ఆకుపచ్చ రంగులో ఉండే గ్రీన్ జ్యూస్ తాగాలంటే చాలా మందికి అసలు నచ్చదు. కానీ ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గ్రీన్ జ్యూస్ ఒక డిటాక్స్ డ్రింక్. కాఫీ లేదా టీకి బదులుగా మీరు పొద్దున్నే ఈ గ్రీన్ జ్యూస్ తీసుకుంటే మంచిది. పేరుకు తగినట్టుగానే ఇది ఆకుపచ్చ రంగు పదార్థాలతోనే తయారు చేస్తారు. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సెలెరీ, కాలే, పాలకూర, దోసకాయ, పార్స్లీ, పుదీనా వంటి సాధారణ పదార్థాలను మీరు ఎంచుకోవచ్చు. ఈ వెజ్ జ్యూస్ చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. దీని రుచిని మరింత మెరుగుపరుచుకోవడం కోసం అందులో కాస్త పండ్లు కూడా కలుపుకోవచ్చు. ఆపిల్, బెర్రీలు, కివీ, నిమ్మకాయ, నారింజ వేసుకోవచ్చు.


మెటబాలిజం భేష్


మెటబాలిజం నెమ్మదిగా ఉందని మీకు అనిపించినా, బరువు తగ్గాలని అనుకుంటే ఈ గ్రీన్ జ్యూస్ తీసుకోండి. తాజా ఆకుపచ్చ రసంలోని కొన్ని సమ్మేళనాలు ప్రీ బయోటిక్స్గా పని చేస్తాయి. జీర్ణాశయంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు మద్దతు ఇస్తాయి. మలబద్ధకం సమస్యని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా చూస్తుంది. క్రమం తప్పకుండా గ్రీన్ జ్యూస్ తాగితే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


ఇంట్లోనే చేసుకోవచ్చు


బరువు తగ్గేందుకు ఇదొక అద్భుతమైన డ్రింక్. మార్కెట్లో అనేక గ్రీన్ జ్యూస్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో అదనపు చక్కెర కలిగి ఉంటుంది. అందుకే వాటిని నివారించాలి. లేదంటే బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన గ్రీన్ జ్యూస్ పొందాలని అనుకుంటే ఇంట్లోనే దీన్ని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉంటాయి.


ఇది కూడా వేసుకోవచ్చు


ఆకుపచ్చ పదార్థాలతో పాటు ఇందులో జీవక్రియని పెంచే పదార్థం కూడా వేసుకోవచ్చు. అదే నిమ్మకాయ లేదంటే నారింజ. ఒక పరిశోధన ప్రకారం ఆహారంలో నిమ్మకాయ చేర్చడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇందులో థర్మోజెనిసిస్‌ జీవక్రియ ప్రక్రియలో కేలరీలు కరిగించేందుకు సహాయపడతాయి.


గ్రీన్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు


⦿ పాలకూర ఆకులు


⦿ సగం గ్రీన్ యాపిల్


⦿ కొన్ని పుదీనా ఆకులు


⦿ సగం దోసకాయ


⦿ కొన్ని చుక్కల నిమ్మరసం


తయారీ విధానం


అన్నీ పదార్థాలను శుభ్రంగా నీటిలో వేసి కడగాలి. మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ ఆకృతిలోకి వచ్చేవరకు వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే అందులో కాస్త నీరు జోడించుకోవచ్చు. ఈ జ్యూస్ చేసుకున్న వెంటనే తాగాలి. ఆరోగ్యకరమైన గ్రీన్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అందుకే మధుమేహులకు ఇది చక్కని పానీయం. ఆరోగ్యకరమే కదా అని ఈ జ్యూస్ ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. కిడ్నీలకు సమస్య ఎదురవుతుంది. అందుకే ఏదైనా మితంగా మాత్రమే తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఇలా సింపుల్ టిప్స్ పాటించి కూరగాయలు ఫ్రీజ్ చేసుకోవచ్చు