్థాల వివరాలను ప్రచురిస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే అన్నింటిలో పాల ఘనపదార్థాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అందువల్ల ఘనీభవించిన డెజర్ట్‌లలో పాలు ఉండవనే ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకుండా దానిపై ప్రచురించిన వివరాలను చదవండి.
మరి రెండు ఉత్పత్తుల్లోనూ పాలు ఉంటే, వాటిలో పాలలోని కొవ్వు ఉన్నది మంచిదా.. కూరగాయల నూనె ఉన్నది మంచిదా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ఘనీభవించిన డెజర్ట్‌లలో పాలు, పాల కొవ్వులను ఉపయోగించడం కంటే కూరగాయల నూనె ఉపయోగించడం ఎందుకు లాభదాయకమని తయారీదారులు భావిస్తున్నారు? ఎందుకంటే పాల కొవ్వులతో పోలిస్తే కూరగాయల నూనె కోసం సగం కంటే తక్కువ ఖర్చుతో లభిస్తాయి.