కొరియన్ల ముఖాలు చాలా మృదువుగా ఎటువంటి మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటాయి. అందుకు కారణం వాళ్ళు పాటించే చర్మ సంరక్షణ విధానాలే. ఈ మధ్య కాలంలో కొరియన్ల బ్యూటీ టిప్స్ ని ఇతర దేశాల వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ హ్యాక్ గ్లాస్ స్కిన్. అచ్చ తెలుగులో చెప్పాలంటే గాజు చర్మం.


గ్లాస్ స్కిన్ అంటే ఏంటి?


చాలా ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా కనిపించే చర్మ ఆకృతిని గ్లాస్ స్కిన్ అని అంటారు. ఇది కొరియాకి చెందింది అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం యువత తమ చర్మ సంరక్ష కోసం పోటీ పడుతున్నారు. మెరిసే చర్మాన్ని సాధించడం కోసం చేయని ప్రయత్నాలు ఉండటం లేదు. కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది సహజ వనరుల నుంచి వచ్చే హైడ్రేటింగ్ ఎక్స్ ట్రాక్ట్ వల్ల వస్తుంది. మచ్చలు లేని చర్మాన్ని సాధించడం కోసం సహాయపడే సహజంగా లభించే హైడ్రేటింగ్ ఎక్స్ట్రాక్ట్ లు చాలా ఉన్నాయి.


గ్లాస్ స్కిన్ ని పొందటం ఎలా?


చర్మ సంరక్షణ కోసం వివిధ ప్రయత్నాలు చేయడమే కాదు సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హైడ్రేట్ గా ఉండాలి. కొరియన్ గ్లాస్ స్కిన్ మీరు పొందాలని అనుకుంటే ఈ టిప్స్ పాటించి చూడండి.


ఆయిల్ ఫ్రీ చర్మం


కొరియన్ల మొహాలు మచ్చలు లేకుండా నూనె అనేది కనిపించకుండా ఉంటాయి. అయితే ఈ అందాన్ని కాపాడుకోవాలంటే చర్మం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం క్లెన్సర్ ఉపయోగించాలి. చర్మం మీద మలినాలు, ధూళిని పోగొట్టేందుకు నురుగు వచ్చే క్లీనర్ ఉపయోగించాలి. పాలు సహజ క్లీనర్ గా ఉపయోగించుకోవచ్చు.


ఎక్స్ ఫోలియేటర్


బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వల్ల మూసుకుపోయిన రంధ్రాల వల్ల వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి ఎక్స్ ఫోలియేషన్ లేదా స్క్రబ్బింగ్ చాలా ముఖ్య. చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలని తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం శ్వాస పీల్చుకోవడానికి వీలు కలిపిస్తుంది. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ ఎక్స్‌ఫోలియేట్ చేయకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌ను తయారు చేయడానికి పెరుగుతో పాటు కొన్ని మసూర్ పప్పును కూడా మిక్స్ చేసుకోవచ్చు.


సహజ టోనర్


టోనర్లు చర్మం pH స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తేమని, మంచి ఆకృతిని ఇస్తాయి. ఎటువంటి రసాయనాలు లేని సహజ టోనర్ వాడాలి. దీని వల్ల మొటిమలు, మచ్చల సమస్య ఉండదు. చర్మ రకానికి సరిపడా టోనర్ ని ఎంచుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు ఉత్తమ టోనర్‌గా పనిచేస్తుంది.


స్కిన్ ఎసెన్స్


ఇది చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. హైలురోనిక్ యాసిడ్ చర్మానికి మంచి ఎసెన్స్. ఇది చర్మాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చి నీటిని నిలుపుకుంటుంది. చర్మం మీద ముడతలు, గీతలను తగ్గిస్తుంది.


ఫేస్ సీరం


డార్క్ స్పాట్స్ ని వదిలించుకోవడానికి ఇవి సహాయపడతాయి. సహజమైన, టాకిన్స్ లేని పదార్థాలను ఉపయోగించి చర్మానికి సరిపడా సీరం ఎంచుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫేస్ సీరం ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మ కణాలని రక్షిస్తుంది. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కొబ్బరి నూనె, కొంచెం రోజ్ వాటర్ తో కలిపి బెడ్ మీద పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు. ఇది సహజ సీరం గా ఉపయోగపడుతుంది.


మాయిశ్చరైజర్


స్కిన్ కేర్ రొటీన్ లో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పని సరి. ఇవి జిడ్డులేని చర్మాన్ని అందిస్తాయి. పసుపు, అలోవెరా జెల్, తేనె చర్మానికి అద్భుతంగా పని చేసే సహజ మాయిశ్చరైజర్లలో ఒకటి. ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సన్ స్క్రీన్ ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను ధరించడం ముఖ్యం.


ఫేస్ మాస్క్


చర్మాన్ని బట్టి ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. పొడి చర్మం అయితే తేమను పెంచుకునేందుకు తేనె మంచి మాయిశ్చరైజింగ్ గా తీసుకోవచ్చు. చర్మం రూపాన్ని మెరుగుపరచడం కోసం ఫేస్ మాస్క్ లు అవసరమే. అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ ఫేస్ మాస్క్ తేమని నిలుపుతుంది. దురద తగ్గించడంలో సహాయపడుతుంది.



Also Read: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.