Disadvantages of EVs: ప్రస్తుతం ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను చూస్తుంటే ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే త్వరలో అవి రెగ్యులర్ ఇంజిన్ వాహనాల మాదిరిగానే ప్రతిచోటా కనిపిస్తాయి. మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ధర, రీ సేల్ వ్యాల్యూ, పనితీరు, భద్రత, సౌకర్యం మొదలైన వాటికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవాలి.


ఛార్జింగ్ టైమ్
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలలో అతిపెద్ద ప్రతికూలత దాని ఛార్జింగ్. ఇది రెగ్యులర్ వాహనాల కంటే చాలా ఎక్కువ. పెట్రోల్, డీజిల్ కారులో కొన్ని నిమిషాల్లో ఇంధనాన్ని తీసుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ కార్లు మాత్రం దాని ఛార్జర్, వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటాయి. కంపెనీలు దీనిపై పని చేస్తున్నప్పటికీ, కనీసం 20 నిమిషాల నుంచి 6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే దీన్ని భవిష్యత్తులో బాగా తగ్గిస్తారు.


ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం
దేశంలో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే, వాటికి అందుబాటులో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లు సరిపోవు. వీటిని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఛార్జింగ్ స్టేషన్‌తో పోలిస్తే ఇంట్లో చేసే ఛార్జింగ్ చాలా నెమ్మదిగా అవుతుంది.


ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ ఎలా ఉంటుంది?
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, రెగ్యులర్ వాహనాల కంటే తక్కువ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అలాగే రెగ్యులర్ వాహనాల డ్రైవింగ్ రేంజ్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఈ విషయంలో వెనకబడి ఉంటాయి.


బ్యాటరీ లైఫ్
ఎలక్ట్రిక్ కారు పూర్తిగా బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. వీటిని సాధారణ ఉష్ణోగ్రతలో సరిగ్గా మెయింటెయిన్ చేస్తే 12 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. మరోవైపు వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో దాని జీవితం 8 నుంచి 12 సంవత్సరాల వరకు తగ్గుతుంది. కొన్ని మంచి కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలపై లక్ష కిలోమీటర్ల వరకు లేదా 8 నుంచి 10 సంవత్సరాల వరకు వారంటీని అందిస్తాయి.


పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఖరీదు ఎక్కువ
ఇలాంటి ఫీచర్లతో పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి. కాలక్రమేణా ఈ గ్యాప్ తగ్గుతున్నప్పటికీ, బ్యాటరీలు ఇప్పటికీ చాలా ఖరీదైనవి. రెగ్యులర్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు నిర్వహణ, రన్నింగ్ ఖర్చు తక్కువ కూడా కాదు. ఎక్కువగా ఉంటుంది.


క్లెయిమ్ చేసినట్లుగా పర్యావరణ అనుకూలమైనది కాదు
ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి అనుకూలమైనవి అని తరచుగా చెబుతారు. వాటి వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు. లిథియం, దాని బ్యాటరీలలో ఉపయోగించిన అనేక ఇతర భాగాలు తిరిగి ఉపయోగిస్తారు. కానీ లిథియం, ఇతర భారీ లోహాల తొలగింపు ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. దీనిలో చాలా హానికరమైన వాయువులు విడుదలవుతాయి.


సర్వీస్ సెంటర్ల కొరత
మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. తద్వారా ఏదైనా సమస్య ఉంటే మీరు దాన్ని పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలను రిపేర్ చేయడం సాధారణ మెకానిక్‌కు సాధ్యం కాదు.